హైదరాబాద్, సాక్షి: హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ విచారణ ముగిసింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్ ట్యాంక్ సీఐ ఎదుట ఆయన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అరగంటకుపైగా ఆయన్ని విచారణ జరిపినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 4వ తేదీన కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్(Banjara Hills) పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ ఆయన ఫిర్యాదు చేయబోయారు. అయితే ఆ సమయంలో బంజారాహిల్స్ ఇన్స్‌పెక్టర్ రాఘవేందర్ బయటకు వెళ్తున్నారు. దీంతో.. సీఐ వాహనానికి తన వాహనాన్ని అడ్డు పెట్టి కౌశిక్ రెడ్డి హల్‌చల్ చేశారు. ఈ ఘటనపై సీఐ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో..
పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై కేసు నమోదు అయ్యింది. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్ పీఎస్‌లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు.
నా తప్పేమీ లేదు: కౌశిక్‌రెడ్డి
మాసబ్ ట్యాంక్ పీఎస్ లోపలికి వెళ్లే క్రమంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నేను చేసిన తప్పేమీ లేదు. విచారణకు పూర్థిస్తాయిలో సహకరిస్తా’’ అన్నారు. అయితే తన అడ్వొకేట్(Advocate)తో కలిసి ఆయన లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా సిబ్బంది అడ్డుకున్నారు. ఆపై ఆయన విజ్ఞప్తితో ఉన్నతాధికారులను సంప్రదించి.. అనంతరం వాళ్లను లోపలికి వెళ్లనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment