హద్దు మీరితే లోపలేయండి | Revanth Reddy Proposes Fast Track Courts for Drug and Cybercrime Cases: Telangana | Sakshi
Sakshi News home page

హద్దు మీరితే లోపలేయండి

Published Sat, Dec 7 2024 3:50 AM | Last Updated on Sat, Dec 7 2024 3:50 AM

Revanth Reddy Proposes Fast Track Courts for Drug and Cybercrime Cases: Telangana

పోలీస్‌స్టేషన్‌కు వచ్చి డాబూ దర్పం ప్రదర్శిస్తే సహించాల్సిన పనిలేదు 

నేరగాళ్లు ఎవరైనా హోదా ఉండదు.. ప్రొటోకాల్‌ వర్తించదు.. వారి విషయంలో పోలీసులు కఠినంగానే వ్యవహరించాలి 

హోం శాఖ విజయోత్సవాల్లో సీఎం రేవంత్‌

డ్రగ్స్, సైబర్‌ నేరాల విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడి 

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన రేవంత్, భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: ‘బాధితులను ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. నేరగాళ్లు రాజకీయ నాయకులైనా, అధికారులైనా సరే.. ఎలాంటి హోదా ఉండదు. ప్రొటోకాల్‌ వర్తించదు. నేరం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించండి. పోలీస్‌స్టేషన్లకు వచ్చి డాబూ దర్పం ప్రదర్శిస్తూ హడావుడి చేసేవాళ్లను సక్కగా తీసుకుపోయి బొక్కలో వేయండి. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రజాప్రతినిధులకు పోలీసులు మర్యాద ఇవ్వడం ఎంత ముఖ్యమో..పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజాప్రతిధులు సహా ఎవరైనా పోలీసులతో మర్యాదగా ప్రవర్తించడం అంతే ముఖ్యం.

పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించేవారి పట్ల మర్యాదగా ఉండాల్సిన పనిలేదు. ఈ మేరకు ఈ వేదిక నుంచే పోలీస్‌ శాఖలోని అన్ని స్థాయిల సిబ్బందికి.. ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా నేను ఈ విషయంలో స్పష్టత  ఇస్తున్నా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం నెక్లెస్‌ రోడ్డులోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో హోంశాఖ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అగ్నిమాపక శాఖకు చెందిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఆ తర్వాత పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డీజీపీ జితేందర్, ఇతర సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అగ్నిమాపక శాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ లోగోను ఆవిష్కరించారు. అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి డిప్యూటీ సీఎంతో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.

ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ
‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వంలో పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో పనిచేశారు. కానీ గత ఏడాదిగా పైరవీలకు తావులేకుండా సమర్థత ఆధారంగా పోస్టింగ్‌లు ఇస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్లు లేనందున రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయి. శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే బాధ్యత పోలీసుల చేతుల్లోనే ఉంది. ప్రజా ప్రభుత్వంలో 4 కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛ అనే ఏడో గ్యారంటీని అమలు చేశాం..’ అని సీఎం పేర్కొన్నారు. 

డ్రగ్స్, సైబర్‌ నేరాల కేసుల్లో 6 నెలల్లోనే శిక్ష
‘గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు మహమ్మారితో పాటు సైబర్‌ నేరాలు సవాల్‌ విసురుతున్నాయి. డ్రగ్స్‌ కట్టడికి ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడితే రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతుంది. కాబట్టి డ్రగ్స్‌ కట్టడికి ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలి. డ్రగ్స్, సైబర్‌ నేరాల కేసుల్లో ఆరు నెలల్లోనే విచారణ పూర్తి చేసి శిక్షలు విధించేలా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. డ్రగ్స్, సైబర్‌ క్రైం నియంత్రణ కోసం బీటెక్, ఎంటెక్‌ చదివిన విద్యార్థులను డేటా అనాలసిస్‌ కోసం వాడుకోవాలని డీజీపీని ఆదేశిస్తున్నా. అదేవిధంగా నగరాన్ని పట్టిపీడిస్తున్న కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలి..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 

పోలీసులు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవాలి
‘క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్‌ శాఖ సిబ్బంది దాన్ని ఉల్లంఘించడం సరికాదు. పోలీసులు ఆందో ళనలు చేయడం వల్ల సమస్యల పరిష్కారం మరింత జఠిలం అవుతుంది. పోలీస్‌ సిబ్బంది తమ సమ స్యలేవైనా ఉన్నతాధికారుల దృష్టికి తేవాలి. అధికా రుల వద్ద పరిష్కారం కాకపోతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తేవాలి. అక్కడా పరిష్కారం కాక పోతే నేను స్వయంగా పోలీసుల సమస్యలు పరిష్క రించే బాధ్యత తీసుకుంటా..’అని సీఎం తెలిపారు. 

అందరి కోసం పోలీస్‌: డిప్యూటీ సీఎం 
ప్రజా ప్రభుత్వంలో కొంతమంది అవసరాల కోసం కాకుండా, సమాజ అవసరాల కోసం మాత్రమే పోలీస్‌ వ్యవస్థ పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్‌ నగరంతో పా టు రాష్ట్రాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దడం కో సం ఫ్రెండ్లీ పోలీస్‌ కార్యాచరణ ప్రణాళిక తీసుకుని ముందుకు వెళుతున్నామని తెలిపారు. పోలీసు వ్యవస్థకు ఎలాంటి అవసరాలు ఉన్నా తీర్చడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. డీజీపీ జితేందర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్‌ సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉందని, డయల్‌ 100కు సమాచారం అందిన పది నిమిషాల్లోనే బాధి తుల వద్దకు చేరుకుంటున్నామని చెప్పారు. 

ఆకట్టుకున్న విన్యాసాలు..అబ్బురపర్చిన జాగిలాలు 
విజయోత్సవాల్లో భాగంగా ఆక్టోపస్‌ సిబ్బంది ప్రద ర్శించిన విన్యాసాలు అలరించాయి. పోలీస్‌ బ్యాండ్‌ బృందాలు ఆకట్టుకున్నాయి. పోలీస్‌ జాగిలాలు తమ ప్రదర్శనతో అబ్బురపరిచాయి. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, మేయర్‌ విజ యలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్‌ డీజీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్, అగ్ని మాపక శాఖ డీజీ నాగిరెడ్డి ఐపీఎస్‌ లు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మానవీయ కోణంలోనే ట్రాన్స్‌జెండర్లకు బాధ్యతలు
‘సమాజంలో నిరాదరణకు గురైన ట్రాన్స్‌జెండర్లను మానవీయ కోణంలో ఆదుకునేందుకే వారికి తాత్కాలిక విధానంలో ట్రాఫిక్‌ అసి స్టెంట్‌లుగా విధులు అప్పగిస్తున్నాం. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద యాచించే ట్రాన్స్‌జెండర్లను నేను గతంలో చూశా. అందుకే వారికి ట్రాఫిక్‌ విధులు అప్పగించి, నెలకు గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే 50 మంది ట్రాన్స్‌జెండర్లకు నియామక పత్రాలు ఇచ్చాం. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెంచుతాం. ఇందిరమ్మ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ట్రాన్స్‌జెండర్లకు ఇస్తాం. అన్ని విధాలా అండగా ఉంటాం. ఈ అవకాశాన్ని ఉపయో గించుకుని ట్రాన్స్‌జెండర్లు క్రమశిక్షణతో మెల గాలి..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

హోంగార్డులకు రోజుకు రూ.వెయ్యి
వీక్లీ పరేడ్‌ అలవెన్స్‌ రూ.100 నుంచి రూ.200కు పెంపు
వచ్చే జనవరి నుంచి అమలు

హోంగార్డుల రైజింగ్‌ డే సందర్భంగా వారికి సీఎం రేవంత్‌రెడ్డి వరాలు ప్రకటించారు. ‘పోలీసు లతో సమానంగా పనిచేస్తున్న హోంగార్డులకు భరోసా ఇస్తున్నా. రాష్ట్రంలో దాదాపు 14 వేల మందికి పైగా హోంగార్డులు పనిచేస్తున్నారు. డిసెంబర్‌ 6 హోంగార్డ్స్‌ రైజింగ్‌ డే సందర్భంగా మీ సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నాం. రోజువారీ భత్యాన్ని రూ.921 నుంచి రూ.1,000కి పెంచుతున్నాం.

అలాగే వీక్లీ పరేడ్‌ అలవెన్స్‌ రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం. హోంగార్డులు ప్రమాదవశాత్తు కానీ, సహజ మరణం కానీ పొందితే కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వంటి మెరుగైన వైద్య సహాయాన్ని కూడా హోంగార్డులకు అందిస్తాం. ఈ నిర్ణయాలన్నీ 2025 జనవరి 1 నుంచి అమల్లోకి తెస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement