కమీషన్‌కు ఆశపడి సైబర్ నేరస్తులకు కరెంట్ ఖాతాల వివరాలిస్తున్న కొందరు స్థానిక వ్యాపారులు
ఆపై పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఆ సొమ్మును చిన్న దుకాణాల్లోనే ఖర్చు చేస్తున్న వైనం
సైబర్ కేసుల దర్యాప్తులో చిరువ్యాపారుల ఖాతాలను సైతం ఫ్రీజ్ చేస్తున్న పోలీసులు
దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న నేషనల్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్
చిరువ్యాపారులకు గుచ్చుకుంటున్న
ఏపీలోని కాకినాడ జిల్లా గొల్లల మాడిడాడకు చెందిన ఓ చిరువ్యాపారి బ్యాంక్ ఖాతాను రాచకొండ పరిధిలోని మేడిపల్లి పోలీసులు ఫ్రీజ్ చేశారు.
అదే రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన ఓ సెల్‌ఫోన్ వ్యాపారి బ్యాంకు ఖాతాను చెన్నైకి చెందిన సైబర్ క్రైం అధికారులు ఫ్రీజ్ చేశారు. - సాక్షి, హైదరాబాద్
ఈ రెండే కాదు... అనేక సందర్భాల్లో ఇలాంటి చిన్నచిన్న వ్యాపారస్తులు ఇబ్బందులు పడటానికి మనీమ్యూల్స్, వారు సాగిస్తున్న లావాదేవీలే కారణం అవుతున్నాయి. సైబర్ నేరాలకు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలు జరిగిన ఖాతాల ఫ్రీజింగ్, డీ–ఫ్రీజింగ్ విషయంలో స్పష్టత లేకపోవడం, దీన్ని ఆర్‌బీఐ పట్టించుకోకపోవడం, ప్రతి వ్యాపారికీ కోర్టుకెళ్లి న్యాయ పోరాటం చేసే అవకాశం లేకపోవడమే ఈ ఇబ్బందులకు కారణం అవుతోంది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ (ఎన్సీఎస్సార్సీ) సైతం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్‌తో (ఐ4సీ) కలిసి పనిచేస్తోంది.
ఎవరీ మనీమ్యూల్స్
ఏ సైబర్ నేరంలో అయినా సైబర్ నేరగాళ్ల ప్రధాన లక్ష్యం బాధితుల నుంచి అందినకాడికి దండుకోవడమే. ఇటీవల కాలంలో ఎక్కువగా సైబర్ నేరాలన్నీ విదేశాల నుంచే జరుగుతున్నాయి. అయితే కొల్లగొట్టిన సొమ్మును తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నా లేదా వాటితో లింకై ఉన్న ఫోన్ నంబర్లకు బదిలీ చేయించుకున్నా పోలీసులకు ఆధారాలు లభిస్తాయి. దీంతో సైబర్ నేరగాళ్లకు స్థానికంగా ఉండే కరెంట్ బ్యాంకు ఖాతాల అవసరం ఏర్పడుతోంది.
ఇందుకోసం సైబర్ నేరస్తులు కమీషన్ ఆశచూపి స్థానికంగా ఉండే కరెంట్ బ్యాంకు ఖాతాలున్న చిన్న, మధ్యతరహా సంస్థల వ్యాపారులను ట్రాప్ చేస్తున్నారు. ఇలా తెలిసో, తెలియకో బ్యాంకు ఖాతాల వివరాలను సైబర్ నేరగాళ్లకు అందించి కమీషన్‌ను పొందే వారిని మనీమ్యూల్స్ అంటారు.
మనీమ్యూల్స్‌కు అడ్వాన్స్‌గా రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ముట్టజెబుతున్న సైబర్ నేరస్తులు తమ ‘పని’కానిచ్చాక 10 నుంచి 15 శాతం కమీషన్‌ను మనీమ్యూల్స్‌కు సంబంధించిన ఇతర ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు.
కమీషన్ ఖర్చు చేయడానికి కొత్త మార్గాలు
మనీమ్యూల్స్ సైతం కమీషన్‌గా తమకు ముట్టే నగదును ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ మొత్తం పడే బ్యాంకు ఖాతాలను బోగస్ వివరాలతో తెరుస్తున్నారు. అలాగే తమ పేర్లతో లేని సిమ్‌కార్డుల ఆధారంగా పనిచేసే ఫోన్ నంబర్లతోపాటు సెకండ్ హ్యాండ్ ఫోన్లలో యూపీఐ యాప్స్‌ను యాక్టివేట్ చేసుకుంటున్నారు.
పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వాటిల్లో పడే మొత్తాలను సైతం తమ స్వస్థలాల్లో ఖర్చు చేయకుండా... హైవేలు, ప్రధాన రహదారుల్లో ఉన్న చిన్నచిన్న దుకాణాలను ఎంచుకుంటున్నారు. చిరువ్యాపారులకు కమీషన్ ఆశచూపుతూ ఆన్‌లైన్‌లో డబ్బు బదిలీ చేసి నగదు తీసుకోవడం లేదా మరికొన్ని చోట్ల సెల్‌ఫోన్ల వంటి వస్తువులు కొంటున్నారు. ఇలా పరోక్షంగా సైబర్ నేరాలకు సంబంధించిన సొమ్ము ఆయా వ్యాపారుల ఖాతాల్లోకి వెళ్తోంది.
బాధితుల ఫిర్యాదుతో ఖాతాల నిలుపుదల
సైబర్ బాధితుల ఫిర్యాదుతో కేసుల దర్యాప్తు చేస్తున్న పోలీసులు మనీమ్యూల్స్ ఖాతాలతోపాటు తెలియకుండా ఈ ఉచ్చులో చిక్కుకుంటున్న చిరువ్యాపారుల ఖాతాలను సైతం ఫ్రీజ్ చేస్తున్నారు. దీంతో ఆయా వ్యాపారులు వాటిని డీ–ఫ్రీజ్ చేయించుకోవడం కోసం నానాతిప్పలు పడాల్సి వస్తోంది.
సాధారణంగా మనీమ్యూల్ లేదా అతడి ఏజెంట్ ఎంత మొత్తాన్ని చిరు వ్యాపారి ఖాతాలోకి బదిలీ చేశాడో అంతే సొమ్ము ఫ్రీజ్ చేసే అవకాశం ఉండగా పోలీసులు మాత్రం ఖాతా మొత్తాన్ని ఫ్రీజ్ చేస్తూ చిరువ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
సమగ్ర విధానంపై కేంద్రం కసరత్తు చేస్తోంది
ఇండియన్ సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4.5 లక్షల మనీమ్యూల్స్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. వాటిలో అత్యధికంగా దాదాపు 40 వేల ఖాతాలు ఎస్‌బీఐకి సంబంధించినవి ఉన్నాయి. ఎయిర్‌టెల్ మనీ పేమెంట్ యాప్‌కు సంబంధించిన ఖాతాలు 5 వేల వరకు ఫ్రీజ్ అయ్యాయి.
వాటిలో కొన్ని అమాయకులైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారులవి సైతం ఉన్నాయి. తమ ప్రమేయం లేకుండా సైబర్ నేరగాళ్లు, మనీమ్యూల్స్ చేసిన వ్యవహారాలతో ఇబ్బందులు పడుతున్న చిరువ్యాపారుల అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్, డీ–ఫ్రీజింగ్‌కు సంబంధించి సమగ్ర విధానం రూపొందించడానికి కసరత్తు చేస్తోంది.– డాక్టర్ ఇ.కాళిరాజ్ నాయుడు, డైరెక్టర్, ఎన్సీఎస్సార్సీ
Comments
Please login to add a commentAdd a comment