కలెక్టరేట్‌లో పడకేసిన పాలన వేధిస్తున్న సిబ్బంది కొరత
భద్రత గాలికి హరిత హారతిపై ఉపన్యాసాలే తప్ప ఆచరణ ఏదీ?
కలెక్టరేట్‌లో పాలన అస్తవ్యస్తంగా మారింది. సిబ్బంది కొరత.. పారిశుద్ధ్య లోపం.. భద్రతలేమి.. వెరసి సాధారణ ప్రజలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు ముప్పుతిప్పలు పడుతున్నారు. వీటిపై ఇటు పాలనా అధికారిగానీ, పాలకులుగానీ దృష్టిసారించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
చిత్తూరు : జిల్లా సచివాలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఉద్యోగుల కొరత కారణంగా కొన్ని శాఖల్లో నెలల తరబడి ఫైళ్లు కదలడంలేదు. సమాచారం కోసం జిల్లా నలుమూలల నుంచి రోజూ వందల సంఖ్యలో సాధారణ ప్రజలు, ఉద్యోగులు కలెక్టరేట్‌కు వస్తుంటారు. వీరికి సమాచారం ఇవ్వడానికి అధికారులు రోజుల తరబడి తిప్పించుకుంటున్నారు. గట్టిగా అడిగితే ఇచ్చేది లేదు.. అని తెగేసి చెబుతున్నారు. తిరిగితిరిగి కాళ్లు అరిగిపోతున్నా కనీస సమాచారం లభించడంలేదని పలువురు వాపోతున్నారు.
110 మంది ఉద్యోగుల్లో 52 పోస్టులు ఖాళీ
సచివాలయంలో సిబ్బంది కొరత.. పాలనాధికారి అలక్ష్యం.. వెరసి ఉన్న ఉద్యోగులపై భారం పడుతోంది. కలెక్టరేట్‌లో మొత్తం 110 మంది ఉద్యోగులకుగాను 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను గత వారం చేపట్టిన బదిలీల్లోనూ భర్తీ చేయలేదు. ఆరు నెలల
ఇదేం పాలన?
క్రితం ఏ1 సెక్షన్‌కు ముగ్గురు డెప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారులను నియమించినా.. వారు ఇంతవరకు విధుల్లో చేరలేదు. రెండేళ్లలో ముగ్గురు తహశీల్దార్లు ఏసీబీ అధికారులకు చిక్కారు.
కలెక్టరేట్ భద్రమేనా?
కలెక్టరేట్‌లో భద్రతను గాలికొదిలేశారు. ఎవరు వస్తున్నారు?.. ఎందుకు వస్తున్నారో కూడా అధికారుల వద్ద సమాచారం ఉండటం లేదు. జిల్లాలో ఉగ్ర వాదుల కదలికలు ఉన్నాయని ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నా కనీసం సెక్యూరిటీ కూడా నియమించలేదు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు కలెక్టరేట్ అడ్డాగా మారుతోంది. భద్రత లేని కారణంగా ద్విచక్రవాహనాల చోరీలు అధికమవుతున్నాయి. వీటిపై పోలీసులు కేసులూ నమోదు చేసుకోవడంలేదు. ఇటీవల జిల్లా కోర్టులో బాంబు పేలుడు సంఘటన జరిగినా వాటి నుంచి పోలీసులుగానీ, జిల్లా సచివాలయం అధికారులు గానీ పాఠాలు నేర్చుకోకపోవడం గమనార్హం. సుమారు ఆరెకరాల విస్తీర్ణంలోని కలెక్టర్‌రేట్ ఆవరణలో కనీసం ఒక్క సీసీ కెమెరా లేదంటే ఇక్కడి భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఏదైనా సంఘటన జరిగితే దానికి బాధ్యులెవరో తెలియని పరిస్థితి.
బాబోయ్ కంపు
కలెక్టరేట్‌లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మరుగుదొడ్ల నుంచి దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకునే నాథుడే లేరు. కలెక్టర్ చాంబర్ పక్కనే ఉన్న మరుగుదొడ్డినీ వారాల తరబడి శుభ్రం చేయడం లేదు. పార్కులో గడ్డి, చెట్లు ఎండిపోతున్నాయి. కలెక్టర్ హరిత హారతి కార్యక్రమంపై ఉపన్యాసాలిస్తున్నారే కానీ ఆయన మాత్రం ఆచరించడం లేదు. వికలాంగుల కోసం కలెక్టరేట్ ఆవరణలో అట్టహాసంగా ప్రారంభించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. ఇప్పటి వరకు వీటిని ఒక్క రోజూ వినియోగించిన దాఖలాలు లేవు.