హడలెత్తిస్తున్న చోరులు
రెండో ఠాణాలో సిబ్బంది కొరత
రెండు నెలలుగా ఎస్సై పోస్టు ఖాళీ
బెంబేలెత్తుతున్న స్థానికులు
నిజామాబాద్ క్రైం: నగరంలోని రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల చోరీలు ఎక్కువయ్యాయి. ఇంటికి తాళం వేస్తే ఇక అంతే సంగతులని, ఇళ్ల ముందు బైక్ పార్క్ చేయాలన్నా ధైర్యం చాలడం లేదని స్థానికులు వాపోతున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఎస్సై పోస్టు రెండు నెలలుగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం స్టేషన్‌కు ఇన్‌చార్జిగా ర్యాంకర్ ఎస్సై ఉన్నారు. గతంలో పనిచేసిన ఎస్సై బోస్‌కిరణ్‌కు పదోన్నతిపై వెళ్లినప్పటి నుంచి ఎస్సై పోస్టు ఖాళీగా ఉంది. దీనికి తోడు సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో పెట్రోలింగ్ నామమాత్రంగా కొనసాగుతోంది. మొత్తం 30 కానిస్టేబుల్ పోస్టులుండగా, ప్రస్తుతం 26 మంది పనిచేస్తున్నారు. వీరిలో ముగ్గురు డీఎస్పీ కార్యాలయానికి, మరో ముగ్గురు సీఐ కార్యాలయానికి అటాచ్‌గా పనిచేస్తున్నారు.
ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లుగా, ఇద్దరు కోర్టు విధులను నిర్వర్తిస్తున్నారు. మొత్తం మీద 14 మంది కానిస్టేబుళ్లు మాత్రమే క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో పగలు కొంతమంది, రాత్రివేళలో కొంతమంది విధులకు హాజరవుతున్నారు. ఆరుగురు హోంగార్డులుండగా ఇద్దరు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. స్టేషన్ పరిధిలో హైమదీపురకాలనీ, బర్కత్‌పుర, గాజుల్‌పేట్, బ్రహ్మపురి, శివాజీనగర్, బోయిగల్లి, బురుడుగల్లి, అజాంరోడ్డు, అశోక్‌వీధి, దోబీగల్లీ, దారుగల్లీ, కోటగల్లీ, ఠాణాగల్లీ, కసాబ్‌గల్లీ, గోల్‌హన్మన్ చౌరస్తా ప్రాంతం, బొబ్బిలివీధి, హతాయిగల్లి, హైమదీబజార్, లైన్‌గల్లీ, వర్నిచౌరస్తా, ఆర్‌ఆర్ చౌరస్తా, ఉప్పర్ టేక్డీ, నర్సాగౌడ్‌వీధి, ఖిల్లారోడ్డు చౌరస్తా, ఐటీఐ కాలనీ, బడాబజార్ ప్రాంతాలున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో ఒక్క వారంలోనే నాలుగు చోరీలు జరిగాయి.