కేవీపల్లె/పీలేరు: ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టాస్‌్కఫోర్స్ పోలీసులను కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. వివరాలు.. తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి సోమవారం రాత్రి కేవీపల్లె, సుండుపల్లె మండలాల సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టారు.
ఆర్‌ఎస్‌ఐ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆరుగురు సిబ్బంది కేవీ పల్లె మండల సరిహద్దు వద్ద గస్తీ కాస్తుండగా.. మంగళవారం తెల్లవారుజామున కేఏ 02 ఎంజీ 2847 నంబర్ కలిగిన స్విఫ్ట్ కారు అటుగా దూసుకువచ్చింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కారును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ కారు వేగంగా వచ్చి కానిస్టేబుల్ బి.గణేశ్(40)ను ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే గణేశ్ మృతి చెందాడు.
టాస్‌్కఫోర్స్ పోలీసులు కారును చుట్టుముట్టేసరికి ముగ్గురు స్మగ్లర్లు పారిపోగా.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఏడు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరూ తమిళనాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కృష్ణారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. వివరాలను తెలుసుకున్నారు. కానిస్టేబుల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
గణేశ్ కుటుంబానికి అండగా ప్రభుత్వం
విధి నిర్వహణలో గణేశ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న సీఎం జగన్ మానవత్వంతో స్పందించారు. గణేశ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి తక్షణ సాయంగా రూ.30 లక్షలు ప్రకటించారు. ఈ విషయాన్ని అనంతపురం డీఐజీ వెంకటేశ్వర్లు, అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు చెప్పారు. పీలేరు ప్రభుత్వాస్పత్రి వద్ద గణేశ్ మృతదేహానికి డీఐజీ, ఎస్పీ, టాస్‌్కఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ నివాళులర్పించారు. గణేశ్ కుటుంబసభ్యులను ఓదార్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. గణేశ్‌కు నివాళులర్పించిన వారిలో డీఎస్పీ మహబూబ్‌బాషా, డీఎఫ్‌వో వివేక్, ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వో సుబ్బారెడ్డి, ఎఫ్‌ఆర్‌వో రామ్లానాయక్, సీఐలు మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులున్నారు.
శోకసంద్రంలో కుటుంబసభ్యులు
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గుట్టకిందపల్లెకు చెందిన గణేశ్.. 2013 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. తిరుపతి టాస్‌్కఫోర్స్‌లో కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తూ.. తిరుపతిలోనే నివాసం ఉంటున్నారు. గణేశ్‌కు భార్య అనూషతో పాటు కుమారులు రాజకిశోర్(6), వేదాన్‡్ష(3) ఉన్నారు. పీలేరు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన గణేశ్ కుటుంబసభ్యులు.. అతని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment