Pranahita Pushkaralu: పుష్కరాలు షురూ.. తరలిన భక్త జనం | 12 Day Pranahita Pushkaralu Begins In Mancherial Bhupalpally | Sakshi
Sakshi News home page

Pranahita Pushkaralu: పుష్కరాలు షురూ.. తరలిన భక్త జనం

Published Thu, Apr 14 2022 10:31 AM | Last Updated on Fri, Apr 15 2022 8:12 AM

12 Day Pranahita Pushkaralu Begins In Mancherial Bhupalpally - Sakshi

ప్రాణహిత నదిలో పూజలు చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ సుమన్‌ దంపతులు

సాక్షి, మంచిర్యాల/భూపాలపల్లి /కాళేశ్వరం: ప్రాణహిత పుష్కర సంబురం మొదలైంది. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం సాయంత్రం 4 గంటలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వేమనపల్లి ఘాట్‌ వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పుష్కరాలను ప్రారంభించారు. వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, వైదిక క్రతువులు నిర్వహించారు. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ వెంట.. 
మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాణహిత నది.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో ప్రవహించి, కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఈ మేరకు ప్రాణహిత నది వెంట పలుచోట్ల పుష్కరాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

ఇతర రాష్ట్రాలవారు మంగళవారం సాయంత్రానికే ప్రాణహిత తీరాలకు చేరుకుని.. తాత్కాలిక గుడారాల్లో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత పుష్కరాలు మొదలవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసి.. పిండ ప్రదానాలు, ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. సమీపంలోని ఆలయాలను దర్శించుకున్నారు. గురువారం నుంచి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. 

కాళేశ్వరంలో దేవాదాయశాఖ అధికారులు, వేదపండితులు కాలినడకన కలశాలు, మంగళ వాయిద్యాలతో ప్రాణహిత నదికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.54 గంటలకు పడవలో నదికి అవతలివైపు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. నదికి పంచ కలశాలతో ఆవాహనం చేసి.. పుష్కరుడి(ప్రాణహిత)కి చీర, సారె, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం పంచ కలశాలల్లో నీటిని తీసుకొచ్చి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామివారికి అభిషేకం, పూజలను నిర్వహించారు. ఇక కాళేశ్వరానికి అనుకుని అవతలివైపు ఉన్న మహారాష్ట్ర పరిధిలోని సిరొంచలో ఆ రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఎమ్మెల్యేలు పుష్కరాలను ప్రారంభించారు. 

మంచిర్యాల జిల్లా పరిధిలోని రెండు ఘాట్లలో తొలిరోజు 10 వేల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్టు అంచనా. ఇక్కడికి తొలిరోజున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా తరలివచ్చారని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ సాయంత్రం ఆరు గంటలకు నదీ హారతి ఇచ్చారు. అర్జునగుట్ట వద్ద కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసభ్యులతోపాటు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, జెడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ పాల్గొన్నారు. 

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: ఇంద్రకరణ్‌రెడ్డి 
గోదావరి ఉప నదిగా మనకు ప్రాణహిత పుష్కలంగా నీరందిస్తోంది. స్వరాష్ట్రంలో తొలిసారిగా ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్నాయి. ఇది సంతోషకరం. పుష్కర సమయంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు హరిస్తాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు అన్నిరకాల మేలు జరగాలని కోరుకున్నానని మంత్రి తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. 

‘ప్రాణహిత’ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ 
సాక్షి, హైదరాబాద్‌:  ప్రాణహిత పుష్కరాల కోసం తెలంగాణ స్టేట్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌టీడీసీ) ప్రత్యేక యాత్ర ప్యాకేజీని బుధవారం ప్రారంభించింది. హైదరాబాద్‌ నుంచి కాళేశ్వరం వరకు ఈ నెల 24దాకా అంటే 12 రోజుల పాటు ఈ ప్రత్యేక యాత్ర నడుస్తుంది. రోజూ ఉదయం 05:00 బషీర్‌బాగ్‌ సీఆర్‌వో నుంచి బస్సు బయలుదేరుతుంది, 8:30 గంటలకు అల్పాహారం ఉంటుంది. 11:00 గంటల సమయంలో కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 వరకు సిరోంచ పుష్కరఘాట్‌ వీక్షించేందుకు సమయమిస్తారు.

తర్వాత గంటపాటు దర్శన సమయం, 1.45 గంటలకు కాళేశ్వరం హరిత హోటల్లో భోజనం ఉంటాయి. 2.45 గంటలకు తిరుగు ప్రయాణమై రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ యాత్ర ఏసీ బస్సు టికెట్‌ ధర పెద్దలకు రూ.2,200, పిల్లలకు రూ.1,760, నాన్‌ఎసీ బస్సు టికెట్‌ ధర పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600గా ఉంటాయని టీఎస్‌టీడీసీ ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement