బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కాం కేసులో సీఎం సిద్దరామయ్య విచారణను ఎదుర్కొనున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణను అనుమతిస్తూ గతంలో మంజూరు చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయించింది.
కుంభకోణం కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. సీఎంపై సీబీఐ విచారణను నిరోధించడానికే కాంగ్రెస్ సర్కార్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే సీబీఐ పక్షపాతంగా వ్యవహరించడం వల్లే ఈ నిర్ణయం తీసుకునన్నట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. సీఎం సిద్దరామయ్య ఎదుర్కొంటున్న భూ కుంభకోణం ఆరోపణలకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘కేంద్ర దర్యాప్తు సంస్థ దుర్వినియోగానికి గురవుతోంది. పక్షపాతంతో వ్యవహరిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని తెలిపారు.
కాగా ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని బుధవారం హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. గవర్నర్ చర్యలుచట్ట ప్రకారం ఉన్నాయని తెలిపింది. కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశించింది.
అనంతరం ఈ కుంభకోణంలో సిద్ధరామయ్యపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఆయనపై సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 24 లోగా విచారణ నివేదికను కోర్టుకు అందజేయాలని పోలీసులకు సూచించింది.
ఇదిలా ఉండగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం.. రాష్ట్రంలో నేర పరిశోధనలను స్వేచ్ఛగా నిర్వహించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు(సీబీఐ) ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment