పెండింగ్‌ పనులకు నిధులిస్తాం | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ పనులకు నిధులిస్తాం

Published Sun, Jan 21 2024 4:17 AM

Deputy CM Bhatti Vikramarka About Funds Calculations Of Projects: TS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అవసరమైన రోడ్లను మెరుగు పరచటంతోపాటు రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్‌ పనులకు నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్య మంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో కలిసి ఆ శాఖ బడ్జెట్‌ సన్నాహక సమావేశంలో సమీక్షించారు.

రాష్ట్ర వ్యా ప్తంగా జరుగుతున్న పనులు, వాటికి సంబంధించి చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులు, ప్రస్తుత అవసరా ల గురించి  అధికారులను అడిగి వివరాలు తెలుసు కున్నారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో అధికారులు వారికి వివరించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఆలైన్‌మెంట్‌ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఇష్టం వచ్చినట్టు కాకుండా, క్రమ పద్ధతిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా  ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు.

ఆ ప్రాజెక్టు భూసేకరణతోపాటు కలెక్టరేట్‌ భవనాల నిర్మాణం, రోడ్లకు సంబంధించిన పనులకు నిధులు కేటాయించాలని అధికారులు కోరారు. సీఐఆర్‌ఎఫ్‌ పనులకు భూసేకరణ నిధుల కొరత లేకుండా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా, భట్టి విక్రమార్క అంగీకరించారు. చేప ప్రసాదం పంపిణీ, బోనాల ఉత్సవాలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కూడా కోరారు.

సినీ భూములను కాపాడాలని ఆదేశాలు
సినిమాటోగ్రఫీ అంశంపై జరిగిన చర్చలో,  సినిమా పరిశ్రమ అభివృద్ధి  కోసం కేటాయించిన భూముల ను కాపాడాలని ఉపముఖ్యమంత్రి భట్టి ఆదేశించారు.  సామాజిక బాధ్యతలో భాగంగా డ్రగ్స్‌ లాంటి మహమ్మారిలకు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో సినీ సెలబ్రిటీలు పొల్గొనేలా చూడాలని సూచించారు. నంది అవార్డుల కార్యక్రమం నిర్వహణపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.  చిన్న నిర్మాతల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సినిమా హాళ్లలో చిరుతిళ్ల ధరలను నియంత్రించాలని, ఆన్‌లైన్‌ టికెటింగ్‌ కోసం వేసిన కమిటీ నివేదిక వచ్చాక వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

చిత్రపురి కాలనీలో అవకతవకలపై దృష్టి పెట్టాలి: కోమటిరెడ్డి
చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవ కలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నందున ఆ విష యంలో కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి  శ్రీనివా సరాజు, ఆర్థికశాఖ జాయింట్‌ సెక్రెటరి హరిత, ఉప ముఖ్యమంత్రి కార్యదర్శి కృష్ణ భాస్కర్, సమాచార శాఖ కమిషన్‌ అశోక్‌రెడ్డి, ఈఎన్సీలు రవీందర్‌ రావు, గణపతిరెడ్డితో పాటు సీఈలు మధుసూధన్‌ రెడ్డి, సతీష్, మోహన్‌ నాయక్‌  పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement