Shortage of staff
-
పోలీస్‌పై 'ఫెల్ట్' భారం
హలో పోలీస్ స్టేషనా..? కరెంటు పోయి చాలా సేపవుతోంది సార్. కొంచెం లైన్‌మన్‌కు చెప్పి వేయించండి. సార్.. ఊళ్లోని వైన్‌షాపులో క్వార్టర్‌పై రూ.5 అధికంగా విక్రయిస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం సార్.. వెంటనే వారిపై చర్యలు తీసుకోండి ఇవీ పోలీసులకు ప్రజల నుంచి వస్తోన్న ఫిర్యాదులు. ప్రజలకు చేరువయ్యేందుకు పోలీసుశాఖ జిల్లాల్లో ‘ఫెల్ట్ నీడ్స్’పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తమ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో భద్రతను పటిష్ట పరిచేలా పోలీసులు సీసీ కెమెరాల వ్యవస్థను పరిశీలించి పెట్రోలింగ్, గస్తీ అవసరమా? పోకిరీలు, మందుబాబుల బెడద ఉందా? తదితర అంశాలపై గ్రామ పెద్దలతో చర్చించాలి. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఇందులో అదనంగా చేర్చిన కొన్ని అంశాలపై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు బస్సులు వస్తున్నాయా? పారిశుద్ధ్యం పరిస్థితి ఎలా ఉంది? డ్రైనేజీ ఇబ్బందులు ఉన్నాయా? కరెంటు సమస్య ఎలా ఉంది? తాగునీరు సరిగా సరఫరా అవుతోందా? వంటి విషయాలను కానిస్టేబుళ్లు, ఎస్సైలు తెలుసుకొని వాటిని సంబంధిత గ్రామాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని కార్యక్రమ ఎజెండాలో చేర్చారు. ఇక్కడే పోలీసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శాంతిభద్రతల సమస్యలైతే ఫర్వాలేదుగానీ మరీ డ్రైనేజీ, బస్సు సౌకర్యం, పారిశుద్ధ్యం, రోడ్డు సమస్యలపై కొందరు ఫిర్యాదులు చేస్తుండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. శాఖలో సిబ్బంది కొరత ఇలా..: రాష్ట్రంలో క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందిపై విపరీతమైన పని ఒత్తిడి పడుతోంది. రాష్ట్ర జనాభా ఆధారంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటుకు సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ విభాగాల్లో 81,647 పోస్టులు మంజూరయ్యాయి. కానీ వాస్తవానికి ఇక్కడ 53,115 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 72.93 మంది పోలీసులు ఉండాల్సి ఉండగా కేవలం 47.44 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో అసలే సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతుండగా, ‘ఫెల్ట్ నీడ్స్’ మరింత చికాకు పెడుతోందని సిబ్బంది అంటున్నారు. –సాక్షి, హైదరాబాద్ -
ఇందూరంటే లోకువా!
సాక్షి, నిజామాబాద్ అర్బన్: ఇందూరు జిల్లా అంటే లోకువనో ఏమో కానీ.. కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో ఇటు సర్కారు, అటు ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల దుస్థితిపై స్పందించడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోవడం లేదు. ఫలితంగా వైద్య కళాశాలలో ఏడేళ్లుగా పోస్టులు భర్తీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిజామాబాద్ మెడికల్ కళాశాల కంటే ఏడాది క్రితం ప్రారంభమైన నల్లగొండ, సూర్యపేట వైద్య కళాశాలలకు ప్రభుత్వం ఇటీవల పోస్టులు మంజూరు చేసింది. అంతేకాదు తక్షణమే ఆయా పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించింది. ప్రత్యేక మెడికల్ పోస్టుల ద్వారా ఆయా పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నిజామాబాద్ వైద్య కళాశాలకు ఏడేళ్ల క్రితం మంజూరైన పోస్టుల భర్తీని మాత్రం మరిచి పోయింది. సిబ్బంది కొరత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిజామాబాద్‌కు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. 2008లో జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించి, తక్షణమే అమలయ్యేలా చూశారు. జీవో 150 ద్వారా కళాశాలకు 2012లో కొత్త పోస్టులను మంజూరు చేశారు. ఇందులో బోధన, బోధనేతర, పరిపాలన అధికారులు, సిబ్బంది పోస్టులున్నాయి. 150 జీవో ప్రకారం ప్రభుత్వ పరిపాలన విభాగంలో 189, ప్రిన్సిపల్ విభాగంలో 50 పోస్టులు మంజూరయ్యాయి. ఈ రెండు విభాగాలకు సంబంధించి ప్రస్తుతం 11 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇక, సూపరింటెండెంట్ విభాగంలో 15 పోస్టులకు గాను 9 మంది పని చేస్తుండగా, ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్లినికల్ విభాగంలో 87 పోస్టులు మొత్తం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విద్య బోధనకు సంబంధించి అన్ని రకాల ప్రొఫెసర్లు కలిపి 311 మంది ఉండాల్సి ఉండగా, 162 మంది మాత్రమే పని చేస్తున్నారు. 149 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 805 పోస్టులకు గాను 171 మంది పని చేస్తున్నరు.ఇక, ఆస్పత్రిలో వివిధ విభాగాలకు సంబంధించి 410 పోస్టులకు గాను 211 మంది పని చేస్తున్నారు. ఇందులోనూ కొందరిని డిప్యూటేషన్ పద్ధతిలో ఇక్కడ నియమించారు. ఎంసీఐ అనుమతి కోసం తంటాలు.. ప్రతి ఏటా ఎంసీఐ అనుమతి కోసం అధికారులు అనేక తంటాలు పడుతున్నారు. ఎంసీఐ పరిశీలనకు వస్తుందంటే అధికారులు ఆందోళన చెందుతున్నారు. కళాశాల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి ఉద్యోగులను చూపించాల్సి ఉంటుంది. దీంతో డిప్యూటేషన్‌పై సిబ్బందిని ఇక్కడ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎంసీఐ అనుమతి పొందడంలో రెండుసార్లు విఫలమయ్యారు. అయినప్పటికీ పోస్టుల భర్తీకి సంబంధించి మాత్రం చర్యలు చేపట్ట లేదు. కాంట్రాక్ట్, తాత్కాలిక పద్ధతిలోనూ భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు అనుమతించడం లేదు. జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పడినప్పటి నుంచి ఓపీ రోగుల సంఖ్య రెండింతలు పెరిగింది. నిత్యం 1500 మందికి పైగా రోగులకు ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
రెవెన్యూ సమస్య
అసలే సిబ్బంది కొరత.. ఆపై అదనపు పనిభారం.. రికార్డుల ప్రక్షాళనకు తక్కువ గడువు.. వేధిస్తున్న సాంతికేక సమస్యలు.. దీంతో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. పని ఒత్తిడి తగ్గించకపోతే సమ్మె బాట పట్టాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి క్రైం : భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు పథకాన్ని అమలులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర భుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిన వి షయం తెలిసిందే. మూడు నెలల్లో రికార్డుల ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. దీంతో గ్రామ, మండల, జిల్లా స్థాయి రె వెన్యూ అధికారులు, సిబ్బంది తీరికలేకుండా పనిచేసి మొదటి విడత కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆపై రైతుబంధు అమలు, పాస్బుక్కుల జారీ తదితర ప్రక్రియలోనూ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఆగమేఘాల మీద పనులు చేయాల్సి రావడంతో పాసుబుక్కులు, రైతుబంధు చెక్కుల్లో చాలా పొరపాట్లు దొర్లాయి. ఇదే సమయంలో రికార్డుల ప్రక్షాళనకు ఉపయోగిస్తున్న సా ఫ్ట్‌వేర్ తరచుగా మొరాయిస్తుండడంతో పనులకు ఆటంకం కలుగుతూనే ఉంది. ప్రక్షాళన, రైతుబం ధు పాస్‌పుస్తకాల, చెక్కుల పంపిణీ, ఫిర్యాదుల స్వీకరణ, తప్పుల సవరణ తదితర పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. దీంతో సిబ్బం ది ఒత్తిడిలో పనిచేస్తున్నారు. ఓవైపు సాంకేతిక సమస్యలతో పనులు ఆలస్యం అవుతుండడం, మ రోవైపు త్వరగా పనులు పూర్తి చేయాలంటూ అధికారులనుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో మానసి కంగా ఇబ్బంది పడుతున్నామని రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలకు తోడు సిబ్బంది కొరత వేధిస్తోందని, దీం తో పనులు వేగంగా సాగడం లేదని పేర్కొంటున్నారు. రాష్ట్రప్రభుత్వం గత సెప్టెంబర్ 15 న భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట మూడు నెలల్లో ప్రక్షాళన పూర్తవుతుందనుకున్నారు. ఇప్పటికి పది నెలలు గడిచినా ఒక కొలిక్కి రాలేదు. ఇంకా పార్ట్–బి కి సంబంధించిన భూ రికార్డుల ప్రక్షాళనను ప్రారంభించనే లేదు. ఎక్కువ సమయం ఇవ్వడం ద్వారా పని ఒత్తిడి నుంచి బయటపడేయాలని రెవెన్యూ ఉద్యోగులు కోరుతున్నారు. విధుల్లో ఒత్తిళ్లు... భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభం అయ్యాక రెవెన్యూ సిబ్బందికి పనిభారం ఎక్కువైంది. భూ సర్వే, వివరాల నమోదు, ఆన్లైన్ ఎంట్రీలు, వన్ బీల తయారీ, తప్పుల సవరణ, ఫిర్యాదుల స్వీకరణ, డిజిటల్ పాస్బుక్కుల తయారీకి ఏర్పాట్లు, రైతు బంధు చెక్కులు, పాస్బుక్కుల పంపిణీ లాంటి అన్ని కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు మండల, గ్రామస్థాయి అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. నిర్దేశిత సమయాన్ని కేటాయించి పనులు అప్పగించారు. అంతేగాకుండా పనులు చేపడుతున్న తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టించారు. రైతుబంధు చెక్కుల పంపిణీ దృష్ట్యా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉండటంతో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితి తప్పనిసరైంది. రాత్రిపగలనక పనులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. లక్ష్యం పెద్దదిగా ఉండడం, సమయం తక్కువగా ఉండడంతో తీవ్ర ఒత్తిడిలో పనిచేయాల్సి వస్తోందంటున్నారు. పని ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు. సాంకేతిక సమస్యలు... లక్ష్యాన్ని చేరుకోవడంలో రెవెన్యూ ఉద్యోగులకు సాంకేతిక సమస్యలు తలనొప్పిగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేసిన సాప్ట్వేర్ సక్రమంగా పనిచేయడం లేదని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అష్టకష్టాలు పడి పనులు పూర్తి చేశామంటున్నారు. సాంకేతిక సమస్యలు, ఆన్లైన్ కనెక్షన్లు అస్తవ్యస్తంగా ఉండడం ఇబ్బందులు తప్పడం లేదని, పనులు ఆలస్యం అవుతున్నాయని పేర్కొంటున్నారు. వారంలో మూడు, నాలుగుసార్లు ఉన్నతాధికారులు గ్రామాల పర్యటిస్తుండడం కూడా సిబ్బందికి తలనొప్పిగా మారింది. రివ్యూలకే రోజుల తరబడి ఫైళ్లు మోసుకుంటూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత.... అసలే పని ఒత్తిడి తీవ్రంగా ఉన్న రెవెన్యూ శాఖను సిబ్బంది కొరత మరో విధంగా వేధిస్తుంది. కలెక్టరేట్లో ఆరుగురు తహసీల్దార్ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం ఇద్దరే పనిచేస్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి పోస్టే ఖాళీగా ఉంది. డీఆర్వో మణిమాల ఉద్యోగ విరమణ పొందాక ఆ స్థానం ఖాళీగానే ఉండిపోయింది. జిల్లాలో మొత్తం 31 మంది తహసీల్దార్లు ఉండాలి. కానీ 24 మందితో వెళ్లదీస్తున్నారు. పిట్లం, నాగిరెడ్డిపేట మండలాలకు ఇన్‌చార్జీలే ఉన్నారు. భిక్కనూరు తహసీల్దార్ రిటైరవడంతో అక్కడా ఇన్‌చార్జియే పనులు చూస్తున్నారు. జిల్లాలో 42 మంది డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకుగాను 36 మందే పనిచేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 50 ఉండగా.. 22 మంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులు 44 ఉండగా.. 22 మంది విధుల్లో మాత్రమే ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 45కుగాను 31 మందే ఉన్నారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో కలిపి 87 మంది అటెండర్లు ఉండాల్సి ఉండగా.. 49 మంది మాత్రమే ఉన్నారు. క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన పోస్టు వీఆర్వోది. ఒక గ్రామానికి సంబంధించిన పూర్తిస్థాయి రికార్డులు, రెవెన్యూ వ్యవహారాలు చూసుకునే బాధ్యత వారిదే.. జిల్లాలో 255 వీఆర్వో పోస్టులు ఉండగా.. 207 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. మిగిలిన గ్రామాల్లో ఇన్‌చార్జీలే ఉన్నారు. దీంతో ఇన్‌చార్జీలుగా ఉన్న గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం వేగంగా సాగడం లేదు. జిల్లాలో వీఆర్ఏ పోస్టులు 1,523 ఉండగా.. 1,424 మంది పనిచేస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకాల పనుల భారాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే జిల్లా రెవెన్యూశాఖలో ఉన్న ఖాళీల ప్రభావం తీవ్రంగానే పడుతోంది. ఈ ఖాళీలను, సాంకేతిక సమస్యలను పనిభారాన్ని దృష్టిలో పెట్టుకునైనా తమపై ఒత్తిడి తగ్గించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే అన్ని జిల్లాలలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందించారు. ఒత్తిడి తగ్గించకపోతే సమ్మెకైనా వెనుకాడబోమని పేర్కొంటున్నారు. -
హడలెత్తిస్తున్న చోరులు
రెండో ఠాణాలో సిబ్బంది కొరత రెండు నెలలుగా ఎస్సై పోస్టు ఖాళీ బెంబేలెత్తుతున్న స్థానికులు నిజామాబాద్ క్రైం: నగరంలోని రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల చోరీలు ఎక్కువయ్యాయి. ఇంటికి తాళం వేస్తే ఇక అంతే సంగతులని, ఇళ్ల ముందు బైక్ పార్క్ చేయాలన్నా ధైర్యం చాలడం లేదని స్థానికులు వాపోతున్నారు. పోలీస్ స్టేషన్లో ఎస్సై పోస్టు రెండు నెలలుగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం స్టేషన్‌కు ఇన్చార్జిగా ర్యాంకర్ ఎస్సై ఉన్నారు. గతంలో పనిచేసిన ఎస్సై బోస్కిరణ్కు పదోన్నతిపై వెళ్లినప్పటి నుంచి ఎస్సై పోస్టు ఖాళీగా ఉంది. దీనికి తోడు సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో పెట్రోలింగ్ నామమాత్రంగా కొనసాగుతోంది. మొత్తం 30 కానిస్టేబుల్ పోస్టులుండగా, ప్రస్తుతం 26 మంది పనిచేస్తున్నారు. వీరిలో ముగ్గురు డీఎస్పీ కార్యాలయానికి, మరో ముగ్గురు సీఐ కార్యాలయానికి అటాచ్గా పనిచేస్తున్నారు. ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లుగా, ఇద్దరు కోర్టు విధులను నిర్వర్తిస్తున్నారు. మొత్తం మీద 14 మంది కానిస్టేబుళ్లు మాత్రమే క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో పగలు కొంతమంది, రాత్రివేళలో కొంతమంది విధులకు హాజరవుతున్నారు. ఆరుగురు హోంగార్డులుండగా ఇద్దరు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. స్టేషన్ పరిధిలో హైమదీపురకాలనీ, బర్కత్‌పుర, గాజుల్పేట్, బ్రహ్మపురి, శివాజీనగర్, బోయిగల్లి, బురుడుగల్లి, అజాంరోడ్డు, అశోక్‌వీధి, దోబీగల్లీ, దారుగల్లీ, కోటగల్లీ, ఠాణాగల్లీ, కసాబ్‌గల్లీ, గోల్హన్మన్ చౌరస్తా ప్రాంతం, బొబ్బిలివీధి, హతాయిగల్లి, హైమదీబజార్, లైన్‌గల్లీ, వర్నిచౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా, ఉప్పర్ టేక్డీ, నర్సాగౌడ్వీధి, ఖిల్లారోడ్డు చౌరస్తా, ఐటీఐ కాలనీ, బడాబజార్ ప్రాంతాలున్నాయి. గత ఏడాది డిసెంబర్లో ఒక్క వారంలోనే నాలుగు చోరీలు జరిగాయి. -
పీహెచ్‌సీలకు జబ్బు
వైద్యులు, సిబ్బంది కొరతతో అందని నాణ్యమైన సేవలు ప్రారంభానికి నోచుకోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అప్‌గ్రేడ్ అయిన పీహెచ్‌సీల్లో స్టాఫ్ కొరత కొత్త మండలాల్లో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు విద్యా, వైద్యంపై దృష్టి సారించిన కలెక్టర్ ప్రతిపాదనలు అమలైతే వైద్యం మెరుగుపడినట్లే మహబూబాబాద్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫలితంగా రోగులకు నాణ్యమైన వైద్యసేవలందడం లేదు. కొత్తగా ప్రారంభించినా పీహెచ్‌సీల్లో పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. జిల్లాలో 17 పీహెచ్‌సీల్లో 35 మంది డాక్టర్లు అవసరం ఉండగా, 12 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది 486 మందికిగాను 131 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మల్యాల, కురవి, మరిపెడ మండలంలోని ఉగ్గంపల్లిలో పీహెచ్‌సీల నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. తొర్రూరు పీహెచ్సీ, డోర్నకల్, గార్ల పీహెచ్‌సీలు, సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేసినా దానికి తగ్గట్టుగా సిబ్బంది, వైద్యుల భర్తీ జరగలేదు. తొర్రూరు, డోర్నకల్ సీహెచ్‌సీల్లో అదనపు భవనాల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. గార్ల సీహెచ్‌సీ భవనం పూర్తయినా సిబ్బంది నియామకం జరుగలేదు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అనేక సమస్యలతో వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గంగారం మండలంలోని కోమట్లగూడెం పీహెచ్సీ, డోర్నకల్ పీహెచ్సీ, కేసముద్రం, మరిపెడ, బలపాల పీహెచ్‌సీల్లో వైద్యులు లేరు. స్టాఫ్ నర్సులు, సిబ్బందే వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. ఆ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 108 ఏఎన్ఎం సెంటర్లు ఉండగా వాటిలో 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెల్త్ అసిస్టెంట్ పోస్టులు 35 ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా సిబ్బంది, వైద్యులను భర్తీ చేయాలని ప్రతిపాదనలు తయారు చేసి సంబంధిత అధికారులకు పంపామని డీఎంహెచ్ఓ, కార్యాలయం సిబ్బంది తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న సమస్యలపై అన్ని విషయాలను సంబంధిత అధికారులకు తెలియపర్చినట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ తెలిపారు. ప్రారంభానికి నోచుకోని పీహెచ్‌సీలు.. మానుకోట మండలంలోని మల్యాల పీహెచ్సీ, కురవి, మరిపెడ మండలంలోని ఉగ్గంపల్లి పీహెచ్‌సీల భవనాలు పూర్తయినా నేటికి ప్రారంభానికి నోచుకోలేదు. భవన నిర్మాణాలు జరిగి నెలలు గడుస్తున్నా సిబ్బంది నియామకం జరగకపోవడంతో ఆ భవనాలు నిరుపయోగంగానే ఉన్నాయి. మానుకోట జిల్లాగా ఏర్పాటు కావడంతో త్వరలోనే ఆ పోస్టులు భర్తీ అయి పీహెచ్‌సీలు ప్రారంభమవుతాయని ఆయా మండలాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అధికారుల ప్రతిపాదనలు.. ప్రతి మండలానికి పీహెచ్సీ, 104, 108 వాహనాలు ఏర్పాటు చేయాలని, సిబ్బందిని భర్తీ చేయాలని, మెడికల్ అధికారులకు తప్పనిసరిగా వాహనం ఇవ్వాలని, మండలానికి రెండు ఫాగింగ్ మిషన్లు ఏర్పాటు మంజూరు చేయాలని, జిల్లా కేంద్రంలో టీబీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, పీహెచ్‌సీల్లో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, సీహెచ్‌సీల్లో ఎక్స్‌రే, ఏరియా ఆస్పత్రిలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తయారు చేసి అందజేశారు. -
పని ఒత్తిడి, సిబ్బంది కొరత - సీబీఐ
కేసుల విచారణపై హైకోర్టుకు నివేదించిన సీబీఐ హైదరాబాద్: హై ప్రొఫైల్ కేసులు, ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి, బ్యాంకులకు టోకరా.. ఇలా అనేక కేసుల విచారణలతో పని ఒత్తిడి ఎదుర్కొంటున్నామని ఉమ్మడి హైకోర్టుకు సీబీఐ నివేదించింది. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలపై అనేక కేసులు దర్యాప్తు చేస్తున్నామని, సిబ్బంది కొరత ఉందని వివరించిం ది. తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలు, బదలాయింపులపై సీబీఐ దర్యా ప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో రాష్ట్ర మైనారిటీ కమిషన్ పిటిషన్ దాఖలు చేసింది. వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐలకు నోటీసులు జారీ చేసి, కౌంటర్ల దాఖలుకు ఆదేశించింది. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. -
ఎన్నాళ్లీ ఫోర్స్?
తిరుపతి ఏపీ టాస్క్ఫోర్సులో సిబ్బంది కొరత ఉండాల్సింది 463.. ఉన్నది మాత్రం 247 మందే కత్తిమీద సాములా మారిన కమెండో ఆపరేషన్లు పని ఒత్తిడితో సతమతమవుతున్న ఉద్యోగులు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ టాస్క్ఫోర్సు విభాగం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. ప్రస్తుతం ఉన్న ఎస్ఐలు, కానిస్టేబుళ్లపై పనిభారం పెరిగింది. విశ్రాంతి లేని విధులతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అన్ని కేడర్లలోనూ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ఎప్పటికప్పుడు చెబుతున్న సర్కారు రెండేళ్లుగా ఉదాసీనత కనబరుస్తోంది. దీంతో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. తిరుపతి: పని ఒత్తిడితో టాస్క్ ఫోర్స్ విభాగం సతమతమవుతోంది. విధుల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అరుదుగా ఉన్న ఎరచ్రందనం వంటి విలువైన వృక్ష సంపదను పరిరక్షించడంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి శేషాచలంలో చొరబడే స్మగ్లింగ్ ముఠాలను అరికట్టేందుకు ప్రభుత్వం 2014లో రెడ్ శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ఫోర్సు (ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్) విభాగాన్ని నెలకొల్పింది. తిరుపతి కేంద్రంగా ఇది పనిచేస్తుంది. మొదట్లో మొత్తం 463 మంది కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీలను ప్రభుత్వం టాస్క్ఫోర్సుకు కేటారుుంచింది. అరుుతే రెండు దశల్లో కేవలం 247 మందిని మాత్రమే కేటారుుంచింది. ఇందులో డీఐజీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్సై, కానిస్టేబుళ్లు ఉన్నారు. రెండేళ్లుగా వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. అరుుతే 5 లక్షల హెక్టార్ల పరిధిలో విస్తరించి ఉన్న శేషాచలంలో నిత్యం కాపలా కాయడం, స్మగ్లర్లను అరికట్టడం ఉన్న కొద్దిమంది ఉద్యోగులతో సాధ్యం కావడం లేదు. ఒక్కో కానిస్టేబుల్ రోజూ కిలోమీటర్ల కొద్దీ అడవిలో తిరగాల్సి వస్తోంది. ఒక్కోసారి ఎర్ర కూలీలు పట్టుబడినపుడు వారి వద్ద ఉన్న దుంగలను సైతం అడవి నుంచి వీరే బయటకు తీసుకెళ్లాల్సి వస్తోంది. కొంతమంది కమెండో ఆపరేషన్లలో ఉన్నపుడు అడవుల్లో సిబ్బంది సరిపోవడం లేదు. అంతేకాకుండా టాస్క్ఫోర్సుకే కేసులు నమోదు చేసే బాధ్యతలను కూడా అప్పగించారు. ఈ నేపథ్యంలో కే సులు నమోదు చేయడం, నేరస్తులను కోర్టులకు తీసుకెళ్లడం వంటి పనులు కూడా పెరిగారుు. ఎరచ్రందనం దుంగలను స్మగ్లర్లు ఎక్కడెక్కడ విక్రరుుంచారో, లేక గోదాముల్లో దాచారో గుర్తించాల్సిన బాధ్యత కూడా వీరిపైనే ఉంది. ఒకవేళ దేశవిదేశాల్లో ఎక్కడ సరుకున్నా రికవరీ చేయాల్సిన బాధ్యత కూడా వీరిదే. అధికారాలు, బాధ్యతలు పెరిగినప్పటికీ సరిపడ ఉద్యోగులను కేటారుుంచకపోవడం టాస్క్ఫోర్సుకు ఇబ్బందికరంగా మారింది. సేకరించిన గణాంకాల ప్రకారం.. ఏపీ టాస్క్ఫోర్సు విభాగంలో ఒక ఎస్పీ, ముగ్గురు ఏసీఎఫ్‌లు, ఒక సీఐ, సివిల్ ఎస్సైలు 3, ఎఫ్‌బీవోలు 4, సివిల్ పీసీలు 20, ఏఆర్ పీసీలు 66, ఏపీఎస్పీ పీసీలు 65, ఎస్పీవోస్ 80, హెడ్గార్డ్స 50, అవుట్సోర్సింగ్ పోస్టులు 24 ఖాళీగా ఉన్నారుు. వీటన్నింటిని భర్తీ చేస్తే స్మగ్లింగ్‌ను అరికట్టడం తేలికవుతుందని అధికారవర్గాలు చెబుతున్నారుు. పని ఒత్తిడితోనే రోగాలు.. పెరిగిన పని ఒత్తిడి రోగాలకు దారితీస్తోందని టాస్క్‌ఫోర్స్ ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నారుు. అడవుల్లో ఎక్కువ రోజులు ఉండటం వల్ల వివిధ రకాల రోగాలు సంక్రమిస్తున్నాయనీ, సిబ్బంది ఎక్కువమంది ఉంటే రొటేషన్ పద్ధతి ప్రకారం విధుల నిర్వహణ ఉంటుందని కానిస్టేబుళ్లు చెబుతున్నారు. ఇటీవల హార్ట్ ఎటాక్‌తో మరణించిన హన్మంతు అనే కానిస్టేబుల్ కూడా పనిఒత్తిడి కారణంగానే గుండెనొప్పికి గురై మరణించినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వం ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. -
ఇదేం పాలన?
కలెక్టరేట్లో పడకేసిన పాలన వేధిస్తున్న సిబ్బంది కొరత భద్రత గాలికి హరిత హారతిపై ఉపన్యాసాలే తప్ప ఆచరణ ఏదీ? కలెక్టరేట్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. సిబ్బంది కొరత.. పారిశుద్ధ్య లోపం.. భద్రతలేమి.. వెరసి సాధారణ ప్రజలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు ముప్పుతిప్పలు పడుతున్నారు. వీటిపై ఇటు పాలనా అధికారిగానీ, పాలకులుగానీ దృష్టిసారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు : జిల్లా సచివాలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఉద్యోగుల కొరత కారణంగా కొన్ని శాఖల్లో నెలల తరబడి ఫైళ్లు కదలడంలేదు. సమాచారం కోసం జిల్లా నలుమూలల నుంచి రోజూ వందల సంఖ్యలో సాధారణ ప్రజలు, ఉద్యోగులు కలెక్టరేట్‌కు వస్తుంటారు. వీరికి సమాచారం ఇవ్వడానికి అధికారులు రోజుల తరబడి తిప్పించుకుంటున్నారు. గట్టిగా అడిగితే ఇచ్చేది లేదు.. అని తెగేసి చెబుతున్నారు. తిరిగితిరిగి కాళ్లు అరిగిపోతున్నా కనీస సమాచారం లభించడంలేదని పలువురు వాపోతున్నారు. 110 మంది ఉద్యోగుల్లో 52 పోస్టులు ఖాళీ సచివాలయంలో సిబ్బంది కొరత.. పాలనాధికారి అలక్ష్యం.. వెరసి ఉన్న ఉద్యోగులపై భారం పడుతోంది. కలెక్టరేట్లో మొత్తం 110 మంది ఉద్యోగులకుగాను 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను గత వారం చేపట్టిన బదిలీల్లోనూ భర్తీ చేయలేదు. ఆరు నెలల ఇదేం పాలన? క్రితం ఏ1 సెక్షన్‌కు ముగ్గురు డెప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారులను నియమించినా.. వారు ఇంతవరకు విధుల్లో చేరలేదు. రెండేళ్లలో ముగ్గురు తహశీల్దార్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. కలెక్టరేట్ భద్రమేనా? కలెక్టరేట్లో భద్రతను గాలికొదిలేశారు. ఎవరు వస్తున్నారు?.. ఎందుకు వస్తున్నారో కూడా అధికారుల వద్ద సమాచారం ఉండటం లేదు. జిల్లాలో ఉగ్ర వాదుల కదలికలు ఉన్నాయని ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నా కనీసం సెక్యూరిటీ కూడా నియమించలేదు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు కలెక్టరేట్ అడ్డాగా మారుతోంది. భద్రత లేని కారణంగా ద్విచక్రవాహనాల చోరీలు అధికమవుతున్నాయి. వీటిపై పోలీసులు కేసులూ నమోదు చేసుకోవడంలేదు. ఇటీవల జిల్లా కోర్టులో బాంబు పేలుడు సంఘటన జరిగినా వాటి నుంచి పోలీసులుగానీ, జిల్లా సచివాలయం అధికారులు గానీ పాఠాలు నేర్చుకోకపోవడం గమనార్హం. సుమారు ఆరెకరాల విస్తీర్ణంలోని కలెక్టర్‌రేట్ ఆవరణలో కనీసం ఒక్క సీసీ కెమెరా లేదంటే ఇక్కడి భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఏదైనా సంఘటన జరిగితే దానికి బాధ్యులెవరో తెలియని పరిస్థితి. బాబోయ్ కంపు కలెక్టరేట్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మరుగుదొడ్ల నుంచి దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకునే నాథుడే లేరు. కలెక్టర్ చాంబర్ పక్కనే ఉన్న మరుగుదొడ్డినీ వారాల తరబడి శుభ్రం చేయడం లేదు. పార్కులో గడ్డి, చెట్లు ఎండిపోతున్నాయి. కలెక్టర్ హరిత హారతి కార్యక్రమంపై ఉపన్యాసాలిస్తున్నారే కానీ ఆయన మాత్రం ఆచరించడం లేదు. వికలాంగుల కోసం కలెక్టరేట్ ఆవరణలో అట్టహాసంగా ప్రారంభించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. ఇప్పటి వరకు వీటిని ఒక్క రోజూ వినియోగించిన దాఖలాలు లేవు. -
మూగరోదన
♦ పశువైద్యం... దైన్యం మూగజీవాలకు దేవుడే దిక్కు ♦ సిబ్బంది కొరతతో కునారిల్లుతున్న కేంద్రాలు ♦ చాలాచోట్ల అటెండర్లే దిక్కు ఇప్పటికే చాలా కేంద్రాల మూత ♦ కబేళా బాట పట్టిన పశువులు పశువులది మూగరోదనే... సిబ్బంది కొరతతో వైద్యం అందని పరిస్థితి. పశు వైద్య కేంద్రాలు చాలావరకు మూతపడ్డాయి. అక్కడక్కడా ఉన్న కేంద్రాల్లో అటెండర్లే వైద్యమందిస్తున్నారు. మూగజీవాలు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి. దాణా లేక బక్కచిక్కి కబేళా బాటపడుతున్నాయి. రెండేళ్లుగా వరుస కరువుతో చితికిపోయిన రైతు ప్రత్యామ్నాయంగా పాడి మీదే ఆధారపడ్డాడు. పాడికి ఆయువుపట్టు అయిన పశువైద్యం లేక ఈ పరిశ్రమ కూడా చతికిలపడింది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మిల్క్‌గ్రిడ్’ కూడా డీలా పడింది. ఫలితంగా మూగజీవాలకు దేవుడే దిక్కయ్యాడు. - గజ్వేల్ గజ్వేల్ : జిల్లాలో దశాబ్దాలుగా వ్యవసాయూనికి అనుబంధంగా పాడి పరిశ్రవును అభివృద్ధి చేసుకుంటూ రైతులు జీవనాన్ని సాగిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 8.5 లక్షల ఆవుజాతి, గేదె జాతి పశువులు, 16 లక్షల గొర్రెలు, మేకలు, మరో కోటికిపైగా వాణిజ్య కోడిపిల్లల పెంపకం సాగుతోంది. కరువు కారణంగా పంటలు చేతికందక రైతులు అల్లాడుతున్నారు. ఈ దశలో పాడి పరిశ్రమ ప్రత్యామ్నాయ ఉపాధిగా ఎంచుకున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలు కొరవడటం వారికి శాపంగా మారింది. మిల్క్గ్రిడ్తోపాటు ఇతర పథకాల అవులుకు పశువైద్య కేంద్రాల్లో నెలకొన్న సవుస్యలు అవరోధంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది కొరత... జిల్లాలో మొత్తం 106 పశువైద్యాధికారుల పోస్టులకు గాను ప్రస్తుతం 47మంది మాత్రమే పనిచేస్తున్నారు. 136మంది డిప్లొమా హోల్డర్స్గాను 90మంది, 236 మంది నాల్గో తరగతి ఉద్యోగులకు 186మంది మాత్రమే పనిచేస్తున్నారు. గజ్వేల్‌లోనే ఇలా... జిల్లాను డెయిరీ హబ్ తీర్చిదిద్దడానికి ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో తొలిదశలో ఈ పథకానికి 2014 డిసెంబర్లో అంకురార్పణ చేశారు. ఈ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మొత్తం 12మంది వైద్యాధికారులు పోస్టులకుగాను ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30మంది డిప్లొమా హోల్డర్స్గాను 18పోస్టులు ఖాళీగా, 20 మంది నాల్గోతరగతి ఉద్యోగులకు గాను 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదిలావుంటే గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లితోపాటు మరికొన్ని కేంద్రాలు మూతపడ్డాయి. నియోజకవర్గంలోని చాలా కేంద్రాలు అటెండర్ల ఆధారంగానే నడుస్తున్నాయి. ఏటా రూ.1.40కోట్ల మందులు మాత్రమే పంపిణీ జిల్లాలో ప్రస్తుతం సిబ్బంది ఉన్న పశువైద్య కేంద్రాల్లో గురక వ్యాధికి హెచ్ఎస్ వ్యాక్సిన్, జబ్బవాపు టీకా, గాలికుంటు టీకాలు అందుబాటులో ఉన్నాయి. సీజనల్ వ్యాధులు, సాధారణ చికిత్సలకు అవసరమయ్యే యాంటీబయెటిక్స్, లివర్ సపోర్ట్, నట్టల నివారణ తదితర మందులు ఏటా నాలుగు దఫాలుగా రూ.1.40కోట్ల విలువైన మందులు మాత్రమే సరఫరా అవుతున్నాయి. నిజానికి ఈ కేటాయింపు రెట్టింపు అంటే ఏడాదికి రూ.2.80 కోట్ల మందులు అందిస్తే రైతులకు ఊరట లభించే అవకాశముంది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో పశువైద్యం కోసం రైతులు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుంది. జిల్లాలో పశువైద్యం అందక, పోషణకు అనువైన పరిస్థితుల్లేక రైతులు తమ పశువులను తెగనమ్ముకుంటున్నారు. పేరులోనే పాలను ఇముడ్చుకున్న ములుగు మండలం క్షీరసాగర్ గ్రామ దయనీయ గాథను ‘సాక్షి’ ప్రచురించిన సంగతి తెల్సిందే. ఒక్క క్షీరసాగర్ గ్రామమే కాదు. అన్ని గ్రామాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. సిబ్బంది కొరతతో ఇబ్బందులు... జిల్లాలో పశువైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఫలితంగా పలు సమస్యలు ఎదురవుతున్నాయి.పాల సేకరణను పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాన్ని రైతులు హర్షిస్తున్నారు. పశువైద్య కేంద్రాల్లో నెలకొన్న ఖాళీలను భర్తీచేస్తే భారీ ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. - లక్ష్మారెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ -
పాపం పోలీసు!
రాజధాని నేపథ్యంలో తీవ్రమైన పని ఒత్తిడి నిత్యం వీఐపీల పర్యటనలు, ఎక్కడో చోట ఆందోళనలు అమలులోకి రాని వారాంతపు సెలవు ప్రకటన సిబ్బందిని పెంచకపోగా, ఉన్న పోస్టుల్లో పలు ఖాళీలు నిలిచిపోయిన కొత్త పోలీస్స్టేషన్ల ప్రతిపాదనలు నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పోలీసులు రాజధాని పుణ్యమా అంటూ ప్రస్తుతం పరుగులు తీయాల్సి వస్తోంది. సుమారు ఏడాదిన్నర కాలం నుంచి జిల్లాకు చెందిన పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పని చేయాల్సి వస్తుందంటే అతిశయోక్తి కాదు. పెరిగిన పనిభారంతో రేయింబవళ్లు ఉక్కిరిబిక్కిరికి లోనై సతమతమవుతున్నారు. ఓ వైపు పెరిగిన నేరాల సంఖ్య, మరో వైపు ప్రముఖుల భద్రత కోసం క్షణం తీరిక లేకుండా డ్యూటీలు చేస్తున్నారు. కుటుంబం, వ్యక్తిగత జీవితంపై సైతం శ్రద్ధ కనబర్చే అవకాశం రాజధాని పోలీసులకు లేకుండా పోయింది. పని ఒత్తిడి కారణంగా మానసికంగా కుంగిపోతున్నారు. గుంటూరు : రాజధాని నిర్మాణ నేపథ్యంలో జిల్లా పోలీసుల పరిస్థితి దయనీ యంగా మారింది. ప్రధానంగా గుంటూరు నగరానికి పెరిగిన వీవీఐపీల తాకిడి, కలెక్టరేట్ వద్ద ప్రజా సమస్యలపై ఆందోళనలు, అనూహ్యంగా పెరిగిన నేరాలతో పోలీసులకు గతం కంటే పనిభారం అమాంతంగా పెరిగింది. ప్రముఖుల రక్షణ కోసం ఎండనక, వాననక తిరగాల్సి వస్తోంది. సీఎం రెస్ట్ హౌస్ వద్ద రోజుకొకరు చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ ఏ సంఘటన చోటుచేసుకున్నా అటు వైపు పరిగెత్తాల్సి వస్తోంది. నగరంలో ఊహించని విధంగా పెరిగిన ట్రాఫిక్‌ను కట్టడి చేయాలంటే తలకుమించిన భారమైంది. రాజధాని ప్రకటించినప్పటి నుంచే..... రాజధాని నిర్మాణం ప్రకటించినప్పటి నుంచి గుంటూరు రూరల్, అర్బన్ జిల్లా పోలీసులకు పనిభారం ఎక్కువైంది. వారాంతపు సెలవులు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటిం చినా సిబ్బంది కొరతతో అది ఆచరణకు నోచుకోలేదు. ఎర్రటి ఎండలో సీఎం రెస్ట్ హౌస్ వద్ద, తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతం వద్ద, వారికి కేటాయించిన పలు ప్రాంతాల్లో బందోబస్తులో విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. గుంటూరు అర్బన్ పరిధిలో 36 ఎస్ఐ పోస్టులు, ఎనిమిది హెడ్ కానిస్టేబుల్, 11 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెరిగిన పనిభారానికి తోడు సిబ్బందిని పెంచకపోగా, ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయకపోవడంతో ఆ పని భారమంతా పోలీసులపైనే పడుతోంది. భూ వివాదాలు, దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు వంటి నేరాలు పోలీసు అధికారులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అటకెక్కిన కొత్త పోలీసుస్టేషన్ల ప్రతిపాదన అర్బన్ జిల్లాతోపాటు, రూరల్ జిల్లాలోని కొన్ని పోలీసు స్టేషన్లతో కలిపి ప్రత్యేక పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలని గతంలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. అయితే గుంటూరు, విజయవాడలను కలిపి సీఆర్డీఏ ప్రాంతం మొత్తాన్ని గ్రేటర్ అమరావతి పోలీసు కమిషనరేట్‌గా చేయాలని కృష్ణా జిల్లా ప్రజాప్రతి నిధులు పట్టుబట్టడంతో దీనిపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి పోలీసు కష్టాలను తీర్చాలంటూ పలువురు కోరుతున్నారు. -
ఆరోగ్య కేంద్రానికి.. అనారోగ్యం.!
మందులున్నా వైద్యం అంతంతమాత్రమే వంతుల వారీగా డాక్టర్ల విధులు పట్టించుకోని అధికారులు, పాలకులు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే చందంగా ఉంది మండలంలోని ఒడితల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి. సిబ్బంది కొరతతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఉన్న డాక్టర్లు కూడా వంతుల వారీగా విధులు నిర్వహిస్తుండడంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఉన్నతాధికారులు చూసీ చూడనట్లు ఉంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో ఖాళీ పోస్టులను నియమించి మెరుగైన వైద్యం అందించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. - చిట్యాల ఆస్పత్రిలో రోగులకు బెడ్స్, సరిపడ మం దులు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా రోగులను చూసే నాథుడు లేడు. ఎనిమిది నెలల క్రితం ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్‌రావు పదోన్నతిపై వెళ్లారు. చెల్పూర్ పీహెచ్సీ డాక్టర్ పద్మజా రాణిని ఇన్‌చార్జీగా నియమి ంచారు. ఆమె అప్పుడప్పుడు రావడం వల న ఆసుపత్రి నిర్వహణ గాడితప్పింది. అయి తే గత రెండు నెలల క్రితం హుజూరాబాద్ కు చెందిన డాక్టర్ జడల శ్రీనివాస్‌ను నియమించారు. ఈ డాక్టర్‌తోనైన ఆస్పత్రి నిర్వహణ బాగుంటుందనుకుంటే వారానికి బు ధ, శుక్రవారాలలో రెండు రోజుల పాటు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. వైద్యసిబ్బంది కొరత రోగులకు శాపంగా మారింది. ఫస్ట్ ఏఎన్ఎం పోస్టులు -3, ల్యాబ్ టెక్నీషన్, స్టాఫ్ నర్సు, హెల్త్ అసిస్టెంట్ -2, నైట్ వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధి కారులు స్పందించి ఖాళీ పోస్టులను భర్తీచేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. వైద్య శిబిరం నిర్వహించాలి దవాఖానకు పోతే డాక్టర్ ఉండడం లే దు. ఏఎన్ఎం మా త్రమే వచ్చిపోతుం ది. మా గ్రామంలో ఇప్పటివరకు వైద్య శిబిరం నిర్వహించలేదు. ఇప్పటికైన సార్లు స్పందించి మా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి రోగులకు పరీక్షలు జరిపి మందులివ్వాలి. - ఊయ్యాల రమ, నైన్పాక అవగాహన కల్పించాలి వ్యాధులపై ప్రజలలో అవగాహన లేదు. ఆరో గ్య సూత్రాలు పాటించేలా అవగాహన కల్పించాలి. సెకండ్ ఏఎన్ఎంలు తప్ప గ్రామానికి ఎవరూ రావడం లేదు. వైద్యులు, సిబ్బంది కలిసి ప్రజలకు వ్యాధులపై అవగాహన సదస్సులు నిర్వహించాలి. - దాసారపు నరేష్, తిర్మాలాపూర్ -
కుడా ఇక.. బడా
పరిధి పెంపుపై ప్రభుత్వం దృష్టి రెట్టింపు కానున్న ఉద్యోగుల సంఖ్య సీఎం చెంతకు చేరిన ప్రతిపాదనలు హన్మకొండ: తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ‘కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ (కుడా) జవసత్వాలు కూడగట్టుకోనుంది. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న కుడాకు కష్టాలు తీరనున్నాయి. వరంగల్ నగరం, పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 1805 చదరపు కిలోమీటర్ల పరిధితో 1982లో ‘కుడా’ను ఏర్పాటు చేశా రు. కుడా పరిధిలోకి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 171 గ్రామా లు ఉన్నాయి. ఇందులో 27 గ్రామాలు కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నాయి. చైర్మన్, వైస్ చైర్మలతో పాటు మొత్తం పరిపాలన, ప్లానింగ్, అభివృద్ధి, అర్బన్ ఫారెస్ట్, భూసేకరణ, అకౌంట్స్ మొత్తం ఆరు విభాగాలతో కుడాను ఏర్పాటు చేశారు. మొత్తం 168 పోస్టులు మంజూరు చేశారు. అయితే గడిచిన ముప్పై ఏళ్లుగా ఉద్యోగులను భర్తీ చేయలేదు. కేవలం 46 మంది ఉద్యోగస్తులతో నెట్టుకొస్తోంది. దీంతో అభివృద్ధి పనుల్లో వేగం మందగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరంగల్.. రాష్ట్రంలో రెండో ప్రధాన నగరం హోదాలో ఉంది. నగర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉంది. మరోవైపు కుడా పరిధిలో జనాభా 7.6 లక్షల నుంచి 13 లక్షలకు చేరుకుంది. ఇటీవల నగర అభివృద్ధిపై సమీక్ష సందర్భంగా కుడాను బలోపేతం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఖాళీలన్నీ భర్తీ.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన హృదయ్, అమృత్, స్మార్ట్ సిటీలలో వరంగల్‌కు చోటు దక్కింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను వరంగల్‌లో నెలకొల్పబోతోంది. అంతేకాకుండా నగరంలో మురికివాడల్లో నివసిస్తున్న పేదల కోసం 30వేల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించనున్నారు. అంతేకాకుండా కుడా పరిధిని 1805 చదరపు కిలోమీటర్ల నుంచి 2300 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించాలని ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. దీంతో కుడాపై పని భారం అనూహ్యంగా పెరిగిపోనుంది. వీటన్నింటీని దృష్టిలో ఉంచుకుని గతంలో మంజూరై ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేయాలని సీఎం కే సీఆర్ నిర్ణయించారు. పెరిగిన జనాభా, అభివృద్ధి కార్యక్రమాలు, మాస్టర్‌ప్లాన్ ఆధారంగా అవసరమైన మేరకు కొత్త పోస్టులు సృష్టించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర మున్సిపల్ శాఖ సిద్ధం చేస్తోంది. ఈమేరకు త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
సగం ఖాళీ
మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత పట్టణాలుగా మారినా ఫలితం లేదు ఉన్నవారితోనే నెట్టుకొస్తున్న పురపాలికలు సేవలు అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలు హన్మకొండ : సిబ్బంది కొరతతో మున్సిపాలిటీల్లో పాలన మందగించింది. పారిశుద్ధ్యం, టౌన్‌ప్లానింగ్ వంటి కీలక విభాగాల్లో ఇన్చార్జుల పాలన కొనసాగుతోంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌ను మినహాయిస్తే జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలు, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నగర పంచాయతీలలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. ఆ పురపాలికలు సగం సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి. భూపాలపల్లి, పరకాల, నర్సంపేటలు మేజర్ గ్రామపంచాయతీల నుంచి నగర పంచాయతీలుగా 2011లో అప్‌గ్రేడ్ అయినా ఉద్యోగుల సంఖ్య పెరగలేదు. దీంతో పట్టణ ప్రజలకు మెరుగైన సేవ లు అందడం లేదు. భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులు ఉండగా 31 మంది ఉద్యోగులు ఉండాలి. కానీ, కేవలం 9 మందే విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది మంది ఉద్యోగులు ఇక్కడ పోస్టింగ్ రాగానే ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై వెళ్లిపోతున్నారు. గతేడాది భూపాలపల్లిలో పోస్టింగ్ తీసుకున్న మేనేజర్ కొద్ది రోజుల్లోనే మెదక్ జిల్లా దుబ్బాకకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. దీంతో పరిపాలనకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉంటున్నాయి. అకౌంట్స్ విభాగంలో ముగ్గురు ఉద్యోగులు ఉండాలనే నిబంధనలుండగా ఒక్కరూ లేకుండా పోయారు. ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరకాల ఏఈ ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లి, పరకాలకు ఒక్కరే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో తాగునీటి నిర్వహణ గాడిన పడటం లేదు. పరకాల నగర పంచాయతీలో 30 పోస్టులు మం జూరు కాగా కేవలం ఆరుగురే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సరిపడా సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపైనే పనిభారం పడుతోంది. టౌన్ ప్లానింగ్‌లో ఉద్యోగుల పోస్టులు భర్తీ కాకపోవడంతో భవన నిర్మాణ అనుమతుల విషయంలో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. భవనాల నిర్మాణ అనుమతి కోరుతూ వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పర్యవేక్షణ అధికారులు లేక పో వడంతో పట్టణంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణా లు వెలుస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొంద రు ప్రజాప్రతినిధులు బినామీలను నియమించుకుని నోటీసులు జారీ చేస్తామని బెదిరిస్తూ అక్రమ భవన నిర్మాణ యజమానుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. నర్సంపేట నగర పంచాయుతీలో 63 వుంది ఉద్యోగులకుగాను కేవలం 27వుంది ఉన్నారు. వివిధపను ల కోసం కార్యాలయం వచ్చే వారు చిన్న పనికి కూ డా రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. మున్సిపల్ సిబ్బంది మధ్య గ్రూపు రాజకీయాలు పెరిగిపోయా యి. నిత్యం ఒకవర్గంపై మరోవర్గం ఫిర్యాదులు చే సుకుంటూ ప్రజాసేవలను పక్కకు పెడుతున్నారు. అక్కడా అంతే.. 1953లోనే మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన జనగామ మున్సిపాలిటీలోనూ సిబ్బంది కొరత ఉంది. ప్రస్తుతం గేడ్-్ర2 మున్సిపాలిటీగా ఉన్న జనగామలో మొత్తం 132 పోస్టులకు గాను 70 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 62 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా పరిపాలన విభాగంలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పట్టణ అభివృద్ధికి సంబంధించి వేగంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా మారింది. ఇంజనీరింగ్ విభాగంలో 22 పోస్టులకు గాను 14 మంది పనిచేస్తున్నారు. ఈ విభాగం ఆధ్వర్యంలో సరైన ప్రణాళికా లేకుండా నిర్మించిన డ్రెరుునేజీలతో కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. వర్షకాలంలో మురుగునీరు, వరద నీటితో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయి. పబ్లిక్ హెల్త్ వర్కర్లు 57 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 27 మంది ఉన్నారు. 2011లో మహబూబాబాద్ మేజర్ గ్రామపంచాయతీ నుంచి ఏకంగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహబూబాబాద్ మున్సిపాలిటీ జనాభా 52 వేలు. కానీ, అనధికారికంగా సుమారు 70 వేల జనాభా ఉంటుంది. జనాభాకు తగ్గ సిబ్బంది లేరు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ పోస్టు దాదాపు ఏడాదిగా ఖాళీగా ఉంది. దీంతో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఐదు పోస్టులకు గాను ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతులు కష్టంగా మారాయి. మరికొందరు ఎటువంటి అనుమతి లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. పురపాలక సంఘం పాలకమండలి సమావేశంలో సైతం అక్రమ నిర్మాణాలపై చర్చ జరిగింది. తాగునీటి సమస్య దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. పర్మినెంట్ రెవెన్యూ సిబ్బంది, బిల్ కలెక్టర్లు లేకపోవడంతో ఆస్తిపన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. పేరుకే గ్రేటర్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 160 పోస్టులకు గాను 124 మంది సిబ్బంది ఉన్నారు. 36 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల 42 విలీన గ్రామాలు కార్పొరేషన్లో విలీనమయ్యాయి. దీంతో దాదాపు 3 లక్షల జనాభా పెరిగింది. ఇందుకు తగ్గట్లుగా పోస్టుల సంఖ్య పెరగాల్సి ఉంది. పరిపాలన విభాగంలో సి బ్బంది కొరత లేకపోవడంతో పాలన వ్యవహారాలకు చాలా వరకు సాఫీగానే సాగుతున్నాయి. కానీ టౌన్‌ప్లానింగ్, అకౌంట్స్, ప్రజారోగ్య విభాగాల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్ విభాగంలో సిబ్బంది లేకపోవడంతో లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలపై స్పష్టత కరువైంది. రికార్డుల ప్రకా రం 600 ఖాళీ స్థలాలు ఉండగా ప్రస్తుతం 180 స్థలాలనే గుర్తించారు. మిగిలిన స్థలాలు సర్వే చేసేందుకు సరిపడా సిబ్బంది లేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. ఇందుకు అనుగుణంగా వేగంగా పనులు జరిగేందుకు వీలుగా కొత్త పోస్టులు మంజూరు చేయడంతో పాటు పాత పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. -
నిప్పు... ముప్పు
సమస్యల వలయంలో అగ్నిమాపక కేంద్రాలు చాలీచాలని సిబ్బంది.. అరకొర వసతులు పెరగని ఫైర్ స్టేషన్లు నాలుగేళ్లలో 4,861ప్రమాదాలు రూ.141 కోట్ల ఆస్తినష్టం 65 మంది మృత్యువాత ఒక చోట నీరుండదు. ఒక చోట సమయానికి వాహనం ముందుకు కదలదు. మరోచోటు నుంచి సకాలంలో ప్రమాద స్థలికి వాహనం చేరుకోదు. ఇంకోచోట సిబ్బంది కూర్చోడానికి కూడా సదుపాయాలు ఉండవు. సిబ్బంది సంఖ్యా అంతంతే... ఒకేసారి ఒకటి...రెండు చోట్ల ప్రమాదాలు సంభవిస్తే ‘సర్దుకుపోతున్నారు’. పొరపాటున ఈ సంఖ్య నాలుగైదుకు చేరుకుంటే ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే. ఇదీ నగరంలోని అగ్నిమాపక శాఖ దుస్థితి. ఈ సమస్యలు ఉన్నాయి కదా అని ప్రమాదాలు రాకుండా ఉంటాయా? ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఉంటాయా అనేది వేల కోట్ల ప్రశ్న. వేసవి వచ్చిందంటే మండే ఎండలతో పాటు అగ్ని ప్రమాదాలూ నగర వాసులను భయపెడుతుంటాయి.ఏటా ఏదో ఒక ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అదే స్థాయిలో ఆస్తి, నష్టాలు ఉంటున్నాయి. దీన్ని నివారించడానికి అగ్నిమాపక శాఖ సామర్థ్యం సరిపోవడం లేదు. ముందు జాగ్రత్త చర్యలూ అలాగే ఉంటున్నాయి. సిబ్బంది కొరత... వసతుల లేమి...నీరు దొరక్కపోవడం వంటివి ఆ శాఖను వేధిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగేళ్లలో 4,861 అగ్ని ప్రమాదాలు చే టుచేసుకున్నాయి. రూ.141 కోట్ల ఆస్తినష్టంతో పాటు 65 ప్రాణాలు అగ్నికి ఆహుతైపోయాయి. మెట్రోలతో పోలిస్తే... కోల్‌కతా, ముంబయి, చెన్నై, ఢిల్లీ మెట్రో నగరాల్లో అగ్ని మాపక శాఖకు ఉన్న ఆర్థిక వనరులు, ఫైరింజన్లు, సిబ్బందితో పోలిస్తే హైదరాబాద్ బాగా వెనుకబడి ఉందనడంలో సందేహం లేదు. నిబంధనల మేరకు 50 వేల ఠమొదటిపేజీ తరువాయి జనాభాకు ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. నగరంలో ప్రస్తుతం 16 స్టేషన్లే ఉన్నాయి. ఎప్పుడో 1970 నాటి జనాభాను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినవి. ప్రస్తుత జనాభాకు కనీసం 17 స్టేషన్లు అదనంగా అవసరం. 228 మంది ఫైర్‌మెన్ కావాల్సి ఉండగా... 149 మంది మాత్రమే ఉన్నారు. వీరితో పాటు 50 డ్రైవర్ పోస్టులు అవసరం.ఇతర మహా నగరాలతో పోలిస్తే అత్యాధునిక పరికరాలు మాత్రం సమానంగానే ఉన్నాయి. సిబ్బంది, స్టేషన్ల కొరత వల్ల ఉన్న వారిపైనే అధిక భారం పడుతోంది. ఇప్పుడున్న స్టేషన్ పరిధి ప్రకారం ట్రాఫిక్ రద్దీలో వెళ్లేసరికి నష్టం జరిగిపోతోంది. ఆ నాలుగు నెలలే కీలకం... గత మూడేళ్లలో అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తే మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే అత్యధిక అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత ఏడాది మొత్తంలో 1,094 ప్రమాదాలు చోటుచేసుకోగా... ఈ నాలుగు నెలల్లోనే 539 ప్రమాదాలు నమోదయ్యాయి. ప్రతిపాదనలు బుట్టదాఖలు జీహెచ్ఎంసీ పరిధిలో 50 వేల జనాభాకు ఒక స్టేషన్ ఉండాలనేది నిబంధన. ఏటా ఆరు కొత్త స్టేషన్లు నెలకొల్పాలని హైపవర్ కమిటి మూడేళ్ల క్రితం ప్రతిపాదించింది. ఈ లెక్కన ఇప్పటికే 17 కొత్త స్టేషన్లు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఒక్క స్టేషన్ కూడా కొత్తగా రాకపోవడం గమనార్హం. ఈ ప్రాంతాలలో తప్పనిసరి... ఎల్బీనగర్, మేడ్చల్, జూబ్లీహిల్స్, టోలిచౌకి, ఉప్పల్ నంచి భువనగిరి వరకు ఏదైనా ప్రాంతంలో ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే మిగిలిన స్టేషన్లపై భారం తగ్గుతుంది. ఆర్టీఓ అనుమతిస్తేనే... అరకొర సిబ్బందితో కొట్టుమిట్టాడుతున్న ఈ శాఖలో అగ్నిమాపక వాహనాల మరమ్మతులు తలనొప్పిగా మారాయి. చిన్నపాటి మరమ్మతులకైనా రోజుల తరబడి వేచి ఉండాల్సిందే. సంబంధిత ప్రాంతీయ రవాణాధికారి (ఆర్టీఓ) అనుమతిస్తేనే ఆ వాహనం మరమ్మతులకు నోచుకుంటుంది. ఈలోగా ప్రమాదాలు సంభవిస్తే అంతే సంగతులు. అగ్నిమాపక శాఖతో ఎలాంటి సంబంధంలేని ఆర్టీఓ అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. దీనికి స్వస్తి చెప్పి... వాహన మరమ్మతులకు ప్రత్యేకంగా నగరంలో వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తప్పుతాయి. శాశ్వత భవనాలు లేక... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో 23 కేంద్రాలకు గాను 14 చోట్ల మాత్రమే శాశ్వత భవనాలు ఉన్నాయి. తాత్కాలిక భవనాలలో... అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. శాశ్వత భవనాల్లోనూ సదుపాయాలు అంతంత మాత్రమే. నీళ్లెక్కడ? గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని ఫైర్ స్టేషన్లలో నీటి కొరత ఉంది. వాహనంలో నీళ్లు నింపేందుకు వారు కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. సొంత భవనాలు ఉన్న చోట సైతం బోర్‌వెల్స్ లేవు. ఎక్కడో ఉన్న వాటర్ వర్క్స్ విభాగంపై ఆధారపడుతున్నారు. కొన్నిచోట్ల ట్యాంక్లే దిక్కు. కనిపించని రక్షణ చర్యలు నగరంలోని వివిధ ముఖ్యప్రాంతాలు, కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాల నుంచి రక్షించే ఏర్పాట్లు లేవు. ప్రమాదం సంభవిస్తే భారీ స్థాయిలో నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. 1170 ప్రైవేట్ ఆస్పత్రుల్లో కేవలం 465 ఆస్పత్రులకు మాత్రమే ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లున్నాయి. 707 ఫంక్షన్ హాళ్లకుగాను 34 చోట్ల మాత్రమే ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు చేసి జీహెచ్ఎంసీ నుంచి ఎన్ఓసీ పొందాయి. మిగతావాటికి ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లే లేవు. 123 టింబర్ డిపోలకుగాను కనీసం ఒక్కచోట కూడా అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు లేవు. 6124 వస్త్ర దుకాణాలు, ఇత ర షో రూమ్‌లలో ఒక్క చోట కూడా ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవు. ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేని సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఏటా ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ఇంతవరకు ఎవరిపైనా ఎలాంటి చర్యలు లేకపోవడంతో సంబంధిత యాజమాన్యాలు దీన్ని పట్టించుకోవడం లేదు. నోటీసులిచ్చినా .. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించని భవన యజమానులపై కోర్టులో కేసులు న మోదు చేయడం..న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం మినహా జీహెచ్ఎంసీకి అధికారాల్లేవు. దీంతో సంబంధిత అధికారుల ప్రకటనలకు స్పందిస్తున్న వారు లేరు. అంతేకాదు నోటీసులు, తుది నోటీసులతో హెచ్చరికలు జారీ చేస్తున్నా స్పందించడం లేదు. మరోవైపు నగరంలో బ్యాంకులు, పెట్రోలు బంక్‌లు, పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో జీహెచ్ఎంసీ వద్ద లెక్కలు లేకపోవడం గమనార్హం. దీని వల్ల సమస్య అలాగే ఉండిపోతోంది. వాహనాల ప్రత్యేకతలు మలక్‌పేట, మొగల్పురా, చందులాల్ బారాదారి, లంగర్‌హౌస్, ఫిలింనగర్, గౌలిగూడ, ముషీరాబాద్, మౌలాలి, సికింద్రాబాద్, సనత్‌నగర్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, సాలర్జంగ్ మ్యూజియం, పంజగుట్టలలో ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. స్నారికల్ (సికింద్రాబాద్)లో బహుళ అంతస్థులలో ప్రమాదాలు నివారించే స్టేషన్ ఉంది. వీటిలో ఫోమ్ టెండర్, డీసీపీ టెండర్, స్నారికల్ (100 ఫీట్ల ఎత్తు), అజ్మత్, బ్రాంటో స్కై లిఫ్ట్ (54 మీటర్ల ఎత్తు) వాహనాలు ఉన్నాయి. ఇరుకు ప్రాంతాల్లో ప్రమాదాలను అరికట్టడానికి మల్కాజిగిరి ఐడీఏ నాచారం అగ్నిమాపక కేంద్రానికి మిస్ట్జిప్ ఫైర్‌ఇంజన్ (మినీ) అందుబాటులోకి వచ్చిందని స్థానిక ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాములు తెలిపారు. 300 లీటర్ల నీరు, 50 లీటర్ల ఫోమ్, పెద్ద ఫైర్ ఇంజన్ సామర్థ్యంతో ఈ మినీ ఫైరింజన్ పని చేస్తుంది. వాటర్ టెండర్.... (పెద్ద ఫైరింజన్) వాటర్ టెండర్ 4500 నీటి సామర్ధ్యం కలిగి ఉంటుంది. పెద్ద అగ్ని ప్రమాదాల సమయంలో దీన్ని ఉపయోగిస్తారు. రసాయనాల కారణంగా ప్రమాదాలు జరిగితే ఫోమ్ బ్రాంచిని ఉపయోగిస్తారు. ఒక కేంద్రంలో ఒక వాటర్ టెండర్‌తో పాటు మొత్తం 16 మంది సిబ్బంది ఉంటారు. అందులో స్టేషన్ ఫైర్ ఆఫీసర్-1, డ్రైవర్లు-3, లీడింగ్ ఫైర్‌మెన్-2, ఫైర్‌మెన్-10 మంది ఉంటారు. బ్రాంటో స్కై లిఫ్ట్ ఈ వాహనాన్ని 2009లో సికింద్రాబాద్ స్టేషన్‌కు తెచ్చారు. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన వోల్వో కంపెనీ దీన్ని తయారు చేసింది. 54 మీటర్ల పొడవైన నిచ్చెన దీని ప్రత్యేకత.18 అంతస్తుల్లో అగ్ని ప్రమాదం సంభవించినా...మంటలను అదుపు చేయవచ్చు. ఈ నిచ్చెనకు కేజ్ ఉంటుంది. పై అంతస్తులో మంటల్లో చిక్కుకున్న ఇద్దరిని ఒకేసారి రక్షించి తీసుకుని రావచ్చు.ఇందులో నీళ్లు ఉండవు. మరో ఫైరింజన్లోని నీటితో మంటలను అదుపులోకి తెస్తారు.మంటల వేడి నుంచి, రసాయన చర్యల నుంచి రక్షించే ఫైర్ సూట్ ఇందులో అందుబాటులో ఉంటుంది. ఇలాంటి వాహనాలు రాష్ట్రంలో మూడు ఉన్నాయి. (రంగారెడ్డి, సికింద్రాబాద్, విజయవాడ.) స్నారికల్ వాహనం ఇందులో 18 మీటర్ల ఎత్తులో జరిగే అగ్ని ప్రమాదాలను నివారించేలా నిచ్చెన ఉంటుంది .6 అంతస్తుల వరకు పనిచేస్తుంది.ఇద్దరు వ్యక్తులను ఒకేసారి రక్షించవచ్చు. రాష్ట్రంలో ఈ వాహనం ఒకటి మాత్రమే ఉంది. -
అగ్గి లేస్తే బుగ్గే
జిల్లాలో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అంతంతమాత్రమే... ఫైర్ స్టేషన్లలో పీడిస్తున్న సిబ్బంది లేమి మూలకుపడ్డ ఫైరింజన్లు.. నీటి కొరత కానరాని ప్రత్యామ్నాయ చర్యలు వేసవి కాలం వచ్చేసింది... ఇప్పటికే మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. అరుుతే మన జిల్లా యంత్రాంగం ఇంకా మేల్కొన్నట్లు లేదు. ఫైరింజన్ల కొరత... ఫైర్ స్టేషన్లలో సిబ్బంది లేమి పీడిస్తుండగా... నీటి తిప్పలు వెక్కిరిస్తున్నారుు. జిల్లావ్యాప్తంగా ఫైర్ స్టేషన్లు, ఫైరింజన్ల (అగ్నిమాపక యంత్రాలు) దుస్థితి, నీటి తిప్పలపై ‘సాక్షి’ ఫోకస్... భూపాలపల్లి : పారిశ్రామిక ప్రాంతమైన భూ పాలపల్లి నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం లేదు. పరకాల వాహనమే దిక్కు. ► స్టేషన్ ఘన్పూర్ : స్టేషన్‌ఘన్‌పూర్‌లో కూడా ఫైర్‌స్టేషన్ లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే జనగామ లేదా హన్మకొండ నుంచి ఫైర్ ఇంజన్ రావాల్సిందే. ► వర్ధన్నపేట టౌన్ : వర్ధన్నపేటలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి స్థలాన్ని కేటాయించినా పనులు మొదలుకాలేదు. ►పాలకుర్తి : ఈ నియోజకవర్గంలో కూడా ఫైర్ స్టేషన్ లేదు. నియోజకవర్గాల వారీగా ఫైర్ స్టేషన్ల దుస్థితి ► డోర్నకల్ : ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా.. మరిపెడలో ఫైర్‌స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి 2 మండలాలకు మాత్రమే సేవలందుతున్నాయి. మిగతా మండలాలకు మహబూబాబాద్ నుంచి అగ్నిమాపక వాహనం రావా ల్సి వస్తోంది. సకాలంలో చేరకపోవడంతో నష్టం ఎక్కువగా ఉంటోంది. ► జనగామ : నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఉండగా.. దీని పరిధిలో 11 మండలాలు వస్తున్నా యి. 16 మంది సిబ్బందికి 11 మందే ఉన్నారు. నీటిని బయట నింపుకోవాల్సి వస్తోంది. ► మహబూబాబాద్ : 7 మండలాలకు మానుకోటలోని ఫైరింజనే దిక్కు. నీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. ► నర్సంపేట : నర్సంపేటలోని ద్వారకపేటలో ఫైర్‌స్టేషన్ ఉంది. ఎక్కడైనా ప్రవూదం జరిగితే.. వూర్గవుధ్యలో నీరు నింపుకోవాల్సిన దుస్థితి. ► పరకాల : పరకాలలోని అగ్నిమాపక కేంద్రంలో అన్నీ సమస్యలే. నీటి సమస్య తీవ్రంగా ఉండగా.. 15మందికి గాను పది మంది సిబ్బందే ఉన్నారు. వాహనం కూడా తరచూ మరమ్మతులకు వస్తోంది. ► ములుగు : ములుగు వ్యవసాయశాఖ కార్యాలయంలో ఫైర్‌స్టేషన్ ఉంది. ఈ నియోజకవర్గంలోని ఆరు మండలాలతోపాటు భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం చెల్పూరు వరకు ఇక్కడి నుంచే వాహనం వెళ్లాల్సి వస్తోంది. ►తూరు, పశ్చిమ : వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఫైర్ స్టేషన్లో 21 మందికి ఆరుగురు, పశ్చిమ సెగ్మెంట్ పరిధిలోని హన్మకొండ బాలసముద్రంలోని స్టేషన్లో 10 మందికి ఏడుగురే విధులు నిర్వర్తిస్తున్నారు. వాహనాల్లో కూడా ఒకటి మూలన పడింది. ఫైర్‌స్టేషన్ లేక కష్టాలు పాలకుర్తి: పాలకుర్తి నియోజకవర్గంలో ఐదు మండలాలు 101 రెవెన్యూ గ్రామాలున్నాయి. సగటున ఏటా నియోజకవర్గంలో 10 కి పైగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఫైర్‌స్టేషన్ లేకపోవడంతో వీటి నివారణ సాధ్యం కావడం లేదు. అగ్ని ప్రమాదాలు జరిగితే తొర్రూరు మండలానికి.. మహబూబాబాద్ నుంచి, రాయపర్తి మండలానికి వరంగల్ నుంచి, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు జనగామ నుంచి ఫైర్ ఇంజిన్ రావాల్సి ఉంటుంది. సుమారు 40 - 50 కి.మీ దూరం నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే తొర్రూరు. రాయపర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు 20-25 కి.మీ దూరం మాత్రమే ఉంటుంది. ఏ మండలంలో ప్రమాదం జరిగినా సమయానికి ఫైర్ ఇంజిన్ చేరుకునే అవకాశం ఉంటుంది. పరిధి పెద్దది.. బండి పాతది పరకాల : పరకాల అగ్నిమాపక కేంద్రంలో అన్ని సమస్యలే. వాటర్ లెండర్ వాహనం పాతది. దీన్ని నింపేందుకు నాలుగు గంటలు పడుతోంది. వాటర్ సంప్ల్లో నీరు నింపితే ఇంకిపోతోంది. ఫైరింజన్ పికప్కే పావుగంట పడుతోంది. ఏయిర్ నింపడానికి వీలుకావట్లేదు. సరిపడా నీళ్లు లేవు. మంటలార్పేందుకు తగినంత సిబ్బంది లేరు. పరకాల పరిధిలో ఆత్మకూరు, రేగొండ, శాయంపేట, మొగుళ్లపల్లి, చిట్యాల, భూపాలపల్లి మండలాలున్నారుు. 15మంది సిబ్బందికి పది మంది మాత్రమే ఉన్నారు. అందులో ఇద్దరు డిప్యూటేషన్‌పై ఇక్కడ పనిచేస్తున్నారు. ఇద్దరు డ్రైవర్ ఆపరేటర్, నాలుగు ఫైర్‌మెన్ పోస్టులు భర్తీ చేయూల్సి ఉంది. రాజయ్య హామీ.. నెరవేరదేమీ.. స్టేషన్‌ఘన్‌పూర్ : జిల్లాలో పెద్ద నియోజకవర్గం స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు నేటి కీ సన్నాహాలు చేపట్టడం లేదు. ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. తహ శీల్దార్ రామ్మూర్తి తన కార్యాలయ ఆవరణలో భూసర్వే నిర్వహించినా జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు నేటికీ రాలేదు. అగ్ని ప్రమాదం జరిగితే 28 కిలోమీటర్ల దూరంలోని జనగామ నుంచి లేదా 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న హన్మకొండ నుంచి ఫైరింజన్ రావాల్సి వస్తోంది. అరకొరగా సిబ్బంది.. జనగామ: జనగామ అగ్నిమాపక కేంద్రంలో వసతులు కరువయ్యూరుు. 11 మండలాలకు పెద్దిదిక్కుగా ఉన్న ఇక్కడ సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫైర్ ఆఫీసర్‌తో కలిపి 16 మంది సిబ్బంది ఉండాలి. కానీ 11 మందే ఉన్నారు. 10 మంది ఫైర్మెన్లకు గాను నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నారుు. ముగ్గురు డ్రైవర్ కమ్ ఆపరేటర్లు ఉండాల్సి ఉండగా ఒక పోస్టు ఖాళీగా ఉంది. సిబ్బందికి అదనపు పని భారం పడుతోంది. నీటి సౌకర్యం లేదు. బయటకు వెళ్లి ఫైర్ట్యాంకర్ను నింపుకోవాల్సి వస్తోంది. వేసవిలో వచ్చిపోయే కరెంటుకు ఏ బావి వద్ద నింపుదామన్నా ఇబ్బందే. కార్యాలయ భవనం శిథిలావ స్థకు చేరింది. వర్షాకాలంలో ఉరుస్తోంది. సిబ్బంది విశ్రాంతి గది చాలా చిన్నగా ఉంది. ప్రహరీ నిర్మాణం, నీటి ట్యాంకు మరమ్మతుకు నిధులు మంజూరైనట్లు సమాచారం ఉందని ఫైర్ ఆఫీసర్ బుచ్చి ఎల్లయ్య తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తిలలో ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలని కోరారు. ములుగులో వసతుల లేమి ములుగు : స్థానిక అగ్నిమాపక కేంద్రం ప్రస్తుతం వ్యవసాయశాఖ గోదాంలో కొనసాగుతోంది. ములుగు నుంచి మంగపేట అకినపల్లి మల్లారం వరకు సుమారు 80 కిలో మీటర్ల పరిధి ఉండడం.. ఒకే ఫైర్‌స్టేషన్ ఉండడంతో పూర్తిస్థారుులో సేవలు అందడం లేదు. నియోజకవర్గంలోని ఆరు మండలాలతోపాటు భూపాలపల్లిలోని గణపురం మండలం చెల్పూరు వరకు అష్టకష్టాలతో సేవలందిస్తున్నారు. 16 మందికి 12 మంది సిబ్బందే ఉన్నారు. 2013లో డిగ్రీ కళాశాల ఆవరణలో 20 గుంటల స్థలం కేటాయించారు. కానీ నిధుల్లేక పనులు ముందుకు సాగలేదు. వర్షాభావ పరిస్థితులతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. అగ్ని ప్రమాదాల నివారణకు నీటి కష్టాలు తప్పేలా లేవు. సకాలంలో అందని సేవలు డోర్నకల్ : నియోజకవర్గంలో మరిపెడలో మాత్రమే ఫైర్‌స్టేషన్ ఉంది. డోర్నకల్, కురవి మండలాలతో పాటు నర్సింహులపేటలోని కొన్ని గ్రామాలకు మహబూబాబాద్ ఫైర్ స్టేషన్ సేవలు అందుతున్నా.. ఫలితమైతే ఉండట్లేదు. మరిపెడ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 2007లో అగ్నిమాపక కేంద్రం కాంటాక్ట్ పద్ధతిన ఔట్ సోర్సింగ్ స్టేషన్‌గా ఏర్పాటు చేశారు. ఫైరింజన్‌ను అద్దెకు తీసుకుని 14 మంది సిబ్బందిని కాంటాక్ట్ పద్ధతిన నియమించారు. వరంగల్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చి చాలీచాలని వేతనం(రూ. 5000)తో పనిచేయడం కష్టమవుతోందని సిబ్బంది చెబుతున్నారు. అగ్నిమాపక వాహనం కూడా పాత మోడల్ కావడంతో తలుపులు సక్రమంగా పడట్లేదు. నీటి కోసం మూడు కిలోమీటర్ల దూరంలోని చెరువుకు లేదా ఖమ్మం జిల్లా తిరుమాలాయపాలెం సమీపంలోని కెనాల్‌కు ఫైరింజన్ వెళ్లాల్సి వస్తోంది. ప్రతీ ఆదివారం మరిపెడలో సంత నిర్వహించడం మెయిన్ రోడ్డు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేస్తుండటంతో ఆ రోజు అగ్నిమాపక వాహనాన్ని వేరే ప్రాంతంలో నిలుపుతున్నారు. అగ్నిమాపక కేంద్రం నిర్వహణను ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి పూర్తిస్థాయి వసతులు కల్పించాలని, వేతనాలు పెంచాలని సిబ్బంది కోరుతున్నారు. ఏడు మండలాలకు ఒక్కటే.. మహబూబాబాద్ : పట్టణంలోని ఫైర్‌స్టేషన్ పరిధిలో మానుకోట, కురవి, డోర్నకల్, తొర్రూరు, నెల్లికుదురు, కేసముద్రం, నర్సింహులపేట మండలాలున్నాయి. మానుకోట నుంచి నర్సింహులపేటకు దూరభారం ఉండడంతో సేవలు సమర్థంగా అందడం లేదు. ఈ కార్యాలయంలో బోర్ వేసినా సమృద్ధిగా నీరు లేదు. పట్టణ శివారులోని మున్నేరువాగు, మండలంలోని ఈదులపూసపల్లి చెరువులో నీటి మట్టం తగ్గడంతో ట్యాంకు నింపుకోవడం సమస్యగా మారుతోంది. మున్సిపాలిటీ సిబ్బంది కూడా ట్యాంక్ నింపడానికి ఇబ్బందులు పెడుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఫైరింజన్ కండీషన్ అంతంతమాత్రమే. కార్యాలయంలో మరో డ్రైవర్, ఫైర్ మెన్ సిబ్బందిని భర్తీ చేయూల్సి ఉంది. గడువులోగా ఏర్పాటయ్యేనా? వర్ధన్నపేట టౌన్: ఈనెల 11న స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో అగ్నిమాపక భవన నిర్మాణానికి 694 చదరపు గజాల స్థలాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ చేతుల మీదుగా అందచేశారు. మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి కార్యాలయూన్ని ప్రారంభిస్తామని అధికారులు స్పష్టంచేశారు. ఇప్పటి వరకైతే పనులేవీ ప్రారంభం కాలేదు. మరి గడువులోగా పనులు పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. వేసవిలో వర్ధన్నపేట పిరంగి గడ్డ ప్రాంతంలో వరి పొలం అంటుకుని అగ్రిమాపక శకటం సంఘటనా స్థలానికి వచ్చేలోగా బూడిదే మిగిలింది. వరంగల్ నుంచి ఎంత వేగంగా వచ్చినా ట్రాఫిక్ ఇబ్బందులతో గంట సమయం పడుతుంది. కాలితే బూడిదే.. భూపాలపల్లి : కోల్‌బెల్ట్ పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం విచిత్రమే. ఏటా వేసవిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. భూపాలపల్లి, గణపురం, రేగొండ, శాయంపేట, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా పరకాల అగ్నిమాపక కేంద్రాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఫైరింజన్ వచ్చేలోగా ఆస్తులు బుగ్గిపాలవుతున్నారుు. 2010లో భూపాలపల్లి మండలం జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి విద్యార్థుల సర్టిఫికెట్లు, విలువైన కాగితాలు కాలిబూడిదయ్యాయి. 2011లో రాంపూర్ వద్ద దేవాదుల ఎత్తిపోతల పథకానికి చెందిన నాలుగు మోటార్లు కాలిపోగా రూ. కోట్లలో నష్టం వాటిల్లింది. ఇలా ఏటా జరుగుతున్నా ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒకేసారి రెండు ప్రమాదాలు జరిగితే.. పోచమ్మమైదాన్: వరంగల్ ట్రైసిటీలోని లక్షల జనాభాకు తగినట్లుగా వ్యాపారాలు విస్తరిస్తున్నారుు. కానీ, ఏదైనా ఉపద్రవం సంభవిస్తే దాన్ని అరికట్టడం మాట అటుంచి నష్టనివారణ చర్యలకూ సిబ్బంది సరిపడా లేరు. ట్రైసిటీ మొత్తంగా వరంగల్ మట్టెవాడ, హన్మకొండ బాలసముద్రంలో ఫైర్ స్టేషన్లు మాత్రమే ఉన్నారుు. మట్టెవాడలో మూడు అగ్నిమాపక నిరోధక వాహనాలు ఉండగా ఇందులో ఒకటి మూలన పడింది. ఇక్కడ 21మందికి గాను ఆరుగురు సిబ్బందే ఉన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని ఫైర్ స్టేషన్లో ఒకటి పెద్దది, ఇంకోటి చిన్న వాహనం ఉంది. ఇక్కడ పది మందికి ఏడుగురు సిబ్బందే విధుల్లో ఉన్నారు. నగరంలో రెండు చోట్ల ఒకేసారి ప్రమాదాలు జరిగితే మాత్రం సేవలందించడం కష్టతరమవుతోంది. అగ్నిమాపక కేంద్రాల సంఖ్య పెంచడంతో పాటు సరిపడా వాహనాలు కేటారుుంచాలని ప్రజలు కోరుతున్నారు. పోస్టులు భర్తీ చేసి తమపైభారం తగ్గించాలని సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో అధికారులు తక్షణం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
సీసీబీలో సిబ్బంది కొరత
నత్తనడకన కేసుల దర్యాప్తు బెంగళూరు : అసాంఘిక శక్తుల ఆట కట్టించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న సెంట్రల్ క్రైం బ్రాంచ్(సీసీబీ)ని సిబ్బంది కొరత వెన్నాడుతోంది. దీంతో నత్తనడకన కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఫలితంగా అసాంఘిక శక్తులకు శిక్ష వేయించడం తలకు మించిన భారమవుతోంది. 1994లో బెంగళూరులో అప్పటి జనాభా, క్రైం రేట్‌ను అనుసరించి సీసీబీకు ఐదుగురు ఏసీపీలతో సహా 125 పోస్టులను కేటాయించారు. ఈ పాతికేళ్లలో నగర జనాభాతో పాటు క్రైం రేటు ఎన్నో రెట్లు పెరిగింది. అయినా సీసీబీలో పనిచేస్తున్న వారి సంఖ్య మాత్రం పెరగలేదు. ఇందులోనూ ప్రస్తుతం 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 85 పోస్టుల్లో డ్రైవర్లు, అటెండర్లు తదితర కిందిస్థాయి ఉద్యోగులు 25 మంది వరకు ఉన్నారు. ఈ లెక్కన సీసీబీలో 60 మంది మాత్రమే కేసుల దర్యాప్తులో పాల్గొంటున్నట్లు స్పష్టమవుతోంది. సిబ్బంది కొరత వల్ల ఐఎస్ఐఎస్ మద్దతుదారు మెహ్దీ, చర్చ్‌స్ట్రీట్ బాంబ్‌బ్లాస్ట్ వంటి దాదాపు 125 కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోందని హోంశాఖ అధికారులే పేర్కొంటున్నారు. సైకిల్ దొంగలను పట్టుకోవడం కోసం... 1970లో బెంగళూరులో సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండేవి. దీంతో సైకిల్ దొంగలను పట్టుకోవడం కోసం 16.7.1971నుంచి అధికారికంగా సీసీబీను ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో ప్రస్తుతం మహిళల రవాణా, మాదకద్రవ్యాల మారక నిరోధక దళం, ఆర్గనైజ్డ్ క్రైమ్ వింగ్‌తో సహా ఐదు విభాగాలు సీసీబీలో ఏర్పాటయ్యాయి. ప్రతి విభాగానికి అదనపు కమిషనర్ స్థాయి అధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. కాగా, ప్రస్తుతం మూడు అదనపు కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో మిగిలిన ఇద్దరు ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తూ సీసీబీను నడిపిస్తున్నారు. -
ఆ‘పరేషాన్!’
ఉస్మానియా ఆపరేషన్ గదులకు తాళం చికిత్సలకు అంతరాయం ఆందోళనలో రోగులు... పట్టించుకోని అధికారులు సిటీబ్యూరో: ప్రతిష్ఠాత్మక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది స్టాఫ్ నర్సులు, వార్డు బాయ్స్ లేకపోవడంతో ఓపీ గదులే కాదు... ఆపరేషన్ థియేటర్లు సైతం మూతపడుతున్నాయి. వైద్యులు లేకపోవడంతో న్యూరోఫిజీషియన్ ఓపీ గదికి ఇప్పటికే తాళాలు పడ్డాయి. నర్సులు, వార్డు బాయ్స్ లేమితో తాజాగా జనరల్ సర్జరీ విభాగంలోని ఆపరేషన్ థియేటర్-3 గదికి తాళాలు పడ్డాయి. దీంతో ఆ విభాగంలో శస్త్రచికిత్సలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడి రోగుల అవసరాలు పూర్తిగా తీర్చాలంటే కనీసం 835 మంది స్టాఫ్ నర్సులు ఉండాలి. ప్రస్తుతం 309 మంది మాత్రమే ఉన్నారు. వైద్యులు లేక కొన్ని విభాగాలు... వైద్య పరికరాలు, స్టాఫ్ నర్సులు లేక మరికొన్ని విభాగాలు మూత పడుతున్నాయి. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పేరుకే బయోమెట్రిక్ హాజరు సుమారు 1100 పడకల సామర్థ్యం ఉన్న ఉస్మానియా ఆస్పత్రి ఓపీకి నిత్యం 1400 నుంచి 1600 మంది రోగులు వస్తుంటారు. ఇక్క డ నిత్యం 1200 మంది చికిత్స పొందుతుంటారు. 12 ఆపరేషన్ థియేటర్లు ఉండగా... వీటిలో ఇప్పటికే రెండు మూతపడ్డాయి. ఆరు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఉన్న వాటిలో చిన్నాపెద్ద కలిపి నిత్యం సుమారు 150 సర్జరీలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 22 విభాగాలుంటే, 200పైగా వైద్యులు పని చేస్తున్నారు. వీరిలో సగం మంది అసలు ఆస్పత్రికే రావడం లేదు. ఒక వేళ వచ్చినా...ఓపీకి వెళ్లకుండా గదులకే పరిమితమవుతున్నారు. కొంతమంది దంపతులూ ఇక్కడ వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఆస్పత్రికి వచ్చి ఇద్దరి సంతకాలు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను అమలు చేశారు. దీన్ని ఉపయోగించేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. స్టాఫ్‌నర్సుల కొరత వల్ల రోగి బంధువులే సంరక్షకులుగా మారుతున్నారు. వార్డులకు తరలించడం మొదలు సెలైన్లు ఎక్కించడం, ఇంజక్షన్లు ఇవ్వడం వంటి కీలక పనులన్నీ వారే చేయాల్సి వస్తోంది. ఎంఆర్డీ సెక్షన్లో సిబ్బంది కొరత వల్ల మెడికో లీగల్ కేసుల రికార్డులను పోలీసులే వెతుక్కోవాల్సి వస్తోంది. మరోవైపు కీలకమైన రికార్డులు మాయమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మొరాయిస్తున్న యంత్రాలు రేడియాలజీ విభాగంలో పది ఎక్సరే యంత్రాలు ఉండగా.. వీటిలో ఇప్పటికే సగం మూలకు చేరాయి. సిటీస్కాన్ గడువు ముగియడంతో మిషన్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. సాధారణ రోగులు ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోవాలంటే కనీసం నెల రోజుల ముందు పేరు నమోదు చేసుకోవాల్సి వస్తోంది. రోగుల కోసం కేటాయించిన పేయింగ్ రూమ్‌ల్లో పరిపాలనాపరమైన పనులు నిర్వహిస్తున్నారు. రోగులను ఆఫరేషన్ థియేటర్లకు తరలించే లిఫ్ట్‌లు పని చేయకపోవ డంతో ఇటీవల ఏకంగా సర్జరీలనే వాయిదా వేయాల్సి వచ్చింది. -
వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రజారోగ్య శాఖలో పనిమంతులు కరువయ్యారు. కుర్చీలో కూర్చొని సేవలందించే అధికారులు మినహాయిస్తే.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనావేసి జాగ్రత్త చర్యలపై నివేదికలిచ్చే కీలకమైన సిబ్బంది మాత్రం ఆ శాఖలో అందుబాటులో లేరు. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సేవలు ఆస్పత్రులకే పరిమితమవుతున్నాయి. ఏళ్ళుగా ఈ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో గ్రామాల్లో రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. జిల్లాలో 50 ప్రభుత్వ ఆస్పత్రులున్నాయి. వీటిలో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు పీపీ యూనిట్లు ప్రజలకు వైద్యసేవలందిస్తున్నాయి. ఇవిగాకుండా మూడువందల ఉపకేంద్రాల ద్వారా గ్రామాల్లో అత్యవసర సేవలందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే డాక్టర్ పోస్టులు 17, సివిల్ సర్జన్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటి భర్తీ చేసే అంశం ప్రభుత్వ పరిధిలో ఉండగా.. క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసే ఆరోగ్య కార్యకర్త, ఏఎన్ఎం పోస్టుల భర్తీ జిల్లా యంత్రాంగం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 122 ఆరోగ్య కార్యకర్త(పురుషులు)లకు గాను కేవలం 27 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అదేవిధంగా మహిళల కేటగిరీలో 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్ళుగా ఈ పోస్టులు భర్తీ చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో వైద్య,ఆరోగ్య శాఖ సేవలు కుంటుపడుతున్నాయి. వారే కీలకం.. గ్రామాల్లో అపారిశుద్ధ్యం , తద్వారా వచ్చే వ్యాధులకు సంబంధించిన అంశంలో ఆరోగ్య కార్యకర్త(పురుషులు)ల పాత్ర కీలకం. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు రోగాల తీవ్రత ఎక్కువగా ఉంటే రాత్రింబవళ్లు పూర్తిస్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వీరిదే. అదేవిధంగా ఉన్నతాధికారుల పర్యటనలు, గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులపై నివేదికలు తయారు చేయడంలో ప్రధాన భూమిక వీరిదే. ఇంతటి కీలక బాధ్యతలున్న ఈ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా గ్రామాల్లో పారిశుద్ధ్యానికి సంబంధించిన నిధుల వినియోగం గందరగోళంగా తయారైంది. మరోవైపు క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేయలేక పోవడం ఆస్పత్రులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగజారుతున్న ‘ర్యాంకు’ వైద్యుల ఖాళీలు, సిబ్బంది కొరతతో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు క్రమంగా దిగజారుతోంది. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై ఇటీవల అధికారులు సర్వే నిర్వహించగా పలు వాస్తవాలు వెలుగుచూశాయి. ఆస్పత్రులను పరిశీలిస్తే.. జిల్లాలో ఒక్క ఆస్పత్రి కూడా కేటగిరీ ‘ఏ’లోకి రాకపోవడం గమనార్హం. ‘బీ’ కేటగిరీలో 6 ఆస్పత్రులుండగా, ‘సీ’ కేటగిరీలో 12, ‘డీ’ కేటగిరీలో 32 ఆస్పత్రులున్నాయి. అత్యధికంగా డీ కేటగిరీలో ఆస్పత్రులు నమోదు కావడంపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు గైర్హాజరీ, విధి నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి కనబర్చడంతోనే ఆస్పత్రుల స్థాయి పడిపోయిందంటూ ఇటీవల జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ సమీక్షలో కలెక్టర్ ఎన్.శ్రీధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినసంగతి తెలిసిందే. -
పంచాయతీ బకాయిలు రూ.72 కోట్లు
- వేధిస్తున్న సిబ్బంది కొరత - అదనపు బాధ్యతలతో సతమతం - గ్రామాల్లో కుంటుపడుతున్న అభివృద్ధి హన్మకొండ అర్బన్ : గ్రామ పంచాయతీల్లో వసూలు చేయాల్సిన పన్నుల బకాయిలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. పన్నులు, పన్నేతర బకాయిలు మే చివరినాటికి జిల్లా మొత్తం గా రూ.72కోట్లు ఉన్నాయి. దీంతో పన్నుల వసూలుకు అధికారులు అదను చూసి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలనే యోచనలో ఉన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పంచాయతీలకు వచ్చే ఆదాయం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. ఇందులో ఇంటిపన్నులు, నల్లా పన్నులు. రెండవది పన్నేతర ఆదాయం. ఇందులో సంతలు, ఆంగళ్లు, రహదారి శిస్తు, వేలంపాటలు, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం ఉంటుంది. జిల్లాలో కొద్ది సంవత్సరాలుగా పంచాయతీ సిబంది పన్నులు వసూలు చేయడం పూర్తిగా మర్చిపోయారు. దీంతో ఇంటి పన్నులు, నల్లా పన్నులు కలిపి రూ.45కోట్లకు పైగా, పన్నేతర బకాయిలు రూ.26కోట్లకు పైగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించడంతో పంచాయతీ పాలనకు ప్రాధాన్యం పెరిగింది. దీనికి తోడు పంచాయతీల ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని ముఖ్యం గా పన్నులు వసూళ్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని స్వయంగా ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో చెప్పడంతో పన్నుల వసూళ్ల విషయంలో అధికారులు కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉంది. సిబ్బంది కొరతతో ఇబ్బందులు జిల్లాలో 962 పంచాయతీలు ఉండగా కార్యదర్శులు మాత్రం 342 మంది మాత్రమే ఉన్నారు. సగటున ఒక్కో కార్యదర్శికి మూడు పంచాయతీల బాధ్యతలున్నాయి. దీనికి తోడు రెండేళ్లుగా సర్పంచ్‌లు లేక ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగాయి. అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఖర్చు చేశారే తప్ప పన్నుల వసూళ్లపై పెద్దగా దృష్టి పెట్టలేదు. వెరసి బకాయిలు తడిసి మోపెడయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 98 మంది కార్యదర్శులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంతవరకు అదనపు బాధ్యల నుంచి వారికి విముక్తి కలిగి పన్నుల వసూళ్లపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇబ్బందే... ప్రస్తుతం ‘మన గ్రామం-మన ప్రణాళిక’ క్యాక్రమంలో చేసే ప్రతి ప్రణాళిక గ్రామ ఆదాయాన్ని బట్టే చేయాలి. అయితే పేరుకు పోయిన బకాయిలు నూరుశాతం వసూలవుతాయని ఊహించి ప్రణాళికలు సిద్ధం చేయడంటే ఇబ్బందికరమే. ఎందుకంటే ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం పంచాయతీ సిబ్బందికి కత్తిమీద సాములాంటిదే. -
మురికిపాల్టీలు..!
విజయనగరం మున్సిపాల్టీ/ బొబ్బిలి, న్యూస్‌లైన్ : మున్సిపాల్టీలు.. మురికిపాల్టీలుగా మారుతున్నాయి. సిబ్బంది కొరత, కొరవడిన చిత్తశుద్ధి, ప్రత్యేక అధికారుల పాలన.. జవాబుదారీతనం లోపించడం వెరసి పట్టణ ప్రజలను పారిశుద్ధ్య సమస్యలు వెంటాడుతున్నా యి. జిల్లాలో విజయనగరం, పార్వతీపురం, సాలూరు, బొబ్బి లి మున్సిపాల్టీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీ ఉంది. ప్రతి మున్సిపాల్టీలో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. మున్సిపాల్టీల్లో మురికివాడల సర్వేలతో కాలం గడుపుతున్నా రు కాని సమస్యలు పరిష్కరించడం లేదు. మూడేళ్లుగా పాలనా వ్యవహారాలు చూసే పాలక వర్గం లేకపోవడంతో పర్యవేక్షణ కరువైంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని నియమించకపోవ డం వల్ల సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. పదేళ్లక్రితం నాటి ఉన్న సిబ్బంది, వాహనాలు ఉండడం వల్ల.. మంచినీటి ట్యాంకులు లేకపోవడం వెరసి ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ఉన్న సిబ్బందిని తొలగిస్తున్న తరుణంలో పట్టణాల్లో ప్రజారోగ్యం కుంటుపడుతోంది. పట్టణాల్లో ఏ వార్డు చూసినా చెత్తచెదారాలతోనే దర్శనమిస్తున్నాయి. నెల్లిమర్లలో రోజూ 5 టన్నుల చెత్తను సేకరిస్తారు. చెత్తను వేసేందుకు డంపింగ్ యార్డు లేదు. దీని కోసం ప్రతిపాదనలు పంపించారు. విజయనగరం మున్సిపాల్టీ.. విజయనగరం పట్టణంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 1,74,651 మంది జనాభా ఉండగా, 2011 లెక్కల ప్రకారం 2,27,533 మంది జనాభా ఉన్నారు. వీరే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగాల నిమిత్తం వచ్చి అద్దె ఇళ్లలో చాలా మంది నివాసం ఉంటున్నారు. పట్టణంలో 58,107 ఇళ్లు ఉన్నాయి. మొత్తం 38 వార్డులు ఉండగా వీటితోపాటు నాలుగు విలీన పంచాయతీలు ఉన్నాయి. మున్సిపాల్టీలో ప్రజారోగ్యాన్ని కాపాడే ఎంహెచ్ఓ పోస్టు ఖాళీగా ఉంది. పట్టణమంతా పర్యవేక్షణ చేయవలసిన అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. నలుగురు శానిటరీ ఇన్స్పెక్టర్లకు గాను రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెల్త్ అసిస్టెంట్లు ఐదు పోస్టులకు నాలుగు, పీహెచ్ఎంలు ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు రెగ్యులర్ 261 మంది ఉండగా 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపాలిటీలో రోజూ సేకరించే 117 టన్నుల చెత్తను తరలించడానికి టిప్పర్లు 6, ఆటోలు 10, ట్రాక్టర్స్ 17, డుంపెర్ ప్లాసర్ 1, జేసీబీ 1, టారస్ 1, ఆటో మౌంటెడ్ పాగింగ్ మిషన్ 1, సెప్టిక్ క్లినర్ 1 ఉన్నాయి. బొబ్బిలి... బొబ్బిలిలో 57 వేల మంది జనాభా ఉన్నారు. 14,437 ఇళ్లు, 1072 దుకాణాలున్నాయి. మున్సిపాలీటీలో రోజుకు 17.5 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. దీనిలో దాదాపు టన్ను పొడి చెత్త, దాదాపు రెండున్నర టన్నుల తడి చెత్తను చెత్తశుద్ధి పార్కుకు తరలిస్తున్నారు. పార్కు రాక ముందు మూడేళ్ల కిందట మార్కెట్ కమిటీ వెనుకను మున్సిపాలిటీకి చెందిన డంపింగ్ యార్డులో చెత్తను పోసేవారు. పక్క నుంచి వెళ్లే కృష్ణాపురం గ్రామస్తులు, సమీపంలో ఉండే పాఠశాల విద్యార్థులు, అతి సమీపంలో ఉండే దేవాలయానికి వచ్చిన భక్తులు ముక్కులు దుర్గంధం భరించలేకపోతున్నారు. 2011 జూలైలో రామందోరవలస వద్ద చెత్తశుద్ధి పార్కును పెట్టినా ఈ చెత్త సమస్య మాత్రం తీరలేదు. ఆ పార్కుకు వినియోగానికి పనికి వచ్చిన చెత్తను మాత్రమే తరలిస్తుండడంతో మిగతా పనికి రానిదంతా ఇలా పాత డంపింగ్ యార్డులోనే ఉంచేస్తున్నారు. అది ఇప్పుడు ఎక్కువై పక్కనే ఉన్న బొబ్బిలి-బలిజిపేట రోడ్డు మీదకు వచ్చేయడంతో వాహనదారులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగంలో 54 మంది శాశ్వత కార్మికులు, 105 కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. నాలుగు ట్రాక్టర్లు, నాలుగు ఆటోలు, రెండు ట్రిప్పర్లను చెత్తను తరలించేందుకు వినియోగిస్తున్నారు. అయినా మున్సిపాలిటీ ఎప్పుడూ మురిపికూపంగానే దర్శమనిస్తోంది. పార్వతీపురం పార్వతీపురం పురపాలక సంఘంలో కూడా అదే పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో 54 వేల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ రోజుకు 25 టన్నుల చెత్త సేకరణ జరగుతోంది. పది వాహనాలు ఉన్నాయి. వీటిలో ఎనిమిది మాత్రమే పనిచేస్తున్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో 79 మంది, శాశ్వత సిబ్బంది 45 మంది, శానిటరీ సూపర్వైజర్ ఒకరు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఇద్దరు, ఏఎస్ఓ ఒకరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరిపి గ్రామం వద్ద చెత్త శుద్ధి పార్కుకు స్థలం కేటాయించినా ఆ గ్రామస్తులు అడ్డుకోవడం వల్ల జట్టు ఆశ్రమానికి దగ్గరలో రాయగడ రోడ్డులోపాత డంపింగ్ యార్డులోనే చెత్తను ఉంచుతున్నారు. దీనివల్ల కొమరాడ, పార్వతీపురం మండలంలో ఉండే వారంతా రాకపోకలు చేయడానికి ఇబ్బందికి గురవుతున్నారు. సాలూరు సాలూరు పురపాలక సంఘంలో 10 వాహనాల ద్వారా 25 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. మొన్నటి వరకూ వేగావతి నది ఒడ్డే డంపింగ్ యార్డుగా ఉండేది. దీనివల్లతాగునీరు కలుషితం అవ్వడంతో వేగావతిలో ఉన్న ఫిల్టర్ బావుల్లో నీటిని ఉపయోగించిన బొబ్బిలి మండలం, పట్టణ వాసులకు అనేక రోగాలు వచ్చేవి. అయితే అక్కడ చెత్తశుద్ధి పార్కు కట్టిన తరువాత కొంత ఇబ్బందులు తీరాయి. స్లమ్ ప్రాంతాల్లో సమస్యలు.. విజయనగరంలో 72 స్లమ్ ప్రాంతాలు ఉన్నాయి. సాలూరులో 30, పార్వతీపురంలో 30, నెల్లిమర్ల 15 స్లమ్ ప్రాంతాలను మున్సిపల్ అధికారులు గుర్తించారు. స్లమ్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మురికివాడల్లో మంచినీటి, ఇళ్లు, పారిశుధ్య సమస్యలు ఎలాగున్నాయనే విషయాలపై అధికారులు సర్వే చేస్తున్నారు. విజయనగరం సర్వే చివరి దశకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.