షాక్
* ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోతున్న కరెంటు బిల్లులు
* జిల్లాలో రూ.97.77 కోట్లు బకాయి
* పంచాయతీలది టాప్.. కనెక్షన్లు తొలగింపు
ఆదిలాబాద్ అర్బన్ /అగ్రికల్చర్ : రూ.97.77 కోట్లు.. ఇవి మన జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన కరెంటు బిల్లులు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ బిల్లులు వసూలు చేసేందుకు ట్రాన్స్‌కో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగానే ముందుగా పంచాయతీలకు కరెంటు షాక్‌నిస్తున్నారు. ఇప్పటికే పలు పంచాయతీలకు కరెంటు సరఫరా నిలిపివేయడంతో అంధకారంలో మగ్గుతున్నాయి. మిగతా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా నెలనెలా డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నా వారి నుంచి లాభం లేకుండాపోయింది. దీంతో రూ.కోట్లలో బకాయి పేరుకుపోవడంతో ట్రాన్స్‌కో ఆ దిశగా చర్యలు చేపట్టింది. పెండింగ్‌లో ప్రభుత్వ బకాయిలపై దృష్టి సారించి వసూలు చేయాలని ట్రాన్స్‌కో ఎండీ వెంకటనారాయణ ఇటీవల జిల్లా అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ప్రభుత్వ శాఖల 46,876 కనెక్షన్లు..
జిల్లాలో నాలుగు విద్యుత్ సర్కిల్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రభుత్వ శాఖలకు 46,876 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఆదిలాబాద్ విద్యుత్ సర్కిల్ పరిధిలో 13,252 కనెక్షన్లు ఉండగా, నిర్మల్ సర్కిల్ పరిధిలో 13,100, మంచిర్యాల పరిధిలో 12,934, కాగజ్‌నగర్ పరిధిలో 7,590 కనెక్షన్లు ఉన్నాయి. దీంతోపాటు గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరాకు నాలుగు సర్కిళ్ల పరిధిలో మొత్తం 5,312 కనెక్షన్లు ఉండగా, పాఠశాలలు, ఆలయాలకు కలిపి 1,555 కనెక్షన్లు ఉన్నాయి. పేరుకుపోయిన ప్రభుత్వ శాఖల బకాయిల్లో మైనర్ గ్రామ పంచాయతీలు రూ.49 కోట్లతో టాప్‌లిస్టులో ఉన్నాయి. ప్రభుత్వ శాఖల బకాయిల వసూలుతో పాటు అక్రమ విద్యుత్ కనెక్షన్లు తొలగించడం, ఇతర సర్వీసు కనెక్షన్ల నుంచి వసూళ్లు రాబట్టడం లాంటివి చేయనున్నారు. ఈ తరుణంలో మొండి బకాయిలపై కఠినంగా వ్యవహరించనున్నారు.
పంచాయతీ కార్యాలయాలకు కనెక్షన్లు కట్..
ప్రథమంగా ఎక్కువగా ఉన్న పంచాయతీ శాఖపై విద్యుత్ అదికారులు దృష్టి సారించారు. జిల్లాలో మేజర్ 27, మైనర్ 839 గ్రామ పంచాయతీలుండగా.. రూ.72 కోట్లు బకాయిలు ఉన్నాయి. పేరుకుపోయిన బకాయిలు వారంలోపు చెల్లించాలని ఆదేశాలు అందించింది. చెల్లించకపోవడంతో జిల్లాలో 60 నుంచి 80 పంచాయతీ కార్యాలయాల కనెక్షన్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగించారు. దీంతో పంచాయతీలు రాత్రిల్లో అంధకారంలో మగ్గుతున్నాయి. పలుచోట్ల నీటి పథకాలకు విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వమే భరించాలి
కౌడాల ప్రభావతి నారాయణ, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి
గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కరెంటు కనెక్షన్ తీసేస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత సర్పంచులు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉంది. ఈ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి. ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బిల్లులు ఉన్నాయి.