
బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి తొలగిస్తున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూడా హింట్ ఇస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ త్వరలోనే సీఎంగా బాధ్యతలు చేపడతారని చెప్పుకొచ్చారు. దీంతో, కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఇక, వీరప్ప మొయిలీ వ్యాఖ్యలపై తాజాగా సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘నేను మరోసారి చెబుతున్నాను. సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. మొయిలీ లేదా మరొకరు ఏం మాట్లాడారనేది ఇక్కడ ముఖ్యం కాదు. హైకమాండ్ నిర్ణయమే అంతిమం’అని సిద్ధరామయ్య సోమవారం అన్నారు. సీఎం మారతారని కాంగ్రెస్ నాయకులు బాహటంగా చర్చిస్తున్న విషయాన్ని సిద్ధూ దృష్టికి తేగా.. ‘నేను హైకమాండ్ అదేశాల మేరకే నడుచుకుంటాను’ అని ఆయన బదులిచ్చారు.