గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను మరోసారి వాయిదా వేయాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నిర్ణయించాయి. 2016-17కు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)ను గత నెలాఖరులోగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి సమర్పించాల్సి ఉంది. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఏఆర్‌ఆర్‌లను సమర్పిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో డిస్కంలు ఇప్పటికే రెండు సార్లు వాయిదా కోరాయి.
రెండోసారి గడువు కూడా శనివారంతో ముగిసిపోనుండగా డిస్కంలు ఇంకా ఏఆర్‌ఆర్‌లను సమర్పించలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5వ తేదీకి గడువు పొడిగించాలని కోరేందుకు డిస్కంలు సన్నద్ధమయ్యాయి. ఈ మేరకు ఈఆర్‌సీకి లేఖ రాయనున్నాయి.