సీసీబీలో సిబ్బంది కొరత
నత్తనడకన కేసుల దర్యాప్తు
బెంగళూరు : అసాంఘిక శక్తుల ఆట కట్టించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న సెంట్రల్ క్రైం బ్రాంచ్(సీసీబీ)ని సిబ్బంది కొరత వెన్నాడుతోంది. దీంతో నత్తనడకన కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఫలితంగా అసాంఘిక శక్తులకు శిక్ష వేయించడం తలకు మించిన భారమవుతోంది. 1994లో బెంగళూరులో అప్పటి జనాభా, క్రైం రేట్‌ను అనుసరించి సీసీబీకు ఐదుగురు ఏసీపీలతో సహా 125 పోస్టులను కేటాయించారు. ఈ పాతికేళ్లలో నగర జనాభాతో పాటు క్రైం రేటు ఎన్నో రెట్లు పెరిగింది. అయినా సీసీబీలో పనిచేస్తున్న వారి సంఖ్య మాత్రం పెరగలేదు. ఇందులోనూ ప్రస్తుతం 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 85 పోస్టుల్లో డ్రైవర్లు, అటెండర్లు తదితర కిందిస్థాయి ఉద్యోగులు 25 మంది వరకు ఉన్నారు. ఈ లెక్కన సీసీబీలో 60 మంది మాత్రమే కేసుల దర్యాప్తులో పాల్గొంటున్నట్లు స్పష్టమవుతోంది. సిబ్బంది కొరత వల్ల ఐఎస్‌ఐఎస్ మద్దతుదారు మెహ్దీ, చర్చ్‌స్ట్రీట్ బాంబ్‌బ్లాస్ట్ వంటి దాదాపు 125 కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోందని హోంశాఖ అధికారులే పేర్కొంటున్నారు.
సైకిల్ దొంగలను పట్టుకోవడం కోసం...
1970లో బెంగళూరులో సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండేవి. దీంతో సైకిల్ దొంగలను పట్టుకోవడం కోసం 16.7.1971నుంచి అధికారికంగా సీసీబీను ఏర్పాటు చేశారు.
కాలానుగుణంగా వచ్చిన మార్పులతో ప్రస్తుతం మహిళల రవాణా, మాదకద్రవ్యాల మారక నిరోధక దళం, ఆర్గనైజ్డ్ క్రైమ్ వింగ్‌తో సహా ఐదు విభాగాలు సీసీబీలో ఏర్పాటయ్యాయి. ప్రతి విభాగానికి అదనపు కమిషనర్ స్థాయి అధికారి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, ప్రస్తుతం మూడు అదనపు కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో మిగిలిన ఇద్దరు ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తూ సీసీబీను నడిపిస్తున్నారు.