సైబర్ కాప్స్‌కూ అంతుచిక్కని కేసు
సాక్షి, హైదరాబాద్: ఇదో చిత్రమైన సైబర్ కేసు. బాధితురాలి బ్యాంకు ఖాతా నుంచి డబ్బు ఎలా మాయమైందో ఆమెకే కాదు... సైబర్ క్రైమ్ పోలీసులకూ అంతుచిక్కట్లేదు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. అసలేం జరిగిందంటే.. నగరానికి చెందిన ఓ గృహిణిని (59) ఫేస్‌బుక్‌లోని ప్రకటన ఆకర్షించింది. మహిళలకు సంబంధించిన వస్త్రాలను తక్కువ ధరలకు విక్రయిస్తున్నామనేది దాని సారాంశం.
ఆ వ్రస్తాలు ఖరీదు చేయడానికి ఆసక్తిచూపిన ఆమె, ప్రకటన ఇచ్చిన వారిని సంప్రదించారు. తన కావాల్సినవి ఆర్డర్ ఇవ్వడంతో పాటు రూ.1.5 లక్షలు చెల్లించారు. ఆపై ఆ గృహిణికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు డెలివరీ చేయాల్సిన బాయ్ అనారోగ్యానికి గురయ్యాడని, ఫలితంగా సరుకు అందించలేకపోతున్నామని వివరణ ఇచ్చారు. ఈ కారణంగా మీరు చెల్లించిన మొత్తం రిఫండ్ చేస్తున్నామని అన్నారు.
దానికోసం బ్యాంకు ఖాతాను సరిచూసుకోవాల్సి ఉందంటూ రెండు దఫాల్లో రూ.1, రూ.10 బదిలీ చేశారు. ఆ మొత్తం చేరిందా? లేదా? అనేది ఆమెను సంప్రదించి ఖరారు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా... ఆ తరువాత బాధితురాలి ఖాతాలో ఉండాల్సిన రూ.1,38,171 మాయమయ్యాయి.
తనకు ఎలాంటి ఓటీపీ రాలేదని, అయినప్పటికీ డబ్బు పోయిందంటూ ఆమె శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. ఈ స్కామ్ ఎలా జరిగిందో అర్థంకాక తలలు పట్టుకుంటున్న పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు.
సైబర్ నేరాల అవగాహనకు ‘మూడు కోతులు’
సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ‘డిజిటల్ ఏజ్ త్రీ మంకీస్’ను తెరపైకి తెచ్చారు. నాటి మూడు కోతులు ‘చెడు మాట్లాడ వద్దు–చెడు చూడవద్దు–చెడు వినవద్దు’అంటే.. నేటి ఈ ‘డిజిటల్ కోతులు ‘ఎవరికీ ఓటీపీ చెప్పవద్దు–తెలియని లింకులు తెరవద్దు–నకిలీ ఫోన్ కాల్స్ వినవద్దు’అంటున్నట్లుగా రూపొందించారు. దీన్ని తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా విçస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment