
ఇక ‘నీటి’ షాకులు!
బాబుగారి విజన్ 2029
- సాగునీటి వినియోగానికి మీటర్లు
- దండిగా చార్జీల వసూలు
- ప్రతి ఇంటికీ మంచినీటి మీటర్లు
- వాడిన ప్రతి బొట్టుకూ చార్జీ వసూలు
- వినియోగదారులపైనే సరఫరా ఖర్చులు
- నాడు మెకన్సీ.. నేడు ఎర్నెస్ట్ యంగ్..
- చంద్రబాబు ఆదేశాలకనుగుణంగా సిఫార్సులు
- నేటి నుంచి 15 వరకు రంగాల వారీగా సమీక్షలు
సాక్షి, హైదరాబాద్ : సంవత్సరాలు మారుతుంటాయి.. కానీ చంద్రబాబునాయుడుగారి విజన్ మాత్రం ఎప్పుడూ ఒక్కటే. అదేమిటంటే జనంపై బాదుడు కార్యక్రమం. గతంలో అధికారంలో ఉండగా రెండుసార్లు నీటితీరువా చార్జీలు పెంచిన చంద్రబాబు ఇపుడు ఏకంగా సాగునీటికి మీటర్లు బిగించబోతున్నారు. అంటే సాగునీటికి చార్జీలు కట్టాల్సి ఉంటుందన్నమాట. సాగునీటికే కాదు భూగర్భజలాలపైనా ఆయన కన్నేశారు. అందుకోసం ప్రత్యేకమైన చట్టాలనూ చేయబోతున్నారు. అన్నదాతలను అడకత్తెరలో బిగించబోతున్నారు. మరోవైపు గృహ వినియోగదారులనూ ఆయన వదల్లేదు.
రానున్నకాలంలో ప్రతి ఇంటికీ నీటి మీటర్లను బిగించనున్నారు. ఆ మేరకు నీళ్ల చార్జీలు వసూలు చేయబోతున్నారు. గతంలో మెకన్సీ సంస్థ చేత విజన్ -2020 తయారు చేయించిన చంద్రబాబు ఇపుడు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థతో విజన్ - 2029 తయా రు చేయించారు. చంద్రబాబు ఆలోచనలకు, ఆదేశాలకు అనుగుణంగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ జనానికి వాతలు వేసే ఇలాంటి అనేక సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులపై నేటి నుంచి రంగాలవారీగా సమీక్షలు నిర్వహించబోతున్నారు. ఈనెల 15 వరకు ఈ సమీక్షలు కొనసాగనున్నాయి.
బాబుగారి బాదుడు విజన్ ఇదీ...
చంద్రబాబునాయుడు సూచనలకు అనుగుణంగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ చేసిన సిఫార్సులు ఇలా ఉన్నాయి...
► ఆంధ్రప్రదేశ్ రైతుల నిర్వహణ ఇరిగేషన్ వ్యవస్థ చట్టం 1997లో సవరణలు తీసుకురావాలి.
► ప్రతీ నీటి చుక్కను కొలిచేలాగా మీటర్లను అమర్చడంతో పాటు, నీటి వినియోగం ఆధారంగా రైతుల నుంచి చార్జీలను వసూలు చేయాలి.
► ఆంధ్రప్రదేశ్ నీటి నిర్వహణ నియంత్రణ చట్టానికి రూల్స్‌ను రూపొందించి తక్షణం అమల్లోకి తేవాలి.
► విద్యుత్ రెగ్యులేటరీ తరహాలో నీటికి కూడా ఇనిస్టిట్యూషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు రంగాల వారీగా నీటి కేటాయింపులు, చార్జీలు నిర్ధారణ చేయాలి.
► నీటి లభ్యత ఆధారంగా వ్యవసాయ, గృహ, పారిశ్రామిక రంగాలకు నీటి కేటాయింపులు చేయాలి.
► భూగర్భ జలాల వినియోగం నియంత్రణకు కొత్త చట్టం తీసుకురావాలి. కోస్తా తీరం పరిరక్షణకు ప్రత్యేకంగా ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలి.
► భవిష్యత్‌లో నీటి కొరతను అధిగమించేందుకు గాను రీసెర్చ్ చేయడానికి వీలుగా ప్రత్యేకంగా వాటర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి.
► ఎగువ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించేందుకు ఇనిస్టిట్యూట్ లేదా ఏజెన్సీని ఏర్పాటు చేయాలి.
► రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో కొత్త రాష్ట్రానికి అనుగుణంగా సాగునీటి శాఖను హేతుబద్ధీకరించడంతో పాటు పునర్‌వ్యవస్థీరణ చేయాలి.
► పట్టణాలు, పంచాయతీల్లో ప్రతీ ఇంటికీ నీటి మీటర్లను అమర్చాలి. మంచినీటి సరఫరాకయ్యే వ్యయాన్ని చార్జీల రూపంలో వసూలు చేయాలి.
► ప్రస్తుతం ఉన్న మంచినీటి చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. చార్జీలను సరఫరాకయ్యే మొత్తం రాబట్టే స్థాయిలో పెంచాలి.
► పట్టణ స్థానిక సంస్థల ఆదాయ వనరులను పెంచడంపై దృష్టి పెట్టడం ద్వారా అవసరమైన మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టాలి.
► ఆస్తి పన్నులను పెంచడంతో పాటు ఆస్తి పన్ను మదింపు సక్రమంగా చేయాలి. అప్పుడే ఆస్తి పన్ను ద్వారా ఆదాయం పెరుగుతుంది.
► పట్టణ ప్రాంతాల్లో సంస్కరణ లను తీసుకురావడం ద్వారా ఆదాయ వనరులను పెంచాలి. తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచాలి.
పక్కా వ్యాపార సంస్థల తరహాలో స్థానిక సంస్థలు..
పట్టణ స్థానిక సంస్థలలో మౌలిక వసతుల కల్పన కోసం వాటిని ఏకంగా వ్యాపారసంస్థల మాదిరిగా మార్చేసేలా చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు వచ్చే నాలుగు సంవత్సరాల్లో రూ. 52,300 కోట్ల పెట్టుబడి అవసరమని ప్రభుత్వం తేల్చింది. ఈ మేరకు ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరించేందుకు మున్సిపల్ బాండ్లను జారీ చేయడంతో పాటు పట్టణ స్థానిక సంస్థల ఆస్తుల విలువల ఆధారంగా ఆర్థిక సంస్థల నుంచి అవసరమైన నిధులను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన పౌరసేవలను అందించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు అందుకయ్యే వ్యయాన్ని రాబట్టేందుకు వ్యాపార సంస్థల తరహాలో పట్టణ స్థానిక సంస్థలను పనిచేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపట్టి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో పక్క పట్టణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులను పొందాలని ఆశిస్తున్న రాష్ర్టప్రభుత్వం ఇందుకోసం ఏకంగా 89 భారీ ప్రాజెక్టులకు సవివరమైన అంచనాలను రూపొందిస్తోంది. మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వరద నీటి డ్రైనేజీలకు సంబంధించి రూ.19,515.35 కోట్ల వ్యయం కాగల 89 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాలని ప్రభుత్వం నిర్ణయించింది.