కాళేశ్వరం పుష్కర ఘాటు వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి
సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నది వరద ప్రవాహం కాళేశ్వరం పుష్కరఘాట్ల వద్ద నాలుగు రోజుల కిందట 10.70 మీటర్ల ఎత్తు ఉంటే.. ప్రస్తుతం 5.44 మీటర్లకు చేరింది. ప్రస్తుతం లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి ఇన్ ఫ్లో 75వేల క్యూసెక్కులు వస్తుండగా.. 14 గేట్లు ఎత్తారు. 75వేల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్తోంది. బ్యారేజీలో ప్రస్తుత నిల్వ 5.812 టీఎంసీలు. సరస్వతీ(అన్నారం) బ్యారేజీకి ఇన్‌ఫ్లో 2300 క్యూ సెక్కులు ఉండగా.. 66 గేట్లు మూశారు. ప్రస్తుతం బ్యారేజీలో 7.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
వరదలు తగ్గితేనే మోటార్లు రన్!
కన్నెపల్లి పంపుహౌస్‌లో నెల రోజులుగా మోటార్లు నడవడం లేదు. తెలంగాణ, మహారాష్ట్రల్లో వర్షాలు పూర్తిగా తగ్గితేనే మోటార్లు మళ్లీ నడవనున్నాయని అధికారులు తెలిపారు. గత నెలలో ఆరు మోటార్లకు వెట్‌రన్ నిర్వహించగా సుమారు 1,560 గంటలు మోటార్లు నడవగా.. 15 టీఎంసీల నీరు ఎగువకు తరలించిన విషయం తెలిసిందే. వర్షాలు లేకుంటే సెప్టెంబర్ మొదటి వారం నుంచి మోటార్లు నడిచే వీలున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment