విజయనగరం మున్సిపాల్టీ/ బొబ్బిలి, న్యూస్‌లైన్ : మున్సిపాల్టీలు.. మురికిపాల్టీలుగా మారుతున్నాయి. సిబ్బంది కొరత, కొరవడిన చిత్తశుద్ధి, ప్రత్యేక అధికారుల పాలన.. జవాబుదారీతనం లోపించడం వెరసి పట్టణ ప్రజలను పారిశుద్ధ్య సమస్యలు వెంటాడుతున్నా యి. జిల్లాలో విజయనగరం, పార్వతీపురం, సాలూరు, బొబ్బి లి మున్సిపాల్టీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీ ఉంది. ప్రతి మున్సిపాల్టీలో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. మున్సిపాల్టీల్లో మురికివాడల సర్వేలతో కాలం గడుపుతున్నా రు కాని సమస్యలు పరిష్కరించడం లేదు. మూడేళ్లుగా పాలనా వ్యవహారాలు చూసే పాలక వర్గం లేకపోవడంతో పర్యవేక్షణ కరువైంది.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని నియమించకపోవ డం వల్ల సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. పదేళ్లక్రితం నాటి ఉన్న సిబ్బంది, వాహనాలు ఉండడం వల్ల.. మంచినీటి ట్యాంకులు లేకపోవడం వెరసి ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ఉన్న సిబ్బందిని తొలగిస్తున్న తరుణంలో పట్టణాల్లో ప్రజారోగ్యం కుంటుపడుతోంది. పట్టణాల్లో ఏ వార్డు చూసినా చెత్తచెదారాలతోనే దర్శనమిస్తున్నాయి. నెల్లిమర్లలో రోజూ 5 టన్నుల చెత్తను సేకరిస్తారు. చెత్తను వేసేందుకు డంపింగ్ యార్డు లేదు. దీని కోసం ప్రతిపాదనలు పంపించారు.
విజయనగరం మున్సిపాల్టీ..
విజయనగరం పట్టణంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 1,74,651 మంది జనాభా ఉండగా, 2011 లెక్కల ప్రకారం 2,27,533 మంది జనాభా ఉన్నారు. వీరే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగాల నిమిత్తం వచ్చి అద్దె ఇళ్లలో చాలా మంది నివాసం ఉంటున్నారు. పట్టణంలో 58,107 ఇళ్లు ఉన్నాయి. మొత్తం 38 వార్డులు ఉండగా వీటితోపాటు నాలుగు విలీన పంచాయతీలు ఉన్నాయి. మున్సిపాల్టీలో ప్రజారోగ్యాన్ని కాపాడే ఎంహెచ్‌ఓ పోస్టు ఖాళీగా ఉంది. పట్టణమంతా పర్యవేక్షణ చేయవలసిన అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు.
నలుగురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు గాను రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెల్త్ అసిస్టెంట్‌లు ఐదు పోస్టులకు నాలుగు, పీహెచ్‌ఎంలు ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు రెగ్యులర్ 261 మంది ఉండగా 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపాలిటీలో రోజూ సేకరించే 117 టన్నుల చెత్తను తరలించడానికి టిప్పర్లు 6, ఆటోలు 10, ట్రాక్టర్స్ 17, డుంపెర్ ప్లాసర్ 1, జేసీబీ 1, టారస్ 1, ఆటో మౌంటెడ్ పాగింగ్ మిషన్ 1, సెప్టిక్ క్లినర్ 1 ఉన్నాయి.
బొబ్బిలి...
బొబ్బిలిలో 57 వేల మంది జనాభా ఉన్నారు. 14,437 ఇళ్లు, 1072 దుకాణాలున్నాయి. మున్సిపాలీటీలో రోజుకు 17.5 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. దీనిలో దాదాపు టన్ను పొడి చెత్త, దాదాపు రెండున్నర టన్నుల తడి చెత్తను చెత్తశుద్ధి పార్కుకు తరలిస్తున్నారు. పార్కు రాక ముందు మూడేళ్ల కిందట మార్కెట్ కమిటీ వెనుకను మున్సిపాలిటీకి చెందిన డంపింగ్ యార్డులో చెత్తను పోసేవారు. పక్క నుంచి వెళ్లే కృష్ణాపురం గ్రామస్తులు, సమీపంలో ఉండే పాఠశాల విద్యార్థులు, అతి సమీపంలో ఉండే దేవాలయానికి వచ్చిన భక్తులు ముక్కులు దుర్గంధం భరించలేకపోతున్నారు. 2011 జూలైలో రామందోరవలస వద్ద చెత్తశుద్ధి పార్కును పెట్టినా ఈ చెత్త సమస్య మాత్రం తీరలేదు.
ఆ పార్కుకు వినియోగానికి పనికి వచ్చిన చెత్తను మాత్రమే తరలిస్తుండడంతో మిగతా పనికి రానిదంతా ఇలా పాత డంపింగ్ యార్డులోనే ఉంచేస్తున్నారు. అది ఇప్పుడు ఎక్కువై పక్కనే ఉన్న బొబ్బిలి-బలిజిపేట రోడ్డు మీదకు వచ్చేయడంతో వాహనదారులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగంలో 54 మంది శాశ్వత కార్మికులు, 105 కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. నాలుగు ట్రాక్టర్లు, నాలుగు ఆటోలు, రెండు ట్రిప్పర్లను చెత్తను తరలించేందుకు వినియోగిస్తున్నారు. అయినా మున్సిపాలిటీ ఎప్పుడూ మురిపికూపంగానే దర్శమనిస్తోంది.
పార్వతీపురం
పార్వతీపురం పురపాలక సంఘంలో కూడా అదే పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో 54 వేల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ రోజుకు 25 టన్నుల చెత్త సేకరణ జరగుతోంది. పది వాహనాలు ఉన్నాయి. వీటిలో ఎనిమిది మాత్రమే పనిచేస్తున్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో 79 మంది, శాశ్వత సిబ్బంది 45 మంది, శానిటరీ సూపర్‌వైజర్ ఒకరు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఇద్దరు, ఏఎస్‌ఓ ఒకరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరిపి గ్రామం వద్ద చెత్త శుద్ధి పార్కుకు స్థలం కేటాయించినా ఆ గ్రామస్తులు అడ్డుకోవడం వల్ల జట్టు ఆశ్రమానికి దగ్గరలో రాయగడ రోడ్డులోపాత డంపింగ్ యార్డులోనే చెత్తను ఉంచుతున్నారు. దీనివల్ల కొమరాడ, పార్వతీపురం మండలంలో ఉండే వారంతా రాకపోకలు చేయడానికి ఇబ్బందికి గురవుతున్నారు.
సాలూరు
సాలూరు పురపాలక సంఘంలో 10 వాహనాల ద్వారా 25 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. మొన్నటి వరకూ వేగావతి నది ఒడ్డే డంపింగ్ యార్డుగా ఉండేది. దీనివల్లతాగునీరు కలుషితం అవ్వడంతో వేగావతిలో ఉన్న ఫిల్టర్ బావుల్లో నీటిని ఉపయోగించిన బొబ్బిలి మండలం, పట్టణ వాసులకు అనేక రోగాలు వచ్చేవి. అయితే అక్కడ చెత్తశుద్ధి పార్కు కట్టిన తరువాత కొంత ఇబ్బందులు తీరాయి.
స్లమ్ ప్రాంతాల్లో సమస్యలు..
విజయనగరంలో 72 స్లమ్ ప్రాంతాలు ఉన్నాయి. సాలూరులో 30, పార్వతీపురంలో 30, నెల్లిమర్ల 15 స్లమ్ ప్రాంతాలను మున్సిపల్ అధికారులు గుర్తించారు. స్లమ్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మురికివాడల్లో మంచినీటి, ఇళ్లు, పారిశుధ్య సమస్యలు ఎలాగున్నాయనే విషయాలపై అధికారులు సర్వే చేస్తున్నారు. విజయనగరం సర్వే చివరి దశకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
మురికిపాల్టీలు..!
Published Sat, Dec 14 2013 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement
Advertisement