కర్షకుడిపై కరెంటు జులూం | Connections to the removal of the bore motors of farmers | Sakshi
Sakshi News home page

కర్షకుడిపై కరెంటు జులూం

Published Thu, Nov 27 2014 11:11 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

Connections to the removal of the bore motors of farmers

 వికారాబాద్: ఉచిత కరెంటుకు సంబంధించి రైతులు రూ.30 సర్వీసు చార్జి చెల్లించాల్సి ఉంటుంది. అయితే 2005 నుంచి దీని గురించి విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోలేదు. గత తొమ్మిదేళ్లకు సంబంధించి ఈ బకాయిలు ఇప్పుడు రూ. వేలకు చేరుకున్నాయి. అయితే ఈ వేల రూపాయల బిల్లును ఒకేసారి చెల్లించాలంటూ ఇప్పుడు రైతులను అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. లేకపోతే కనెక్షన్లు కట్ చేస్తూ నిర్దాక్షిణంగా స్టార్టర్లు, సర్వీసు వైర్లను సబ్‌స్టేషన్లలకు తీసుకెళుతున్నారు.

పశ్చిమ రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 12 వేల వ్యవసాయ బోర్లకు కనెక్షన్లు కట్ చేసి స్టార్టర్లను సబ్‌స్టేషన్‌లకు తీసుకెళ్లినట్లు సమాచారం. బిల్లు కడితేనే తిరిగి విద్యుత్ స్టాటర్ ఇచ్చి కనెక్షన్‌ను పునరుద్ధరిస్తామని లేకపోతే స్టాటర్ గురించి మరిచిపోండి అంటూ విద్యుత్ సిబ్బంది చెబుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ విద్యుత్ డివిజన్ పరిధిలో 50 వేల వ్యవసాయ బావులకు ఉచిత కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికే సర్వీసు బకాయిలు చెల్లించని రైతుల కనెక్షన్లు తొలగించడం ప్రారంభమైంది.

బిల్లు కట్టనందుకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా బృందాలుగా వస్తున్న విద్యుత్ సిబ్బంది కనెక్షన్లు కట్ చేసి స్టార్టర్లు తీసుకెళుతున్నారు. అయితే విద్యుత్‌శాఖకు తామొక్కరమే బకాయిలు పడలేదని,ృగహ, పరిశ్రమ శాఖలు కూడా పెద్ద మొత్తంలో బకాయి పడ్డాయని రైతులుచెబుతున్నారు. వారి నుంచి మొదట బకాయిలు వసూలు చేసి తమకు కొంత వెసులుబాటు కల్పించాలని వారు కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా కరువు ప్రభావంతో తాము పంటల సాగులో తీవ్ర నష్టాలను చవిచూశామని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఒకేసారి బిల్లు మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాము కనెక్షన్ కట్ చేయవద్దని వేడుకుంటున్నా పట్టించుకోకుండా స్టాటర్లు, సర్వీస్ వైర్లను సిబ్బంది తీసుకెళుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ మండల పరిధిలో గురువారం ఒక్క రోజే 100 బోరు మోటార్ల స్టాటర్లను విద్యుత్ సిబ్బంది రైతుల వద్ద నుంచి లాక్కురావడం గమనార్హం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి సర్వీసు చార్జీల చెల్లింపులో కొంత వెసులుబాటు కల్పించాలని రైతన్నలు వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement