గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌.. అరె ఓ సాంబా.. ఇంకా ఏం వదిలినమో రాసుకోరా! | Sarikonda Chalapathi Satirical Artical About GST On essential Foods | Sakshi
Sakshi News home page

గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌.. అరె ఓ సాంబా.. ఇంకా ఏం వదిలినమో రాసుకోరా!

Published Mon, Aug 1 2022 11:06 AM | Last Updated on Mon, Aug 1 2022 2:04 PM

Sarikonda Chalapathi Satirical Artical About GST On essential Foods - Sakshi

ఉచితంగా విద్యుత్, రెండు గ్యాస్‌ సిలిండర్లు, కాలేజీ అమ్మాయిలకు టూ వీలర్స్‌ ఇస్తాం.. ఇది బీజేపీ మొన్నటి ఎన్నికల హామీ
తీయని మిఠాయిల మాదిరి ఉచితాల ద్వారా ఓట్లు దండుకునే సంస్కృతి చాలా ప్రమాదకరం.. ఇది నిన్నటి మోదీ మాట  

ఈ రెండు వాక్యాలకు పుట్టినిల్లు ఉత్తరప్రదేశే.. ఈ రెండు వాక్యాల మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఐదు నెలలు మాత్రమే.ఇంత తక్కువ వ్యవధిలోనే మాట, మూడ్‌ మారిపోతుందా? 
ఒక్కోసారి అంతే.. ఈ కథ చదవండి పాత కథే.. 

అనగనగా ఒక ఊర్లో ఒకాయన ఉన్నారు. ఆయనకు అత్యవసరంగా ఓ పని పడింది. ఆ పని అయితే ఊర్లో ఉన్న ఇల్లు అమ్మి ప్రజలందరికీ ఫ్రీగా డబ్బు కానీ, బహుమతి కానీ ఇస్తానని రాములోరికి మొక్కుకున్నాడు. ఇంత మంచి ఆలోచనను దేవుడు కాదంటాడా.. తథాస్తు అన్నాడు.. పనైపోయింది.. ఆల్‌ హ్యాపీస్‌. కానీ ఇక ఫ్రీగా ఇచ్చే టైం వచ్చింది. మాటైతే ఇచ్చాడు.. కానీ ఫ్రీగా ఇవ్వటానికి మనసు రావడం లేదు. ఉత్తి పుణ్యానికి ఇల్లమ్మి అందరికీ ఇవ్వాలా అని మథన పడసాగాడు. కానీ రాములోరి మొక్కు కదా తప్పదు.. ఎలా అని ఆలోచించగా మనోడికి పొలిటికల్‌ లీడర్‌ లెవెల్లో ఓ ఐడియా వెలిగింది.

ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ధర ఒక్క రూపాయి మాత్రమేనని ఎనౌన్స్‌ చేశాడు.. కానీ, తన పిల్లిని కొంటేనే ఇల్లు అమ్ముతానని షరతు పెట్టాడు.. పిల్లి ధర రూ.25000 అన్నాడు. వేలం నడిచింది.. ఇల్లు అమ్ముడుపోయింది. ఇంటి మీద వచ్చిన ఒక్క రూపాయిని మాత్రం ఫ్రీగా పంచేశాడు. రాముడికి మాటిచ్చింది అదే కదా.. న్యాయం ప్రకారం పిల్లికి వచ్చిన డబ్బులు పంచక్కర్లేదు. అవి జేబులో వేసుకున్నాడు. ఇది చదివి ఉచిత హామీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ జాగా అమ్మకాలు అని ఏవేవో అన్వయించుకోకండి.. ఊరికే ఓ కథ అంతే.. 

పంజాబ్‌లో ‘ఉచిత విద్యుత్‌’అచ్చొచ్చిన కేజ్రివాల్‌ ఇప్పుడు చీపురు పట్టుకొని గుజరాత్‌లో తిరుగుతున్నాడు.. ‘ 300 యూనిట్ల ఫ్రీ పవర్‌’ అంటూ. అందుకే మన పెద్దమనిషి మోదీకి ఉచితాలపై చిర్రెత్తుకొస్తోందని ఓ టాక్‌.. అవును.. ఇప్పుడు పన్నులు మాత్రమే ‘ఉచితం.’ఎన్ని కావాలంటే అన్ని, దేనిమీద కావాలంటే దానిమీద వేసుకోవచ్చు. కావాల్సినంత ఫ్రీగా. దేశానికేం ప్రమాదం లేదు. 

‘డబుల్‌’ఇంజన్ల భారం.. 
‘ఉచితాల’సంగతి సరే గానీ తక్కువ ధరల్లో మా బతుకు నడవనీయండి.. ‘డబుల్‌ ఇంజన్లు’(ఒకటి మోదీ ది.. మరొకటి కేసీఆర్‌ ది) లాగలేక పోతున్నామని జనం గోల. బండి ఎక్కితే మోదీ.. బస్సు ఎక్కితే కేసీఆర్‌.. గ్యాస్‌ ఆన్‌ చేస్తే మోదీ, కరెంట్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తే కేసీఆర్‌ గుర్తుకు వస్తున్నారు. (కరెంటు, డీజిల్, బస్‌ చార్జీలతో..) ఇక మన నిర్మలా సీతారామన్‌ అయితే నట్టింట్లో.. ఇంకా చెప్పాలంటే వంటింట్లో కూడా మనతో తిరుగుతున్నట్టుగా ఉంటుంది.. పప్పు, ఉప్పు, పెరుగు, బియ్యం.. ఇలా ఏం టచ్‌ చేసిన ఆమె గుర్తుకొస్తున్నారు. జీఎస్టీ రుచి తెలుస్తోంది .. ‘‘ఈ డబుల్‌ ఇంజన్లు మన బతుకు బండిని లాగుతున్నాయా.. మనమే మన బతుకు బండితో పాటు ఈ డబుల్‌ ఇంజన్లను లాగుతున్నామా?’’.. అని మిడిల్‌ క్లాసులో ఓ ప్రశ్న. 

అచ్చం కిరాణా దుకాణంలా.. 
ఇప్పుడు గడ్కరీకి రాజకీయాలపై విరక్తి పుట్టినట్టే.. ఓ జర్నలిస్టు మిత్రుడికి తన ఉద్యోగంపై ఆసక్తి పోయింది. కిరాణా షాపు పెట్టుకుని బతుకుదాం అనుకున్నాడు. తెలిసిన ఒక సీనియర్‌ షావుకారు దగ్గరికి వెళ్లి ఒపీనియన్‌ అడిగాం. ఆయన మమ్మల్ని కిందా మీదా చూసి.. ఏం అమ్మితే ఎంత పర్సంటేజ్‌ వస్తుందో, ఏయే సరుకుల్లో ఎంత మిగులుతుందో తెలుసా? అని అడిగారు. మా వెర్రి ముఖాలు చూసి ఆయనే సమాధానం చెప్పారు. ఓవరాల్‌ 13–14% వరకు మిగిలే కిరాణా వ్యాపారంలో చిన్న చిన్న వస్తువులు.. ఆవాలు, జీలకర్రలాంటి చిన్న చిన్న సరుకులపై 20% మిగులుతుందని చెప్పాడు..

వాటితో పాటు ఎక్కువ పర్సంటేజ్‌ మిగిలే వస్తువుల లిస్టు చకచకా వల్లెవేశాడు. లూజుగా అమ్మితే ఎంత, ముందే ప్యాక్‌ చేసి పెట్టుకుంటే ఎంత టైమ్, డబ్బులు మిగులుతాయో చెప్పారు. పాలు, పెరుగు అమ్మితే ఎంత మిగులుతుందో.. 5 నుంచి 20 శాతం మార్జిన్లలో ఉన్న సరుకుల లిస్టు చెప్పేశారు. కిరాణా వెనుక ఇంత గణాంకాల గొడవ ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు.. ఇంతకీ కిరాణా షాప్‌ పెట్టాడో లేదో మీకు తెలిసే ఉంటుంది. 

వాడే.. తాజాగా ఫోన్‌ చేసి ‘మన షావుకారును నిర్మలా సీతారామన్‌ ఏమైనా కలిసిందేమిట్రా’అని ఫోన్‌ చేశాడు. రకరకాల వస్తువులపై ఆమె వేసిన జీఎస్టీ లిస్ట్‌ షేర్‌ చేశాడు.  
పెరుగు, లస్సీ, బట్టర్‌ మిల్క్, పనీర్, బెల్లం, తేనె, చక్కెర, బియ్యం, గోధుమలు, మరమరాలు.. ఇలా ఏ ఆహార పదార్థాన్ని వదలకుండా అనేక వస్తువులపై ఐదు శాతం జీఎస్టీ వేసేశారు.. ప్యాక్‌ చేస్తే చాలు బ్రాండెడ్‌ కానక్కర్లేదు.. అన్‌ బ్రాండెడ్‌ అయినా సరే. (..ఇలాంటివే 80 శాతం ఇండియన్లు కొంటారని ఓ అంచనా) ‘‘అంటే నిర్మలమ్మకు డబ్బులు ఎక్కడినుంచి రాబట్టాలో, ఎలా కిరాణా కొట్టు నడపాలో బాగా తెలుసన్నమాట. మన షావుకారు లాగే’’ అని జోకేశాడు. 

శ్మశానంతో సహా.. ఎక్కడా తగ్గలే.. 
ఫోర్క్‌లు, కత్తులు, పెన్సిల్‌ షార్పెనర్లు.. ఇలా ఒక్కటీ వదలలేదు.. 12 నుంచి 18 శాతం జీఎస్టీ బాదేశారు.. ఇల్లంతా తిరుగుతూ ఉంటే నిర్మలమ్మ ట­చ్‌ చేయని ఒక్క వస్తువూ ఇంట్లో కనిపించడం లేదు. ఎల్‌ఈడీ లైట్స్‌ పై కూడా 18శాతం.. గోడకు వేలాడే పిల్లలు చదువుకునే చార్టుల నుంచి అట్లాసు­ల దాకా 12శాతం వేసేశారు. చివరికి బ్యాంకు చెక్కు­లకు చెల్లించే డబ్బులపైన 18 శాతం జీఎస్టీ ఉంది. డైమండ్స్‌ పై 1.5 శాతం,బంగారంపై 3 శా తం హాస్పిటల్‌ బెడ్స్‌ రూ.5,000 దాటితే, హోటల్‌ రూ­మ్‌ రెంట్‌ రూ.1,000 దాటితే 5శాతం.. చివరికి శ్మశాన సేవల్ని కూడా 18 శాతానికి 
పెంచారు.. 

సోషల్‌ మీడియా.. పాలిటిక్స్‌ 
ఇంత బాదినా గుంతల్లో పడిన హైదరాబాదీలాగా కిందా మీదా పడి బతుకును నడిపేస్తున్నారేగానీ.. ఒక్కరూ నోరు తెరవడం లేదు. గతంలో డీజిల్‌ పావలా పెరిగితే.. సిలిండర్‌ రూపాయి పెరిగితే.. కరెంటు చార్జీలు పెంచుతారని తెలిస్తే చాలు ధర్నాలు, కేకలూ వినపడేవి. పక్కన కాసిన్ని ఎర్ర జెండాలు కనిపించే సరికి యువ రక్తం పొంగి బస్సు అద్దాలపై నాలుగు రాళ్లు పడేవి.. ఇప్పుడు అదేం లేదు. పైగా మన ఆక్రోశాన్ని ఏ ఫేస్‌బుక్‌లోనో, ట్విట్టర్‌ లోనో పోస్ట్‌ చేద్దామంటే ఆ ‘నాలుగు రాళ్లు’మనపై పడుతున్నాయి. 

‘ఏందీ అన్యాయం.. గ్యాసు ధర, డీజిల్‌ ఇలా పెరిగితే ఎలా బతకడం.. తినే ప్రతిదానిపైనా జీఎస్టీ అంటే ఎలా..’అని అంటే చాలు. వందల కామెంట్స్‌ విరుచుకుపడుతున్నాయి. ‘కేసీఆర్‌ పెంచిన బస్సు రేట్లతో సామాన్యులపై ఎక్కువ భారం పడుతోంది తెలుసా’అని రోజువారీ లెక్కలు వేసి నెలకు ఎంత ఖర్చవుతుందో చెప్తున్నారు. కరెంట్‌ బిల్లులు షేర్‌ చేస్తున్నారు. మనను కేసీఆర్‌ టీమ్‌లో కలిపేస్తున్నారు. 

‘అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న కౌన్సిలే కదా జీఎస్టీ పెంచేది.. మీ సీఎం మీ ఆర్థిక మంత్రులు ఏం చేస్తున్నారు?’అని ప్రశ్నిస్తున్నారు.  పోనీ కరెంటు చార్జీలపై, బస్సు చార్జీలపై క్వశ్చన్‌ చేస్తే.. ‘జీఎస్టీ ధరలు పోస్ట్‌ చేసి మోదీ ఏం చేశాడో చూశారా..?’అంటూ కాసిన్ని బూతులు కలిపి, డీజి­ల్‌ చార్జీలు, పెట్రోల్‌ చార్జీలు పెరుగుతున్న ద్రవ్యో­­ల్బణాన్ని చూపుతూ విరుచుకుపడుతున్నారు. మనను మోదీ టీమ్‌లోనో, బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న వాడిలాగానో చూస్తున్నారు. 

కేంద్రం బాదినా, రాష్ట్రం బాదినా మోగేది మన మన వీపే కదా.. అంటే వినేదేలే.. ఇంకోటుంది.. ‘భారతీయుడి’టైప్‌ సెక్షన్‌. పన్ను­ల గురించి చర్చ చేస్తే చాలు.. ‘‘అసలు పన్నుల్లేకుండా దేశాన్ని నడపడం ఎట్లా?.. శ్రీలంక లాగా మన దేశాన్ని దిగజారుస్తారా? రూ.500 పెట్టి సిని­మాకు వెళ్తారు గానీ, వంద పెట్టి పెట్రోల్‌ పోయించుకోలేరా?’’అని వెటకారాలు గుమ్మరిస్తున్నారు. నెటిజన్లు రాజకీయ వర్గాలుగా డివైడ్‌ అవుతున్నారా? రాజకీయ వర్గాలే సోషల్‌ మీడియాను ఆపరేట్‌ చేస్తున్నాయా?.. ఇదో డౌట్‌.. ఇదం­­తా ఎందుకనీ.. ఈ కడుపు మంటని మీమ్స్‌ లాగా, జోక్స్‌ లాగా షేర్‌ చేసుకుని ఏడవలేక నవ్వుతున్నారు. అన్నట్టు ఇప్పుడు జీఎస్టీ అంటే గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌గా సోషల్‌మీడియాలో హల్‌చల్‌ అవుతోంది.

ఇది బాగుంది.. జీఎస్టీ ధమ్‌ బిర్యానీ 
 జీఎస్టీ ధమ్‌ బిర్యానీ అట. నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.. ‘‘12 శాతం జీఎస్టీ పెట్టి కొన్న పాత్రలో.. 5 శాతం జీఎస్టీ వేసిన ప్యాకేజ్డ్‌ చికెన్, పెరుగు, కారం, మసాలాలు వేసి.. ప్రస్తుతానికి జీఎస్టీ లేని ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. దాన్ని 28 శాతం జీఎస్టీ పెట్టి కొన్ని ఫ్రిడ్జ్‌ లో అరగంట పెట్టాలి. తర్వాత 18శాతం జీఎస్టీ చెల్లించి కొన్న స్టవ్‌ను 12 శాతం జీఎస్టీతో కొన్న అగ్గిపెట్టెతో వెలిగించి.. 12 శాతం జీఎస్టీ వేసిన అల్యూమినియం పాత్ర పెట్టాలి. ఫ్రీగా వచ్చే నీళ్లు, జీఎస్టీ లేని హోల్‌ స్పైసెస్‌ వేసి.. 5శాతం జీఎస్టీ బాస్మతి రైస్‌ వేసి ఉడికించుకోవాలి. 

ప్రస్తుతం బేగంబజార్‌లో జీఎస్టీ లేకుండా దొరుకుతున్న బిర్యానీ పాత్ర తెచ్చుకుని.. అడుగున 12 శాతం జీఎస్టీ ఉన్న బట్టర్‌ ను రాసి, ముందే రకరకాల జీఎస్టీ లెక్కలతో సిద్ధమైన చికెన్‌ ముక్కలను, ఆపై బాస్మతి రైస్‌ను వేసుకోవాలి. చివరిగా 5 శాతం జీఎస్టీ ఉన్న మైదాతో ‘ధమ్‌’పెట్టి.. బిర్యానీ సిద్ధం చేసుకోవాలి.’’అని.. మరొకటి ఏంటంటే.. ‘ఈ వంటంతా రూ.1,150 పెట్టి తెచ్చుకున్న గ్యాస్‌ సిలిండర్‌ మీద చేసుకోవాలి..’ 

ఓ నెటిజన్‌ ఆవేదన చూడండి.. 
‘పల్మోరిక్స్‌ట్‌ అనే టాబ్లెట్‌ జీఎస్టీకి ముందు రూ.1,100 కు వచ్చేది. ఇప్పుడు రూ.1,370 అవుతోంది. అప్పట్లో బిల్లు నెలకు రూ. 7,000 అయ్యేది. ఇప్పుడు రూ..10,000 అవుతోంది. ఈ ట్యాబ్లెట్లు మింగకపోతే చస్తావని డాక్టర్లు అంటున్నారు.. ఇది నాకు భారమే కదా..’  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement