Removal of connections
-
కర్షకుడిపై కరెంటు జులూం
వికారాబాద్: ఉచిత కరెంటుకు సంబంధించి రైతులు రూ.30 సర్వీసు చార్జి చెల్లించాల్సి ఉంటుంది. అయితే 2005 నుంచి దీని గురించి విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోలేదు. గత తొమ్మిదేళ్లకు సంబంధించి ఈ బకాయిలు ఇప్పుడు రూ. వేలకు చేరుకున్నాయి. అయితే ఈ వేల రూపాయల బిల్లును ఒకేసారి చెల్లించాలంటూ ఇప్పుడు రైతులను అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. లేకపోతే కనెక్షన్లు కట్ చేస్తూ నిర్దాక్షిణంగా స్టార్టర్లు, సర్వీసు వైర్లను సబ్స్టేషన్లలకు తీసుకెళుతున్నారు. పశ్చిమ రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 12 వేల వ్యవసాయ బోర్లకు కనెక్షన్లు కట్ చేసి స్టార్టర్లను సబ్స్టేషన్లకు తీసుకెళ్లినట్లు సమాచారం. బిల్లు కడితేనే తిరిగి విద్యుత్ స్టాటర్ ఇచ్చి కనెక్షన్‌ను పునరుద్ధరిస్తామని లేకపోతే స్టాటర్ గురించి మరిచిపోండి అంటూ విద్యుత్ సిబ్బంది చెబుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ విద్యుత్ డివిజన్ పరిధిలో 50 వేల వ్యవసాయ బావులకు ఉచిత కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికే సర్వీసు బకాయిలు చెల్లించని రైతుల కనెక్షన్లు తొలగించడం ప్రారంభమైంది. బిల్లు కట్టనందుకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా బృందాలుగా వస్తున్న విద్యుత్ సిబ్బంది కనెక్షన్లు కట్ చేసి స్టార్టర్లు తీసుకెళుతున్నారు. అయితే విద్యుత్‌శాఖకు తామొక్కరమే బకాయిలు పడలేదని,ృగహ, పరిశ్రమ శాఖలు కూడా పెద్ద మొత్తంలో బకాయి పడ్డాయని రైతులుచెబుతున్నారు. వారి నుంచి మొదట బకాయిలు వసూలు చేసి తమకు కొంత వెసులుబాటు కల్పించాలని వారు కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా కరువు ప్రభావంతో తాము పంటల సాగులో తీవ్ర నష్టాలను చవిచూశామని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఒకేసారి బిల్లు మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కనెక్షన్ కట్ చేయవద్దని వేడుకుంటున్నా పట్టించుకోకుండా స్టాటర్లు, సర్వీస్ వైర్లను సిబ్బంది తీసుకెళుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ మండల పరిధిలో గురువారం ఒక్క రోజే 100 బోరు మోటార్ల స్టాటర్లను విద్యుత్ సిబ్బంది రైతుల వద్ద నుంచి లాక్కురావడం గమనార్హం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి సర్వీసు చార్జీల చెల్లింపులో కొంత వెసులుబాటు కల్పించాలని రైతన్నలు వేడుకుంటున్నారు. -
షాక్
* ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోతున్న కరెంటు బిల్లులు * జిల్లాలో రూ.97.77 కోట్లు బకాయి * పంచాయతీలది టాప్.. కనెక్షన్లు తొలగింపు ఆదిలాబాద్ అర్బన్ /అగ్రికల్చర్ : రూ.97.77 కోట్లు.. ఇవి మన జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన కరెంటు బిల్లులు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ బిల్లులు వసూలు చేసేందుకు ట్రాన్స్‌కో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగానే ముందుగా పంచాయతీలకు కరెంటు షాక్నిస్తున్నారు. ఇప్పటికే పలు పంచాయతీలకు కరెంటు సరఫరా నిలిపివేయడంతో అంధకారంలో మగ్గుతున్నాయి. మిగతా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా నెలనెలా డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నా వారి నుంచి లాభం లేకుండాపోయింది. దీంతో రూ.కోట్లలో బకాయి పేరుకుపోవడంతో ట్రాన్స్‌కో ఆ దిశగా చర్యలు చేపట్టింది. పెండింగ్‌లో ప్రభుత్వ బకాయిలపై దృష్టి సారించి వసూలు చేయాలని ట్రాన్స్‌కో ఎండీ వెంకటనారాయణ ఇటీవల జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల 46,876 కనెక్షన్లు.. జిల్లాలో నాలుగు విద్యుత్ సర్కిల్లు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రభుత్వ శాఖలకు 46,876 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఆదిలాబాద్ విద్యుత్ సర్కిల్ పరిధిలో 13,252 కనెక్షన్లు ఉండగా, నిర్మల్ సర్కిల్ పరిధిలో 13,100, మంచిర్యాల పరిధిలో 12,934, కాగజ్‌నగర్ పరిధిలో 7,590 కనెక్షన్లు ఉన్నాయి. దీంతోపాటు గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరాకు నాలుగు సర్కిళ్ల పరిధిలో మొత్తం 5,312 కనెక్షన్లు ఉండగా, పాఠశాలలు, ఆలయాలకు కలిపి 1,555 కనెక్షన్లు ఉన్నాయి. పేరుకుపోయిన ప్రభుత్వ శాఖల బకాయిల్లో మైనర్ గ్రామ పంచాయతీలు రూ.49 కోట్లతో టాప్‌లిస్టులో ఉన్నాయి. ప్రభుత్వ శాఖల బకాయిల వసూలుతో పాటు అక్రమ విద్యుత్ కనెక్షన్లు తొలగించడం, ఇతర సర్వీసు కనెక్షన్ల నుంచి వసూళ్లు రాబట్టడం లాంటివి చేయనున్నారు. ఈ తరుణంలో మొండి బకాయిలపై కఠినంగా వ్యవహరించనున్నారు. పంచాయతీ కార్యాలయాలకు కనెక్షన్లు కట్.. ప్రథమంగా ఎక్కువగా ఉన్న పంచాయతీ శాఖపై విద్యుత్ అదికారులు దృష్టి సారించారు. జిల్లాలో మేజర్ 27, మైనర్ 839 గ్రామ పంచాయతీలుండగా.. రూ.72 కోట్లు బకాయిలు ఉన్నాయి. పేరుకుపోయిన బకాయిలు వారంలోపు చెల్లించాలని ఆదేశాలు అందించింది. చెల్లించకపోవడంతో జిల్లాలో 60 నుంచి 80 పంచాయతీ కార్యాలయాల కనెక్షన్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగించారు. దీంతో పంచాయతీలు రాత్రిల్లో అంధకారంలో మగ్గుతున్నాయి. పలుచోట్ల నీటి పథకాలకు విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే భరించాలి కౌడాల ప్రభావతి నారాయణ, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కరెంటు కనెక్షన్ తీసేస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత సర్పంచులు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉంది. ఈ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి. ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బిల్లులు ఉన్నాయి. -
బిల్లు కట్టు.. లేదంటే ‘కట్’
- ఎస్సీ, ఎస్టీలపై విద్యుత్‌శాఖ ఉక్కుపాదం - మొండి బకాయిల పేరుతో కనెక్షన్లు తొలగింపు - కనీస సమాచారం ఇవ్వని అధికారులు - దళిత కాలనీల్లో అంధకారం మధిర : విద్యుత్ పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోకపోవడంతో జిల్లాలోని దళితవాడలు అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయి. సంవత్సరాల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే పేరుతో విద్యుత్ అధికారులు కనెక్షన్లను తొలగిస్తుండటంతో దళితులు ఆందోళన చెందుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విద్యుత్ బకాయిలను రద్దు చేశారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఇబ్బడిముబ్బడిగా చార్జీలు పెంచారు. సర్‌చార్జీలు, ఓవర్‌లోడ్ పేరుతో మరింత భారం మోపారు. ఆ తర్వాత ఒక బల్బు వాడే వినియోగదారునికి 50 యూనిట్ల లోపు ఉచితంగా కరెంట్ ఇస్తామని కిరణ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగ బిల్లులనూ మాఫీ చేస్తామని ప్రకటించినా అది అమలుకునోచుకోలేదు. జిల్లాలో మొత్తం ఎస్సీ గృహ వినియోగదారులు 48,305 మంది ఉన్నారు. ఎస్టీ వినియోగదారులు 78,888 మంది ఉన్నారు. వారిలో ఎస్సీ వినియోగదారులు 22,318 మందికిగాను రూ.8.15 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 24,253మంది ఎస్టీ వినియోగదారులకుగాను రూ.15.31 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో 2013 సెప్టెంబర్‌లో ఎస్సీలకు రూ.2.25 కోట్లు ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించింది. మిగిలినవి అలాగే ఉండిపోయాయి. నాటి బిల్లులతో కలిపి రశీదులు.. నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను కలిపి విద్యుత్‌శాఖ కొత్త బిల్లులు ఇస్తోంది. కొంతమంది చెల్లిస్తున్నారు. మిగిలినవారు ఆర్థిక ఇబ్బందులతో చెల్లించలేకపోతున్నారు. గతంలో తల్లిదండ్రుల పేరుతో విద్యుత్ కనెక్షన్లు ఉంటే ఆ బకాయిలను రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ సంబంధిత శాఖకు చెల్లించలేదు. తమ తండ్రులపేరుమీద ఉన్న విద్యుత్ బకాయిలను చెల్లించాలంటున్నారని మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన మందలపు కుటుంబరావు, మందలపు గోపీనాథ్, గుజ్జు సిల్వరాజు తదితరులు వాపోతున్నారు. తమ పేరుతో కొత్తకనెక్షన్లు కూడా ఇవ్వడంలేదని వాపోతున్నారు. మధిర సబ్‌డివిజన్ పరిధిలో 11,200 సర్వీసులు ఉండగా వాటికి సంబంధించి రూ.56 లక్షలు విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో గ త ప్రభుత్వం రూ.28 లక్షలు చెల్లించగా మరో రూ.28 లక్షల బకాయి ఉంది. ఈ బకాయిలు చెల్లించడంలేదని విద్యుత్ అధికారులు గ్రామాల్లో తిరిగి బకాయిదారుల విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు అంధకారంలో మగ్గుతున్నాయి. అటు కొత్త క నెక్షన్లు ఇవ్వక, ఇటు పెండింగ్ బకాయిలు చెల్లించక తమను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని బాధితులు వాపోతున్నారు.