సాక్షి, సిటీబ్యూరో: మనిషికి ఏ రోగం లేకపోయినా ఆస్పత్రికి వెళ్లి బాడీ చెకప్ చేయించుకుంటాం.. ఎందుకంటే.. జబ్బు చేసినప్పుడు కంటే ముందే పరీక్షలు చేస్తే శరీరంలో రోగాలను మొగ్గలోనే గుర్తించి వైద్యం చేయవచ్చు. వాహనాలకు ఇలాగే సాధారణ సర్వీసింగ్ చేయిస్తాం. అప్పుడు ఇంజిన్‌లో లోపాలుంటే గుర్తించి రిపేర్లు చేస్తారు. ఇదేవిధంగా రోడ్లకు కూడా ‘పిరియాడికల్ ప్రివెంటివ్ మెయింటనెన్స్’ (పీపీఎం) చేస్తారు. అంటే వ్యాధి గుర్తించకముందే మనుషులకు హెల్త్ చెకప్‌లా.. రోడ్లు దెబ్బతినక ముందే నిర్ణీత కాలవ్యవధుల్లో పరీక్షలు చేసి మరమ్మతులు చేయడమన్నమాట.
ముంబై మహానగరంలో ఇందుకోసమే ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు గుర్తించారు. నగరంలోనూ అదే పద్ధతిలో రోడ్లు పూర్తిగా దెబ్బతినకముందే బాగు చేసేందుకు సిద్ధమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. బీటీ, సీసీ, వైట్‌టాప్ తదితర రోడ్లకు మొత్తం రూ.720 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో బీటీ రోడ్లకే రూ.381.36 కోట్లు మంజూరు చేశారు. వీటిని వేసవిలోనే పూర్తి చేయాలని భావించిన అధికారులు పనులకు సిద్ధమయ్యారు. వర్షాకాలం వచ్చేలోపు మరమ్మతులు పూర్తయిపోవాలని ప్రణాళికలు వేసి పనులు చేపట్టారు. కానీ అనుకున్న గడువులోగా అవి పూర్తి కాలేదు. కొన్ని ఇంకా ప్రారంభమే కాలేదు. వర్షాకాలం వచ్చినా ఈ రోడ్ల పనులు పూర్తికాకపోవడంతో ఈసారి ప్రజలకు తిప్పలు తప్పేలా లేవు. ఈ సీజన్‌లో రూ.150 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యే అవకాశముంది. మిగతావివర్షాకాలంలోగా పూర్తయ్యే పరిస్థితి లేదు.
బాగున్నవీ తవ్విపోశారు..
‘పీపీఎం’లో భాగంగా రోడ్ల మరమ్మతులకు నిధులు, అనుమతులు రావడంతో బాగున్న రోడ్లను సైతం తవ్వేశారు. ఇలా ఎందుకు తవ్వారో అర్థం కాని పరిస్థితి. ప్రజలు మాత్రం కాంట్రాక్టర్ల లాభం కోసమే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. బాగున్నవి తవ్వి పూర్తి చేయకపోవడంతో తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పనులు చేపట్టినవన్నీ ప్రధాన ప్రాంతాల్లో, బస్సులు తిరిగే మార్గాల్లో ఉండడంతో, పూర్తి కాకపోతే సమస్యలు మరింత తీవ్రం కానున్నాయి.
నాణ్యతలో రాజీ లేదు: జియాఉద్దీన్,చీఫ్ ఇంజినీర్
పీపీఎం అయినప్పటికీ, రోడ్ల మరమ్మతుల్లో, నాణ్యతలో రాజీపడేది లేదని జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ పేర్కొన్నారు. దెబ్బతిన్న రోడ్లకు ఇప్పటి వరకు ప్యాచ్‌వర్క్స్ చేస్తుండడంతో మాణ్నాళ్లకే అవి పాడైపోతున్నాయని, అలా కాకుండా మిల్లింగ్ చేయాలని, బీటీ డెన్సిటీ, పనుల్లో నాణ్యత తదితర అంశాల్లోనూ పకడ్బందీగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. పనులు కాస్త ఆలస్యమైనా రోడ్డు పటిష్టంగా దీర్ఘకాలం మన్నికగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రోడ్డుతో పాటే రెండు వైపులా ఫుట్‌పాత్‌లు, టేబుల్ డ్రెయిన్లు, కెర్బ్‌లు తదితర పనులు కూడా జరుగుతున్నాయన్నారు.
పీపీఎంలో బీటీ రోడ్ల పనులు ఇలా..
1. మంజూరైన పనులు: 52 అంచనా వ్యయం: రూ.381.36 కోట్లు
2. పురోగతిలోని పనులు: 37 అంచనా వ్యయం: రూ.291.16 కోట్లు
3. మొదలు కాని పనులు: 11 అంచనా వ్యయం: రూ.63.40 కోట్లు
4. బిడ్ల పరిశీలనలో ఉన్న పనులు: 3 అంచనా వ్యయం: రూ.26.20 కోట్లు
5. టెండరు దశలోనే ఉన్న పనులు: 1అంచనా వ్యయం: రూ.60 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment