బిల్లు కట్టు.. లేదంటే ‘కట్’ | Basic information that is no longer Officials | Sakshi
Sakshi News home page

బిల్లు కట్టు.. లేదంటే ‘కట్’

Published Mon, Sep 8 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

బిల్లు కట్టు.. లేదంటే ‘కట్’

బిల్లు కట్టు.. లేదంటే ‘కట్’

- ఎస్సీ, ఎస్టీలపై విద్యుత్‌శాఖ ఉక్కుపాదం
- మొండి బకాయిల పేరుతో కనెక్షన్లు తొలగింపు
- కనీస సమాచారం ఇవ్వని అధికారులు
- దళిత కాలనీల్లో అంధకారం
మధిర : విద్యుత్ పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోకపోవడంతో జిల్లాలోని దళితవాడలు అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయి. సంవత్సరాల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే పేరుతో విద్యుత్ అధికారులు కనెక్షన్‌లను తొలగిస్తుండటంతో దళితులు ఆందోళన చెందుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విద్యుత్ బకాయిలను రద్దు చేశారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఇబ్బడిముబ్బడిగా చార్జీలు పెంచారు.

సర్‌చార్జీలు, ఓవర్‌లోడ్ పేరుతో మరింత భారం మోపారు. ఆ తర్వాత ఒక బల్బు వాడే వినియోగదారునికి 50 యూనిట్ల లోపు ఉచితంగా కరెంట్ ఇస్తామని కిరణ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగ బిల్లులనూ మాఫీ చేస్తామని ప్రకటించినా అది అమలుకునోచుకోలేదు. జిల్లాలో మొత్తం ఎస్సీ గృహ వినియోగదారులు 48,305 మంది ఉన్నారు. ఎస్టీ వినియోగదారులు 78,888 మంది ఉన్నారు. వారిలో ఎస్సీ వినియోగదారులు 22,318 మందికిగాను రూ.8.15 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 24,253మంది ఎస్టీ వినియోగదారులకుగాను రూ.15.31 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో 2013 సెప్టెంబర్‌లో ఎస్సీలకు రూ.2.25 కోట్లు ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించింది. మిగిలినవి అలాగే ఉండిపోయాయి.
 
నాటి బిల్లులతో కలిపి రశీదులు..
నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను కలిపి విద్యుత్‌శాఖ కొత్త బిల్లులు ఇస్తోంది. కొంతమంది చెల్లిస్తున్నారు. మిగిలినవారు ఆర్థిక ఇబ్బందులతో చెల్లించలేకపోతున్నారు. గతంలో తల్లిదండ్రుల పేరుతో విద్యుత్ కనెక్షన్లు ఉంటే ఆ బకాయిలను రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ సంబంధిత శాఖకు చెల్లించలేదు.  తమ తండ్రులపేరుమీద ఉన్న విద్యుత్ బకాయిలను చెల్లించాలంటున్నారని మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన మందలపు కుటుంబరావు, మందలపు గోపీనాథ్, గుజ్జు సిల్వరాజు తదితరులు వాపోతున్నారు. తమ పేరుతో కొత్తకనెక్షన్లు కూడా ఇవ్వడంలేదని వాపోతున్నారు.
 
మధిర సబ్‌డివిజన్ పరిధిలో 11,200 సర్వీసులు ఉండగా వాటికి సంబంధించి రూ.56 లక్షలు విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో గ త ప్రభుత్వం రూ.28 లక్షలు చెల్లించగా మరో రూ.28 లక్షల బకాయి ఉంది. ఈ బకాయిలు చెల్లించడంలేదని విద్యుత్ అధికారులు గ్రామాల్లో తిరిగి బకాయిదారుల విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు అంధకారంలో మగ్గుతున్నాయి. అటు కొత్త క నెక్షన్లు ఇవ్వక, ఇటు పెండింగ్ బకాయిలు చెల్లించక తమను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని బాధితులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement