సైబర్ నేరగాళ్లకు చుక్కలు చూపించిన వైనం
మనీలాండరింగ్ కేసు అంటూ నేరస్తుల బెదిరింపులు
రూ.25 లక్షలు పంపకుంటే డిజిటల్ అరెస్ట్ చేస్తామని హూంకరింపు
ధైర్యంగా ఎదుర్కొన్న వృద్ధుడు.. నిందితుల అరెస్ట్
బంజారాహిల్స్ (హైదరాబాద్): సైబర్ నేరగాళ్లు బెదిరిస్తే చదువుకున్నవాళ్లు, ఐటీ ఉద్యోగులు, యువతే బెదిరిపోయి వారి వలలో ఇరుక్కుని లక్షల్లో నష్టపోతున్నారు. అయితే ఓ 80 ఏళ్ల వృద్ధుడు మాత్రం వాళ్ల మోసాన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా, భారీ ఆర్థిక నష్టం నుంచి తప్పించుకున్నాడు. వివరాలు...బంజారాహిల్స్ రోడ్డునంబర్ 12లో నివాసం ఉండే పెంచికల రఘునందన్‌రెడ్డి (80)ని శంకర్‌కుమార్ అనే వ్యక్తి సంప్రదించాడు.
ప్రోస్టేట్ కేన్సర్‌కు ఆయుర్వేద చికిత్స గురించి తెలియజేస్తూ, తన తండ్రికి పూర్తిగా నయమైందంటూ నమ్మబలికాడు. ఆ తర్వాత అశోక్ యాదవ్ అనే వ్యక్తి 4వ తేదీన రఘునందన్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. మీ గురించి శంకర్‌కుమార్ చెప్పాడని, ఇంట్లో ఆయుర్వేద కషాయాన్ని తయారుచేయమని వృద్ధుడిని బలవంతం చేశాడు. అనంతరం రఘునందన్‌రెడ్డిని వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఓ ఆయుర్వేద దుకాణానికి తీసుకువెళ్లాడు.
అక్కడ మనోజ్ అనే వ్యక్తి వివిధ మూలికలతో కూడిన మందుల ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఆ మొత్తం దాదాపు రూ.9,26,820 కాగా, అడ్వాన్స్‌గా రూ.76,800ల నగదు, రూ.7,50,000లకు చెక్కును రఘునందన్‌రెడ్డి ఇచ్చాడు. అయితే శంకర్‌కుమార్ తన తండ్రి చికిత్సకు రూ.40 వేలు మాత్రమే ఖర్చయ్యాయని చెప్పిన విషయం రఘునందన్‌రెడ్డికి గుర్తుకువచ్చి తనను మోసం చేశారని గ్రహించాడు. దీంతో బ్యాంకుకు వెళ్లి చెక్కు చెల్లింపులను నిలిపివేయించాడు.
లైన్‌లోకి సైబర్ నేరగాళ్లు..
దీంతో నిందితులు ఇచ్చిన సమాచారంతో ఆ తర్వాత నుంచి ఢిల్లీ పోలీసులమని, సీబీఐ అధికారినంటూ కొందరు రఘునందన్‌రెడ్డికి ఫోన్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. నీపై మనీ లాండరింగ్ యాక్ట్ కేసు నమోదైందని, వెంటనే రూ.25 లక్షలు పంపించకపోతే డిజిటల్ అరెస్టు చేస్తామంటూ బెదిరించారు.
వీడియో కాల్‌లో సైబర్ నేరస్తుడు పోలీసు ఆఫీసర్ డ్రెస్‌లో బెదిరించి దడదడలాడించినా రఘునందన్‌రెడ్డి తొణకలేదు. ఇలా గంట, రెండు గంటలు కాదు..ఏకంగా ఐదున్నర గంటల పాటు వృద్ధుడిని ఇబ్బంది పెట్టారు. ఇదంతా సైబర్ మోసగాళ్ల పనిగా గ్రహించిన వృద్ధుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కేన్సర్‌కు ఆయుర్వేద మందు పేరుతో తనను మోసగించిన వ్యక్తులే తన నుంచి పూర్తి వివరాలు రాబట్టి సైబర్ మోసగాళ్లకు సమాచారం ఇచ్చి లక్షలు లాక్కోవాలని పథకం వేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు శంకర్‌కుమార్, అశోక్‌యాదవ్, మనోజ్‌లతో పాటు రాపిడో ఏజెంట్‌పై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment