హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ‘సమోసా’ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఐడీ కార్యాలయంలో సీఎం సుఖ్వీందర్ సింగ్ హాజరైన ఓ కార్యక్రమంలో ఆయనకు ఇవ్వాల్సిన సమోసాలు మాయం అయినట్లువార్తలు రావడంతో..ఈ అంశంపై వివాదం చెలరేగింది.. దీనిపై సీఐడీ దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు ఆరోపణలు రావడంతో.. తాజాగా దర్యాప్తు సంస్థ స్పందించింది. తాము ఎలాంటి విచారణ చేపట్టలేదని స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 21న ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమం కోసం ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారని, అయితే వాటిని సెక్యూరిటీ స్టాఫ్ తినేశారని వార్తలు వచ్చాయి. సీఎం వద్దకు చేరాల్సిన అవి ఎవరి వల్ల మధ్యలో మిస్ అయ్యాయే గుర్తించేందుకు సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.
ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ సీఐడీ డైరెక్టర్ జనరల్ సంజీవ్ రంజన్ ఓజా మాట్లాడుతూ.. సమోసాలు కనిపించకుండా పోవడంపై ఎలాంటి దర్యాప్తు జరపడం లేదని తెలిపారు. ఇది అంతర్గత విషయమని చెప్పారు. అయితే అధికారుల సమావేశానికి ఆర్డర్ చేసిన స్నాక్స్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంపై ఆశ్చర్యం వేయడం చాలా సాధారణమైన విషయమని అన్నారు.దీనిపై విచారణ ఏం లేదని, కేవలం బాక్సుల గురించి తెలుసుకోవడానికి ఒక విజ్ఞప్తి మాత్రమే జరిగిందని చెప్పారు.
మరోవైపు ప్రతిపక్ష బీజేపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిందిు. ఇదంతా హాస్యాస్పదమైన వ్యవహారమని, సమోసాలను ఎవరు తింటే ఏమవుతుందని ప్రశ్నించింది. ‘సీఎం తినాల్సిన సమోసాలను తీసుకెళ్లిందెవరు..? సీఐడీ తేల్చనుంది..’’ అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతుండటంతో సీఎం కార్యాలయం కూడా స్పందించింది. ప్రభుత్వం అటువంటి విచారణకు ఆదేశించలేదని, ఈ విషయంతో సంబంధం లేదని చీఫ్ మీడియా అడ్వైజర్ నరేష్ చౌహాన్ వెల్లడించారు. ఇది సీఐడీ అంతర్గత వ్యవహారమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment