
బెంగళూరు/న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు.. సోమవారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేశాయి. డీకేఎస్ వ్యాఖ్యలతో రాజ్యాంగాన్నే మార్చేయాలన్న కాంగ్రెస్ మనస్తత్వం బయటపడిందని బీజేపీ విమర్శించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి కౌంటరే ఇచ్చింది. ఈ క్రమంలో రాజ్యసభ 2గం.దాకా కార్యకలాపాలకు దూరంగా ఉండగా, లోక్‌సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది.
కర్ణాటక ప్రభుత్వం మైనారిటీ కోటా కింద కాంట్రాక్టులలో నాలుగు శాతం ముస్లింలకు కేటాయించడంపై బీజేపీ, కాంగ్రెస్‌లు విమర్శలతో పార్లమెంట్‌ను వేడెక్కించాయి. ప్రత్యేకించి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇది రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు జేపీ నడ్డా అన్నారు. ‘‘మతం పేరుతో రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతించలేదు. మైనార్టీలను కాంగ్రెస్ మభ్యపెడుతోంది. ఇలాంటి చట్టాలను(కర్ణాటక తెచ్చిన చట్టం గురించి ప్రస్తావిస్తూ..), విధానాలను ఉపసంహరించుకోవాలి. బీఆర్ అంబేద్కర్ మార్గదర్శకత్వంలో రూపొందించిన రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరు’’ అని నడ్డా అన్నారు.
అయితే.. నడ్డా వ్యాఖ్యలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని మారుస్తానని డీకే శివకుమార్ అనలేదని.. ఆ మాటకి వస్తే బీజేపీ నేతలే రాజ్యాంగంపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతేకాదు.. గతంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ భారత రాజ్యాంగాన్ని మారుస్తానని బహిరంగంగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.
ఈ అంశం ఇటు లోక్‌సభలోనూ దుమారం రేపగా.. సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజ్జు డీకేఎస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ ఎంపీలు కౌంటర్‌లతో సభ హీటెక్కింది.
మతపరమైన రిజర్వేషన్లు.. ప్రత్యేకించి ముస్లింల కోసం రాజ్యాంగానికి కొన్ని మార్పులు అవసరం అని శివకుమార్ అన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాను అనలేదని తాజాగా నడ్డా విమర్శల నేపథ్యంలో శివకుమార్ స్పందించారు. బీజేపీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. నేను JP నడ్డా కంటే ఎక్కువ సెన్సిబుల్, సీనియర్ పొలిటీషియన్ అని అన్నారు. నేను గత 36 ఏళ్లుగా అసెంబ్లీలో ఉన్నాను. నాకు ప్రాథమిక ఇంగితజ్ఞానం ఉంది. వివిధ నిర్ణయాల (కోర్టు ద్వారా) తర్వాత మార్పులు ఉంటాయని క్యాజువల్‌గా చెప్పాను. రాజ్యాంగాన్ని మార్చబోతున్నామని నేను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. మాది జాతీయ పార్టీ. మా పార్టీ ఈ దేశానికి రాజ్యాంగాన్ని తీసుకువచ్చింది అని అన్నారాయన.