సూడో పోలీసుకు అరదండాలు | Fake police officer apprehended for extorting money in Hyderabad | Sakshi
Sakshi News home page

సూడో పోలీసుకు అరదండాలు

Published Sat, Jun 15 2024 10:28 AM | Last Updated on Sat, Jun 15 2024 10:29 AM

Fake police officer apprehended for extorting money in Hyderabad

స్టార్‌ హోటల్స్‌కు వచ్చే విటులే ఇతడి టార్గెట్‌ 

బెదిరిస్తూ అందినకాడికి దండుకుంటున్న వైనం 

నిందితుడిని అరెస్టు చేసిన నార్త్‌జోన్‌ టాస్‌్కఫోర్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  స్టార్‌ హోటళ్లకు వచ్చే విటులనే టార్గెట్‌గా చేసుకుని దాదాపు ఏడేళ్లుగా బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్న సూడో పోలీసు సన్నీ జాదవ్‌ను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిని 2017లో ఇదే తరహా నేరంపై మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ సాధన రష్మి పెరుమాల్‌ శుక్రవారం పేర్కొన్నారు. ఈ నిందితుడి నుంచి రూ.4 లక్షల నగదు, ద్విచక్ర వాహనం తదితరాలు స్వా«దీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పార్శిగుట్టకు చెందిన సన్ని సోమాజీగూడలోని ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆన్‌లైన్‌ గాంబ్లింగ్‌తో పాటు గుర్రపు పందాలకు అలవాటుపడిన ఇతడికి నెలనెలా వచ్చే జీతం సరిపోలేదు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం పోలీసు అవతారం ఎత్తాడు. ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న ఓ ఎస్సై గుర్తింపు కార్డులో మార్పుచేర్పులు చేసి తన ఫొటో, పేరు పొందుపరిచాడు. 

దీన్ని తన ఫోన్‌లో సేవ్‌ చేసుకున్న ఇతగాడు అసలు కథ మొదలెట్టాడు. ఆన్‌లైన్‌తో పాటు వివిధ డేటింగ్‌ యాప్స్‌ ద్వారా యువతులను బుక్‌ చేసుకునే అలవాటు ఉన్న ఇతగాడు వారిని కలవడానికి, సన్నిహితంగా గడపడానికి కొన్ని స్టార్‌ హోటల్స్‌లోని రూమ్స్‌కు వెళ్లేవాడు. ఇలా ఇతడికి ఏఏ హోటల్‌లో ఏఏ రూమ్స్‌లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతాయనే విషయం తెలిసింది. దీంతో ఆయా గదులకు వెళ్లి వచి్చన తర్వాత లేదా సమీపంలో కాపు కాయడం ద్వారా వాటిలోకి ఎవరు వెళ్లి వస్తున్నారో గుర్తించే వాడు. వాళ్లను అడ్డగించి పోలీసునంటూ బెదిరించే వాడు.

 ఆపై హోటల్‌ టెర్రస్‌ లేదా సమీపంలోని ప్రాంతానికి తీసుకువెళ్లి అరెస్టు చేస్తానంటూ భయపెట్టేవాడు. ఆ గదిలో తాను ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలో తతంగం మొత్తం రికార్డు అయిందని, దాన్ని కుటుంబీకులకు పంపుతానని తీవ్రంగా భయపెట్టేవాడు. ఇలా వారి నుంచి అందినకాడికి అందుకుని పంపేవాడు. 2017లో మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత బెయిల్‌పై వచ్చి తన పంథా కొనసాగించాడు. ఇతడి బారినపడిన వాళ్లు కూడా తాము కూడా తప్పు చేశామని, బయటపడితే పరువుపోతుందని మిన్నకుండిపోయే వారు. దీంతో ఇతడిపై ఎక్కడా కేసులు నమోదు కాలేదు. 

అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో సికింద్రాబాద్‌లో ఉన్న ఓ స్టార్‌ హోటల్‌లో ఓ వ్యక్తిని సన్ని పట్టుకున్నాడు. అతడిని తన స్టైల్‌లో బెదిరించి రూ.5 లక్షలతో పాటు 2 తులాల బంగారం గొలుసు తీసుకుని విడిచిపెట్టాడు. ఆపై మరోసారి అతడికి ఫోన్‌ చేసి భయపెట్టిన సన్ని మరో రూ.5 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. అయినప్పటికి వదలకుండా బెదిరింపులకు పాల్పడటంతో ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నార్త్‌జోన్‌ టాస్‌్కఫోర్స్‌ ఎస్సైలు శ్రీనివాసులు దాసు, పి.గగన్‌దీప్, బి.అశోక్‌ రెడ్డి వలపన్ని సన్నిని అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని గాంధీనగర్‌ పోలీసులకు అప్పగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement