మూగరోదన
♦ పశువైద్యం... దైన్యం మూగజీవాలకు దేవుడే దిక్కు
♦ సిబ్బంది కొరతతో కునారిల్లుతున్న కేంద్రాలు
♦ చాలాచోట్ల అటెండర్లే దిక్కు ఇప్పటికే చాలా కేంద్రాల మూత
♦ కబేళా బాట పట్టిన పశువులు
పశువులది మూగరోదనే... సిబ్బంది కొరతతో వైద్యం అందని పరిస్థితి. పశు వైద్య కేంద్రాలు చాలావరకు మూతపడ్డాయి. అక్కడక్కడా ఉన్న కేంద్రాల్లో అటెండర్లే వైద్యమందిస్తున్నారు. మూగజీవాలు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి. దాణా లేక బక్కచిక్కి కబేళా బాటపడుతున్నాయి. రెండేళ్లుగా వరుస కరువుతో చితికిపోయిన రైతు ప్రత్యామ్నాయంగా పాడి మీదే ఆధారపడ్డాడు. పాడికి ఆయువుపట్టు అయిన పశువైద్యం లేక ఈ పరిశ్రమ కూడా చతికిలపడింది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మిల్క్‌గ్రిడ్’ కూడా డీలా పడింది. ఫలితంగా మూగజీవాలకు దేవుడే దిక్కయ్యాడు. - గజ్వేల్
గజ్వేల్ : జిల్లాలో దశాబ్దాలుగా వ్యవసాయూనికి అనుబంధంగా పాడి పరిశ్రవును అభివృద్ధి చేసుకుంటూ రైతులు జీవనాన్ని సాగిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 8.5 లక్షల ఆవుజాతి, గేదె జాతి పశువులు, 16 లక్షల గొర్రెలు, మేకలు, మరో కోటికిపైగా వాణిజ్య కోడిపిల్లల పెంపకం సాగుతోంది. కరువు కారణంగా పంటలు చేతికందక రైతులు అల్లాడుతున్నారు. ఈ దశలో పాడి పరిశ్రమ ప్రత్యామ్నాయ ఉపాధిగా ఎంచుకున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలు కొరవడటం వారికి శాపంగా మారింది. మిల్క్‌గ్రిడ్‌తోపాటు ఇతర పథకాల అవులుకు పశువైద్య కేంద్రాల్లో నెలకొన్న సవుస్యలు అవరోధంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సిబ్బంది కొరత...
జిల్లాలో మొత్తం 106 పశువైద్యాధికారుల పోస్టులకు గాను ప్రస్తుతం 47మంది మాత్రమే పనిచేస్తున్నారు. 136మంది డిప్లొమా హోల్డర్స్‌గాను 90మంది, 236 మంది నాల్గో తరగతి ఉద్యోగులకు 186మంది మాత్రమే పనిచేస్తున్నారు.
గజ్వేల్‌లోనే ఇలా...
జిల్లాను డెయిరీ హబ్ తీర్చిదిద్దడానికి ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో తొలిదశలో ఈ పథకానికి 2014 డిసెంబర్‌లో అంకురార్పణ చేశారు. ఈ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మొత్తం 12మంది వైద్యాధికారులు పోస్టులకుగాను ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30మంది డిప్లొమా హోల్డర్స్‌గాను 18పోస్టులు ఖాళీగా, 20 మంది నాల్గోతరగతి ఉద్యోగులకు గాను 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదిలావుంటే గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లితోపాటు మరికొన్ని కేంద్రాలు మూతపడ్డాయి. నియోజకవర్గంలోని చాలా కేంద్రాలు అటెండర్ల ఆధారంగానే నడుస్తున్నాయి.
ఏటా రూ.1.40కోట్ల మందులు మాత్రమే పంపిణీ
జిల్లాలో ప్రస్తుతం సిబ్బంది ఉన్న పశువైద్య కేంద్రాల్లో గురక వ్యాధికి హెచ్‌ఎస్ వ్యాక్సిన్, జబ్బవాపు టీకా, గాలికుంటు టీకాలు అందుబాటులో ఉన్నాయి. సీజనల్ వ్యాధులు, సాధారణ చికిత్సలకు అవసరమయ్యే యాంటీబయెటిక్స్, లివర్ సపోర్ట్, నట్టల నివారణ తదితర మందులు ఏటా నాలుగు దఫాలుగా రూ.1.40కోట్ల విలువైన మందులు మాత్రమే సరఫరా అవుతున్నాయి. నిజానికి ఈ కేటాయింపు రెట్టింపు అంటే ఏడాదికి రూ.2.80 కోట్ల మందులు అందిస్తే రైతులకు ఊరట లభించే అవకాశముంది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో పశువైద్యం కోసం రైతులు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుంది. జిల్లాలో పశువైద్యం అందక, పోషణకు అనువైన పరిస్థితుల్లేక రైతులు తమ పశువులను తెగనమ్ముకుంటున్నారు. పేరులోనే పాలను ఇముడ్చుకున్న ములుగు మండలం క్షీరసాగర్ గ్రామ దయనీయ గాథను ‘సాక్షి’ ప్రచురించిన సంగతి తెల్సిందే. ఒక్క క్షీరసాగర్ గ్రామమే కాదు. అన్ని గ్రామాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.
సిబ్బంది కొరతతో ఇబ్బందులు...
జిల్లాలో పశువైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఫలితంగా పలు సమస్యలు ఎదురవుతున్నాయి.పాల సేకరణను పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాన్ని రైతులు హర్షిస్తున్నారు. పశువైద్య కేంద్రాల్లో నెలకొన్న ఖాళీలను భర్తీచేస్తే భారీ ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. - లక్ష్మారెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ