ఆన్‌లైన్‌లో ఉద్యోగుల సమాచారం | online employes information | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఉద్యోగుల సమాచారం

Published Mon, Dec 23 2013 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

online employes information

కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. అటెండర్ మొదలు ఉన్నత ఉద్యోగి వివరాలను ఇక ఆన్‌లైన్‌లో లభ్యంకానున్నాయి. అంతేకాకుండా అన్నింటికి ఇవే ప్రామాణికంకానున్నాయి. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం(సీఎఫ్‌ఎంఎస్) నిర్వహణలో భాగంగా కలెక్షన్ ఆఫ్ డేటా ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హెచ్‌ఆర్‌ఎంఎస్(మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ), హెల్త్‌కార్డుల జారీకి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
 
 ఈ నెల 24లోగా ఉద్యోగుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వివరాల నమోదు బాధ్యతను ఆయా శాఖల్లో ఉద్యోగుల జీతాల బిల్లులు పెట్టే డ్రాయింగ్ ఆఫీసర్లు చేపట్టాలని ఆదేశించారు. జనవరి 5లోగా నమోదు చేయకుంటే డ్రాయింగ్ ఆఫీసర్ల జీతాలు నిలిపివేయాలని ట్రెజరీకి ఆదేశాలందాయి.
 
 ఈ వివరాలే ప్రామాణికం..
 ఇక నుంచి ఈ వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఉద్యోగి విధుల్లో చేరినప్పటి నుంచి ఉన్న సర్వీసు రిజిస్టర్ మొత్తం అందులో పొందుపరచాలి. కుటుంబ సభ్యులు, చిరునామా, వేతనం తదితర వివరాల నమోదును ట్రెజరీశాఖ పర్యవేక్షిస్తుంది. జిల్లాలో 29 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఇందులో 1900 మంది గెజిటెడ్, 23 వేల మంది నాన్‌గెజిటెడ్, 4100 మంది నాలుగోతరగతి ఉద్యోగులుంటారు. కాంట్రాక్ట్, ఎయిడెడ్ ఉద్యోగులు కలిపి సుమారు నాలుగు వేల మంది ఉంటారు. ఉద్యోగులకు సంబంధించిన వివరాలేవైనా ప్రభుత్వానికి అవసరమైనా ఆన్‌లైన్‌లోనివే తీసుకోనుంది. నగదు రహిత వైద్యం అందించేందుకు ప్రవేశపెట్టిన హెల్త్‌కార్డుల విధానానికి ఉద్యోగి వివరాలతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, ఫొటోలు తదితర వాటిని ఇవ్వాల్సి ఉంటుంది.
 
 ఇవన్నీ ఇచ్చాకే హెల్త్‌కార్డులు మంజూరు చేస్తారు. అయితే మెజార్టీ ఉద్యోగులు హెల్త్‌కార్డులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. ప్రస్తుతం అలాంటి వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదైతే వారికి ఈ ప్రాతిపదికనే కార్డులు మంజూరు చేయనున్నారు. ఈ విషయమై ట్రెజరీ శాఖ డీడీ ఎల్ వెంకన్నగౌడ్ మాట్లాడుతూ ఇప్పటికే డ్రాయింగ్ ఆఫీసర్లకు సూచనలిచ్చామని, ఆన్‌లైన్‌లో ఉద్యోగుల వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement