శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్ ఎస్.కె.జోషి
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.20 వేల కోట్లు ఆర్థిక సాయం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని.. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచాలని, రాష్ట్రంలో కొత్త సచివాలయం నిర్మాణం, రహదారుల విస్తరణ కోసం రక్షణ శాఖ పరిధిలోని స్థలాలను వెంటనే కేటాయించాలని కోరారు. సీఎం కేసీఆర్ శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్ రాష్ట్రానికి సంబం దించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. విభజన చట్టం హామీలను త్వరగా నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పది కీలక అంశాలతో వినతిపత్రాన్ని ప్రధానికి అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రస్తావించిన అన్ని అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారు.
సీఎం ఇచ్చిన వినతిపత్రాల్లో ముఖ్యాంశాలివీ
1. కాళేశ్వరానికి ఆర్థిక సాయం
తెలంగాణకు ప్రాణప్రదంగా ఉండేలా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. రూ.80 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని ఇరవై జిల్లాల పరిధిలో 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందుతుంది. మంచినీటికి, పారిశ్రామిక అవసరాలకు కూడా నీరు లభిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి రూ.25 వేల కోట్లు కేటాయించింది. వివిధ ఆర్థిక సంస్థల నుంచి మరో రూ.22 వేల కోట్ల రుణం తీసుకున్నాం. ఇంకా నిధుల అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి కేంద్రం నుంచి రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాం.
2. ‘జోన్ల’పై రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలి
తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగాల నియామకానికి పాత జోనల్ విధానమే కొనసాగుతోంది. ఆర్టికల్ 371డి ఇంకా అమలవుతోంది. ఉమ్మడి ఏపీఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఆరు జోన్లు ఉండగా.. అందులో తెలంగాణలో రెండే (5, 6) జోన్లు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక పాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. కొత్త జిల్లాల ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దానికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించగలరని కోరుకుంటున్నాం.
3. ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలి
ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు అన్ని రాజ్యాంగబద్ధ సంస్థల విభజన పూర్తయినా హైకోర్టు విభజన పూర్తి కాలేదు. కానీ ప్రత్యేక హైకోర్టు లేకపోవడంతో ప్రత్యేక రాష్ట్ర సాధన పరిపూర్ణం కాలేదు. హైదరాబాద్‌లోనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి హైకోర్టు కొనసాగుతోంది. హైకోర్టులో 29 మంది న్యాయమూర్తులుంటే.. అందులో తెలంగాణవారు కేవలం ఆరుగురే. 60:40 నిష్పత్తిలో ఆంధ్ర, తెలంగాణ న్యాయమూర్తులుండాల్సి ఉండగా.. అది అమలు కాలేదు. దీంతో తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి న్యాయవాదులు తమ హైకోర్టు తమకు ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. అటు ఏపీ ప్రజలు, అక్కడి న్యాయవాదులు కూడా తమ హైకోర్టు తమకు కావాలని కోరుకుంటున్నారు. హైకోర్టు విభజన పూర్తి చేస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి పార్లమెంటులో హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు కాలేదు. ఈ అంశంలో జోక్యం చేసుకుని తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలి.
4. రైల్వే లైన్లను త్వరగా పూర్తి చేయాలి
తెలంగాణలో రైల్వే లైన్లు జాతీయ సగటు కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరముంది. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. అక్కన్నపేట–మెదక్ రైల్వేలైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ దాదాపు పూర్తయింది. ఈ లైన్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని కోరుతున్నాం. భద్రాచలం రోడ్–సత్తుపల్లి కొత్త రైల్వేలైన్, కాజీపేట–విజయవాడ మధ్య విద్యుదీకరణతో కూడిన మూడో లైన్, రాఘవాపురం–మందమర్రి మధ్య మూడో లైన్, ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ మధ్య బ్రాడ్‌గేజ్ లైన్ల నిర్మాణం చేపట్టాలి. సికింద్రాబాద్–మహబూబ్‌నగర్, సికింద్రాబాద్–జహీరాబాద్ రైల్వే లైన్లను డబుల్ లైన్‌గా మార్చడానికి, హుజూరాబాద్ మీదుగా కాజీపేట–కరీంనగర్ మధ్య రైల్వేలైన్ నిర్మించడానికి అవసరమైన సర్వేలను నిర్వహించాలి.
5. బైసన్ పోలో గ్రౌండ్‌ను అప్పగించండి
తెలంగాణకు కొత్త సచివాలయం నిర్మించడానికి బైసన్ పోలో గ్రౌండ్ స్థలాన్ని ఇవ్వాల్సిందిగా ఇప్పటికే రక్షణ శాఖను కోరాం. ఆ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. ఇక 44వ నంబర్ జాతీయ రహదారిని, 1వ నంబర్ స్టేట్ హైవేను విస్తరించడానికి వీలుగా రక్షణ శాఖ అధీనంలోని స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి రక్షణ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆ భూములను వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేలా రహదారులను విస్తరించడం సాధ్యమవుతుంది
6. వెనుకబడిన జిల్లాల నిధులివ్వాలి
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో 9 వెనుకబడిన జిల్లాల (ఉమ్మడి జిల్లాలు) అభివృద్ధి కోసం ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.450 కోట్ల ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. కానీ 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో విడత ఆర్థిక సహాయం ఇంకా విడుదల కాలేదు. ఆ నిధులను వెంటనే విడుదల చేయాలి.
7. ఐఐఎం మంజూరు చేయండి
తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ను మంజూరు చేయాలి.
8. ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేయాలి
కేంద్ర ప్రభుత్వం 2013లో హైదరాబాద్‌కు ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను మంజూరు చేసింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ కూడా సమర్పించింది. కానీ ఆ ప్రాజెక్టును కేంద్రం ఉపసంహరించుకుందని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నట్టుగా పత్రికల్లో చదివాం. ఐదేళ్ల క్రితం మంజూరు చేసిన ప్రాజెక్టును ఉపసంహరించుకోవడం వల్ల కేంద్రం విశ్వసనీయత దెబ్బతింటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుకు నిధులిచ్చి చేయూత అందించాలి.
9. కరీంనగర్‌లో ట్రిపుల్‌ఐటీ
కరీంనగర్ పట్టణంలో ట్రిపుల్‌ఐటీని స్థాపించండి. దానికి సంబంధించి స్థలం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం గా ఉంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో సాంకేతిక విద్యావకాశాలను పెంపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కరీంనగర్‌లో ట్రిపుల్‌ఐటీ ఏర్పడితే సాంకేతిక విద్యా సంస్థలను జిల్లా కేంద్రాలకు విస్తరించినట్లవుతుంది.
10. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు
ప్రతీ జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధానంగా పెట్టుకుంది. తెలంగాణలో ఇటీవలే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం రంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్, నాగర్ కర్నూల్, నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. మిగతా కొత్త జిల్లాల్లో నవోదయ విద్యా సంస్థలు నెలకొల్పాలి. వాటికి కావాల్సిన స్థలం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment