సైబర్‌ కేటుగాళ్ల కొత్త ఎత్తు.. వాట్సాప్‌ హ్యాకింగ్‌! | WhatsApp hacking is a new level for cybercriminals | Sakshi
Sakshi News home page

సైబర్‌ కేటుగాళ్ల కొత్త ఎత్తు.. వాట్సాప్‌ హ్యాకింగ్‌!

Published Wed, Dec 11 2024 4:39 AM | Last Updated on Wed, Dec 11 2024 7:17 AM

WhatsApp hacking is a new level for cybercriminals

డార్క్‌ వెబ్‌ నుంచి వాట్సాప్‌ వాడే వినియోగదారుల ఫోన్‌ నంబర్ల సేకరణ

ఆ నంబర్లతో తమ ఫోన్లలో వాట్సాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటున్న వైనం 

తద్వారా బాధితుల వాట్సాప్‌లను అదీనంలోకి తీసుకొని సమాచార తస్కరణ 

బాధితుల పేరిట ఆప్తులకు మెసేజ్‌లు పంపి డబ్బు దండుకుంటున్న సైబర్‌ క్రిమినల్స్‌ 

ప్రజలు మూడు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్‌సీఎస్సార్సీ డైరెక్టర్‌ కాళీరాజ్‌ సూచన

సాక్షి, హైదరాబాద్‌: కంటికి కనిపించకుండా ఆన్‌లైన్‌ ద్వారా అందినకాడికి దండుకొనే సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు పంథా మార్చుకుంటున్నారు. తాజాగా వారు వేస్తున్న ఎత్తుగడే ‘వాట్సాప్‌ హ్యాకింగ్‌’. దీనికి చిత్తవుతున్న అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నట్లు ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (ఎన్‌సీఎస్సార్సీ) గుర్తించింది. 

దాదాపు నెల నుంచి జోరుగా సాగుతున్న ఈ మోసాల బారినపడకుండా ఉండాలంటే వాట్సాప్‌ వినియోగదారులు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్‌సీఎస్సార్సీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఇ.కాళీరాజ్‌ నాయుడు స్పష్టం చేశారు. కేరళలో మొదలైన ఈ తరహా నేరాలు తమిళనాడు, తెలంగాణకు సైతం విస్తరించాయని చెప్పారు. 

‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన వాట్సాప్‌ హ్యాకింగ్‌ జరుగుతున్న తీరుతెన్నులు, ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.


సైబర్‌ మోసాలు చేసేది ఇలా.. 
»  దేశవ్యాప్తంగా వాట్సాప్‌ వినియోగదారుల ఫోన్‌ నంబర్లను సైబర్‌ నేరగాళ్లకు డార్క్‌ వెబ్‌ ద్వారా కొని వాటి ఆధారంగా ప్రధానంగా వృద్ధులు, గృహిణులనే టార్గెట్‌గా చేసుకొని స్కామ్‌లకు పాల్పడుతున్నారు. 

»    ఓ వినియోగదారుడి ఫోన్‌లో ఉన్న వాట్సాప్‌ మరో ఫోన్‌లో యాక్టివేట్‌ కావాలంటే యాక్టివేషన్‌ కోడ్‌గా పిలిచే ఓటీపీ తప్పనిసరి. టార్గెట్‌ చేసిన వ్యక్తుల వాట్సాప్‌ను తమ ఫోన్లలో యాక్టివేట్‌ చేసుకోవడానికి సైబర్‌ నేరగాళ్లు పక్కా పథకం ప్రకారం కథ నడుపుతున్నారు. 

»   తొలుత తమ వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. దీన్ని యాక్టివేట్‌ చేస్తూ టార్గెట్‌ చేసిన వ్యక్తుల మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తున్నారు. వాట్సాప్‌ యాప్‌ నుంచి యాక్టివేషన్‌ ఓటీపీ అసలైన వినియోగదారుడి ఫోన్‌ నంబర్‌కు వెళ్లగానే కేటుగాళ్లు ఆ నంబర్‌కు కాల్‌ చేస్తున్నారు. 

తాము ఓ సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటూ పొరపాటున మీ నెంబర్‌ ఎంటర్‌ చేశామని.. అందువల్ల తమకు రావాల్సిన ఓటీపీ మీ నంబర్‌కు వచ్చినందున దాన్ని చెప్పాలని కోరుతున్నారు. ఇందులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకపోవడంతో తేలిగ్గా నమ్ముతున్న బాధితులు ఎదుటివారు ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో ఆ ఓటీపీ చెప్పేస్తున్నారు. దీంతో సైబర్‌ నేరగాళ్లు అప్పటికే సిద్ధం చేసుకున్న వాట్సాప్‌ యాప్‌లో ఎంటర్‌ చేస్తున్నారు.  

»  ఈ పరిణామంతో బాధితుడి నంబర్‌తో పనిచేసే వాట్సాప్‌ అతని/ఆమె ఫోన్‌ నుంచి సైబర్‌ నేరగాడి ఫోన్‌లో యాక్టివేట్‌ అయిపోతోంది. ఆ వెంటనే వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘టూ స్టెప్‌ వెరిఫికేషన్‌’కు సైబర్‌ క్రమినిల్స్‌ మార్చేస్తున్నారు. దీనివల్ల బాధితుల వాట్సాప్‌ సైబర్‌ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోతోంది. అనంతరం వాట్సాప్‌ బ్యాకప్‌ నుంచి బాధితుడి కాంటాక్ట్స్, ఇతర వివరాలను తమ ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. 

»  వాట్సాప్‌ కాంటాక్ట్స్‌ ఆధారంగా స్నేహితులు, సన్ని హితులను గుర్తించి వారికి బాధితులు పంపినట్లే సందేశం పంపుతూ వైద్య అవసరాల పేరిట డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు. బ్యాకప్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న ఫొటోలను మార్ఫింగ్‌ చేయడం ద్వారా ఆయా వ్యక్తులు ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నట్లు చూపిస్తున్నారు. 

»  ఇలా సందేశాలు అందుకున్న వాళ్లు డీపీ, ఫోన్‌ నంబర్‌ చూసి తమ వారే ఆపదలో ఉన్నారని భావించి వీలైనంత మొత్తం బదిలీ చేస్తున్నారు. 

»  కొన్ని కాంటాక్ట్స్‌కు వాట్సాప్‌ క్యూఆర్‌ కోడ్‌ పంపి స్కాన్‌ చేయించి వాట్సాప్‌ను అ«దీనంలోకి తీసుకుంటున్న సైబర్‌ నేరస్తులు.. ఆ తర్వాత అప్పటికే సంగ్రహించిన బాధితుడి వాయిస్‌ ఆధారంగా ఏఐ సాంకేతికతను వినియోగించి వారి పరిచయస్తులు, బంధువులకు ఫోన్‌ చేసి ఆస్పత్రిలో ఉన్నామని చెప్పి డబ్బు గుంజుతున్నారు. 

»  కొన్ని సందర్భాల్లో బాధితుడికి సంబంధించిన వ్య క్తిగత, సున్నిత సమాచారాన్ని అడ్డం పెట్టుకొని దా న్ని ఆన్‌లైన్‌లో పెడతామని భయపెట్టి వీలైనంత మేర దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

»   సైబర్‌ నేరస్తులు కాజేసేవి చిన్న మొత్తాలే కావడంతో అనేక మంది ఫిర్యాదు చేయట్లేదు.

వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..
» వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌ ఆప్షన్‌ ను ఎంచుకోవాలి. అందులో ‘టూ స్టెప్‌ వెరిఫికేషన్‌’ను యాక్టివేట్‌ చేసుకోవాలి. దీనివల్ల ఒకవేళ ఆ నంబర్‌తో కూడిన వాట్సాప్‌ను సైబర్‌ నేరస్తులు మరో ఫోన్‌లో యాక్టివేట్‌ చేసేందుకు మాయమాటలతో ఓటీపీ తెలుసుకున్నా.. వినియోగదారులు ముందే క్రియేట్‌ చేసి పెట్టుకున్న 6 అంకెల యాక్టివేషన్‌ పిన్‌ నంబర్‌ వారికి తెలియనందున మరో ఫోన్‌లో వాట్సాప్‌ యాక్టివేట్‌ కాదు.  

» డీపీలు, స్టేటస్‌లను ‘ఓన్లీ కాంటాక్ట్స్‌’కు మాత్రమే కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

» వీలైనంత వరకు చాట్‌ బ్యాకప్‌ను తగ్గించుకోవాలి. అందుక వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ను ‘నన్‌’అని ఎంపిక చేసుకొని యాక్టివేట్‌ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటో డౌన్‌లోడ్‌ ఎంచుకోవద్దు. ఆటో డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ వల్ల ఒకవేళ సైబర్‌ నేరస్తులు ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను మాల్‌వేర్‌ రూపంలో పంపితే వినియోగదారుడి ప్రమేయం లేకుండా ఆ వైరస్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయ్యే ప్రమాదముంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement