మూసీ.. బచావో
గతమెంతో ఘనకీర్తితో చరిత్ర పుటల్లోకి ఎక్కిన మూసీ.. నేడు కాలుష్య కాసారంగానూ రికార్డుకెక్కింది. అత్యంత విషతుల్యమై గరళ సాగరంగా మారింది. అమృత జలంతో అలరారిన జీవనది.. నేడు విష వ్యర్థాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. కాలుష్య కాసారమై క‘న్నీటి’ కష్టాలు వెల్లదీస్తోంది.
మరి ఈ అపర సంజీవనిని ఆదుకొనే ఆపద్బాంధవుడు ఎవరు? స్వచ్ఛమైన జలంతో నగరవాసుల దాహార్తి తీర్చిన జలాశయానికి పూర్వ వైభవం తీసుకొచ్చే నాయకుడెవరు? మూసీ ప్రక్షాళనకు నడుం బిగించి ముందుకొచ్చే పార్టీ ఏది?
ప్రస్తుతం నగరవాసుల్లో మెదులుతున్న ఆలోచనలివి. గ్రేటర్ ఎన్నికల వేళ.. వీరందరి నోటా ఒకటే మాట.. మూసీ ప్రక్షాళన. గుజరాత్‌లోని సబర్మతి నది తరహాలో మూసీని ప్రక్షాళన చేయాలని సిటీజనులు కోరుతున్నారు. ఆ దిశగా కృషి చేసే పార్టీకే పట్టం కడతామంటున్నారు.
అనంతగిరిలో పురుడు పోసుకున్న అపర సంజీవని మూసీ. సుమారు వంద కిలో మీటర్లు ప్రవహించి నగరంలోకి ప్రవేశిస్తోందీ నది. సిటీ నడుమ సుమారు 25 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. నాడు నగరవాసులకు తాగునీటిని అందించిన ఈ నది.. నేడు వ్యర్థాలతో మురికి కూపంగా మారింది. కాలుష్య కారక నదుల్లో జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని సబర్మతి నదిలా మూసీని ప్రక్షాళన చేయాలని సిటీజనులు, పర్యావరణవేత్తలు గట్టిగా కోరుతున్నారు. అన్ని వర్గాల ప్రజల నుంచి ఈ డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన రాజకీయ పక్షాలు ఈ అంశానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్నారు.
మురికి కూపం..!
పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, ఇతర నివాస ప్రాంతాల నుంచి వెలువడుతోన్న వ్యర్థాలతో మూసీ మురికి కూపమైంది. నిత్యం 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఇందులో కలుస్తోంది. రెండేళ్ల క్రితం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులతో మూసీ మొదటి దశ ప్రక్షాళన చేపట్టారు. నదీ పరివాహక ప్రాంతంలోఐదు మురుగు శుద్ధి (ఎస్టీపీ) కేంద్రాలను నిర్మించారు. ప్రస్తుతం మొదటి దశ కింద రోజు వారీగా సుమారు 500 మిలియన్ లీటర్ల మురుగు నీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మరో 900 ఎంఎల్‌డీల మురుగు నీరు మూసీలోకే ప్రవేశిస్తుండడంతో నది కాలుష్య కాసారంగా మారుతోంది.
అటకెక్కిన సంకల్పం..
కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా చారిత్రక నదులను పరిరక్షించేందుకు జాతీయ నదీ పరిరక్షణ పథకం(ఎన్‌ఆర్‌సీడీ) ప్రారంభించింది. ఇందులో భాగంగా మూసీ రెండోదశ ప్రక్షాళన పథకం కింద నిత్యం 610 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేయాలని రెండేళ్ల క్రితం సంకల్పించారు. ఇందుకయ్యే రూ.923 కోట్ల అంచనా వ్యయంలో 70 శాతం నిధులు భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరంగా పూచీకత్తు (కౌంటర్‌గ్యారంటీ) ఇవ్వడంలో విఫలమవడంతో ప్రక్షాళన పథకం అటకెక్కింది. ప్రస్తుత ప్రభుత్వ చొరవతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది.
ఎవరిదీ పాపం..?
మూసీ కాలుష్యానికి సర్కారు నిర్లక్ష్యం, మానవ ప్రమేయమే కారణమన్నది సుస్పష్టం. దశాబ్దాలుగా ఈ నదిని మురుగు కూపంగా మార్చినపాపం రాజకీయ, పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకే దక్కుతుందన్నది బహిరంగ రహస్యమే. గత కొన్నేళ్లుగా రోజూ మిలియన్ లీటర్ల మురుగు నీరు మూసీలో కలుస్తున్నా.. దాని నివారణకు పాలకవర్గం తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. మూసీ ప్రక్షాళనకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన పాలకవర్గం, అధికారులు చేష్టలుడిగి చూస్తుండడంతోనే ఈ దుస్థితి వచ్చింది.
ప్రాజెక్టు సాకారమైతేమూసీకి మహర్దశ
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఎన్‌ఆర్‌సీడీ పథకం కింద మూసీ రెండో దళ ప్రక్షాళన ప్రారంభమైతే నదిని కాలుష్యం నుంచి కాపాడొచ్చు. దీనికి ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అంచనా వ్యయం: రూ.923కోట్లు (ఎన్‌ఆర్‌సీడీ పథకం కింద కేంద్ర ఆర్థిక సహాయం 70 శాతం, 30 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది)
ఉద్దేశం: మూసీలో రోజు వారీగా కలుస్తున్న 610 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేయడం
చేపట్టనున్న నిర్మాణాలు: మూసీ నది ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున మొత్తం 10 సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు
ఎస్టీపీలు ఎక్కడెక్కడ: అంబర్‌పేట్(142ఎంఎల్‌డీ), నాగోల్(140), నల్లచెరువు(80), హైదర్షాకోట్(30), అత్తాపూర్(70), మీరాలం(6), ఫతేనగర్(30), ఐడీపీఎల్ టౌన్‌షిప్(59), నాగారం(29), కుంట్లూర్-హయత్‌నగర్(24)
రీసైక్లింగ్ యూనిట్లు ఫతేనగర్, ఐడీపీఎల్ టౌన్‌షిప్, నాగారం- కాప్రా
ప్రత్యేకతలు జీహెచ్‌ఎంసీ పరిధిలో మూసీ నది ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో 574.59 చదరపు కిలోమీటర్లలోని నాలాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసి తిరిగి నదిలోకి వదలడం. తద్వారా మూసీనది కాలుష్య కాసారం కాకుండా నివారించొచ్చు. నది పరివాహక ప్రాంతాల్లో ఈ నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా మార్చే అవకాశం ఉంటుంది.
సబర్మతి ఆదర్శంగా సాగాలి ముందుకు..
వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థాలతో విషతుల్యమైన సబర్మతి నది ప్రక్షాళనకు నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ 2010లో నడుం బిగించారు. సుమారు రూ.550 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మూడేళ్లలోనే పూర్తయింది. చారిత్రక నదిని కాలుష్య కాసారం నుంచి విముక్తి చేసింది. ఇందులో గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సబర్మతి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ లిమిటెడ్‌ల కృషి ఎంతగానో ఉంది. ఇవి సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని సాధించి ఆదర్శంగా నిలిచాయి. ఒకప్పుడు మురుగు కంపు కొట్టిన సబర్మతి నది పరిసరాల్లో ఇప్పుడు ఆహ్లాద వాతావరణం నెలకొంది.
అహ్మదాబాద్ వాసులకు సబర్మతి తీరం ఇప్పుడు చక్కటి పర్యాటక స్థలంగా మారింది. నగరం నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర ఈ నది ప్రవహిస్తోంది. సబర్మతి ప్రక్షాళనలో భాగంగా పారిశ్రామిక, వాణిజ్య, గృహాల నుంచి నదిలోకి వ్యర్థ జలాలు చేరుతున్న 17 ప్రాంతాలను గుర్తించారు. వ్యర్థ జలాలు ఉత్పత్తవుతున్న ప్రాంతాల నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌లు వేసి ఆ నీటిని మురుగు శుద్ధి కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వ్యర్థ జలాల్లోని ఘన, ద్రవ, రసాయనిక వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేసి.. ఆ తర్వాత నీటిని నదిలోకి వదిలే ఏర్పాటు చేశారు. దీంతో నదిలో కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఇదే స్ఫూర్తితో మూసీ ప్రక్షాళనకు జీహెచ్‌ఎంసీ, పీసీబీ, జలమండలి విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలి.
ఓటు ప్రమాణం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కమిషనర్ జనార్దన్‌రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బేగంపేట్ కుందన్‌బాగ్‌లోని చిన్మయ విద్యాలయంలో విద్యార్థులకు శుక్రవారం ప్రత్యేక హామీ పత్రం అందజేశారు. తమ తల్లిదండ్రులు, మిత్రులు, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా కృషి చేయాలని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. 100 శాతం ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, డిప్యూటీ కమిషనర్ అశోక సామ్రాట్, పాఠశాల కరస్పాండెంట్ హరిగోపాల్ పాల్గొన్నారు.
- సోమాజిగూడ