రూ.10వేలు బకాయిపడితే నల్లా కట్
సాక్షి,సిటీబ్యూరో: నీటి బిల్లు బకాయిలు రూ.10 వేలు దాటితే నల్లా కనెక్షన్ కట్ చేయాలని జలమండలి నిర్ణయించింది.శనివారం ఖైరతాబాద్‌లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎమ్‌డీ జగదీశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుకు నెలవారీ నీటి బిల్లులు, బకాయిలతో కలిపి రూ.100 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. జలమండలికి రావలసిన బకాయిల మొత్తం రూ.వెయ్యి కోట్లకు పైగానే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో నెలవారీ బిల్లులతో పాటు బకాయిల్లో కొంతమొత్తమైనా రాబట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. నూతన కుళాయి కనెక్షన్ల జారీ, ట్యాంకర్ల ద్వారా విక్రయించే నీటి చార్జీలు అన్నీ కలిపితేరూ.100 కోట్ల రెవెన్యూ లక్ష్యం సాధించవచ్చని ఓ అధికారి తెలిపారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 8.25 లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి.
నెలవారీ ఠంఛనుగా బిల్లులు చెల్లించేవారు నాలుగు లక్షలకు మించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ, ఇతర డెరైక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.