Cut the connection
-
కర్షకుడిపై కరెంటు జులూం
వికారాబాద్: ఉచిత కరెంటుకు సంబంధించి రైతులు రూ.30 సర్వీసు చార్జి చెల్లించాల్సి ఉంటుంది. అయితే 2005 నుంచి దీని గురించి విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోలేదు. గత తొమ్మిదేళ్లకు సంబంధించి ఈ బకాయిలు ఇప్పుడు రూ. వేలకు చేరుకున్నాయి. అయితే ఈ వేల రూపాయల బిల్లును ఒకేసారి చెల్లించాలంటూ ఇప్పుడు రైతులను అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. లేకపోతే కనెక్షన్లు కట్ చేస్తూ నిర్దాక్షిణంగా స్టార్టర్లు, సర్వీసు వైర్లను సబ్స్టేషన్లలకు తీసుకెళుతున్నారు. పశ్చిమ రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 12 వేల వ్యవసాయ బోర్లకు కనెక్షన్లు కట్ చేసి స్టార్టర్లను సబ్స్టేషన్లకు తీసుకెళ్లినట్లు సమాచారం. బిల్లు కడితేనే తిరిగి విద్యుత్ స్టాటర్ ఇచ్చి కనెక్షన్‌ను పునరుద్ధరిస్తామని లేకపోతే స్టాటర్ గురించి మరిచిపోండి అంటూ విద్యుత్ సిబ్బంది చెబుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ విద్యుత్ డివిజన్ పరిధిలో 50 వేల వ్యవసాయ బావులకు ఉచిత కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికే సర్వీసు బకాయిలు చెల్లించని రైతుల కనెక్షన్లు తొలగించడం ప్రారంభమైంది. బిల్లు కట్టనందుకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా బృందాలుగా వస్తున్న విద్యుత్ సిబ్బంది కనెక్షన్లు కట్ చేసి స్టార్టర్లు తీసుకెళుతున్నారు. అయితే విద్యుత్‌శాఖకు తామొక్కరమే బకాయిలు పడలేదని,ృగహ, పరిశ్రమ శాఖలు కూడా పెద్ద మొత్తంలో బకాయి పడ్డాయని రైతులుచెబుతున్నారు. వారి నుంచి మొదట బకాయిలు వసూలు చేసి తమకు కొంత వెసులుబాటు కల్పించాలని వారు కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా కరువు ప్రభావంతో తాము పంటల సాగులో తీవ్ర నష్టాలను చవిచూశామని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఒకేసారి బిల్లు మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కనెక్షన్ కట్ చేయవద్దని వేడుకుంటున్నా పట్టించుకోకుండా స్టాటర్లు, సర్వీస్ వైర్లను సిబ్బంది తీసుకెళుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ మండల పరిధిలో గురువారం ఒక్క రోజే 100 బోరు మోటార్ల స్టాటర్లను విద్యుత్ సిబ్బంది రైతుల వద్ద నుంచి లాక్కురావడం గమనార్హం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి సర్వీసు చార్జీల చెల్లింపులో కొంత వెసులుబాటు కల్పించాలని రైతన్నలు వేడుకుంటున్నారు. -
విద్యుత్ చౌర్యంపై నిఘా
ఖమ్మం: వీధిలైట్లు, ఆర్డబ్ల్యూఎస్, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు విద్యుత్ బకాయిలు భారీగా పేరుకు పోయాయని, ఆయా శాఖల అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించకుంటే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ ఎలా కొనగలమని ట్రాన్స్‌కో సీఎండీ వెంకటనారాయణ ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, హాస్టళ్లు వంటి అత్యవసర శాఖలు మినహా ఇతర శాఖలేవైనా బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ట్రాన్స్‌కో సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో విద్యుత్ సరఫరా, బిల్లుల వసూళ్లు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరు తదితర అంశాలపై జిల్లా విద్యుత్ అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాకు సరఫరా అవుతున్న విద్యుత్‌కు, అధికారికంగా విద్యుత్ వినియోగానికి మధ్య వ్యత్యాసం ఉంటోందని, అంటే విద్యుత్ చౌర్యం జరగుతున్నట్టేనని, దీనిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. 50 యూనిట్ల కంటే అధికంగా విద్యుత్‌ను వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాల నుంచి కూడా బిల్లులు వసూలు చేయాలన్నారు. పాత మీటర్లు తొలిగించి కొత్తవి అమర్చాలని చెప్పారు. ఒక్కో ఏఈ రెండు గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాల్లో చెట్లు నరికించడం, ట్రాన్ ్సఫార్మర్ల నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు చెల్లించే సర్వీస్ చార్జీ తక్కువేనని, వీటినైనా సకాలంలో చెల్లించేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో తరచూ ట్రాన్స్ఫార్మర్ల సమస్య ఏర్పడుతోందని, దీనిని నివారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో చేపట్టిన ఆర్‌ఏపీడీఆర్‌పీ పనులు సంవత్సరాల తరబడి పెడింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల కొరత ఉన్న విషయం వాస్తవమేనని, అవసరమైన చోట సిబ్బందిని నియమించేందుకు ప్రపోజల్స్ తయారు చేసి పంపాలని అన్నారు. జిల్లా ఎస్ఈ తిరుమలరావు మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న 2750 విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించామని, ఇతర ప్రమాదకరమైన లైన్లను గుర్తించి వాటిని మరమ్మతు చేశామని చెప్పారు. ప్రతి నెల జిల్లా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో పని విధానం పరిశీలించి అవసరమైన సూచనలు ఇస్తున్నామన్నారు. సమావేశంలో ఎన్పీడీసీఎల్ డెరైక్టర్లు చంద్రశేఖర్, వెంకటేశ్వర్రావు, డీఈలు ధన్సింగ్, సురేందర్, నాగప్రసాద్, బాబురావు, సుదర్శన్, ప్రతాప్‌రెడ్డి, రవి, ఏడీలు బాలాజీ, సుస్మిత, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
రూ.10వేలు బకాయిపడితే నల్లా కట్
సాక్షి,సిటీబ్యూరో: నీటి బిల్లు బకాయిలు రూ.10 వేలు దాటితే నల్లా కనెక్షన్ కట్ చేయాలని జలమండలి నిర్ణయించింది.శనివారం ఖైరతాబాద్‌లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎమ్డీ జగదీశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుకు నెలవారీ నీటి బిల్లులు, బకాయిలతో కలిపి రూ.100 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. జలమండలికి రావలసిన బకాయిల మొత్తం రూ.వెయ్యి కోట్లకు పైగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెలవారీ బిల్లులతో పాటు బకాయిల్లో కొంతమొత్తమైనా రాబట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. నూతన కుళాయి కనెక్షన్ల జారీ, ట్యాంకర్ల ద్వారా విక్రయించే నీటి చార్జీలు అన్నీ కలిపితేరూ.100 కోట్ల రెవెన్యూ లక్ష్యం సాధించవచ్చని ఓ అధికారి తెలిపారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 8.25 లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. నెలవారీ ఠంఛనుగా బిల్లులు చెల్లించేవారు నాలుగు లక్షలకు మించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ, ఇతర డెరైక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.