సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రజారోగ్య శాఖలో పనిమంతులు కరువయ్యారు. కుర్చీలో కూర్చొని సేవలందించే అధికారులు మినహాయిస్తే.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనావేసి జాగ్రత్త చర్యలపై నివేదికలిచ్చే కీలకమైన సిబ్బంది మాత్రం ఆ శాఖలో అందుబాటులో లేరు. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సేవలు ఆస్పత్రులకే పరిమితమవుతున్నాయి. ఏళ్ళుగా ఈ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో గ్రామాల్లో రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
జిల్లాలో 50 ప్రభుత్వ ఆస్పత్రులున్నాయి. వీటిలో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు పీపీ యూనిట్లు ప్రజలకు వైద్యసేవలందిస్తున్నాయి. ఇవిగాకుండా మూడువందల ఉపకేంద్రాల ద్వారా గ్రామాల్లో అత్యవసర సేవలందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే డాక్టర్ పోస్టులు 17, సివిల్ సర్జన్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి.
అయితే వీటి భర్తీ చేసే అంశం ప్రభుత్వ పరిధిలో ఉండగా.. క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసే ఆరోగ్య కార్యకర్త, ఏఎన్‌ఎం పోస్టుల భర్తీ జిల్లా యంత్రాంగం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 122 ఆరోగ్య కార్యకర్త(పురుషులు)లకు గాను కేవలం 27 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అదేవిధంగా మహిళల కేటగిరీలో 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్ళుగా ఈ పోస్టులు భర్తీ చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో వైద్య,ఆరోగ్య శాఖ సేవలు కుంటుపడుతున్నాయి.
వారే కీలకం..
గ్రామాల్లో అపారిశుద్ధ్యం , తద్వారా వచ్చే వ్యాధులకు సంబంధించిన అంశంలో ఆరోగ్య కార్యకర్త(పురుషులు)ల పాత్ర కీలకం. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు రోగాల తీవ్రత ఎక్కువగా ఉంటే రాత్రింబవళ్లు పూర్తిస్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వీరిదే. అదేవిధంగా ఉన్నతాధికారుల పర్యటనలు, గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులపై నివేదికలు తయారు చేయడంలో ప్రధాన భూమిక వీరిదే. ఇంతటి కీలక బాధ్యతలున్న ఈ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా గ్రామాల్లో పారిశుద్ధ్యానికి సంబంధించిన నిధుల వినియోగం గందరగోళంగా తయారైంది. మరోవైపు క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేయలేక పోవడం ఆస్పత్రులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
దిగజారుతున్న ‘ర్యాంకు’
వైద్యుల ఖాళీలు, సిబ్బంది కొరతతో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు క్రమంగా దిగజారుతోంది. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై ఇటీవల అధికారులు సర్వే నిర్వహించగా పలు వాస్తవాలు వెలుగుచూశాయి. ఆస్పత్రులను పరిశీలిస్తే.. జిల్లాలో ఒక్క ఆస్పత్రి కూడా కేటగిరీ ‘ఏ’లోకి రాకపోవడం గమనార్హం. ‘బీ’ కేటగిరీలో 6 ఆస్పత్రులుండగా, ‘సీ’ కేటగిరీలో 12, ‘డీ’ కేటగిరీలో 32 ఆస్పత్రులున్నాయి. అత్యధికంగా డీ కేటగిరీలో ఆస్పత్రులు నమోదు కావడంపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు గైర్హాజరీ, విధి నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి కనబర్చడంతోనే ఆస్పత్రుల స్థాయి పడిపోయిందంటూ ఇటీవల జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ సమీక్షలో కలెక్టర్ ఎన్.శ్రీధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినసంగతి తెలిసిందే.
వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత
Published Fri, Aug 22 2014 11:19 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement