పాడి పరిశ్రమ, పశు వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట | AP Govt Priority Dairy And Veterinary Medicine Seediri Appalaraju | Sakshi
Sakshi News home page

పాడి పరిశ్రమ, పశు వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట

Published Sat, May 7 2022 1:15 PM | Last Updated on Sat, May 7 2022 2:11 PM

AP Govt Priority Dairy And Veterinary Medicine Seediri Appalaraju - Sakshi

చీపురుపల్లి(గరివిడి): పశు సంపద పుష్కలంగా ఉన్నప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యపడుతుందన్న గాంధీజీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పశు సంపద, పాడి పరిశ్రమ, పశు వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు తెలిపారు. గరివిడిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి చెందిన పశువైద్య కళాశాలలో రూ.81.25 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించిన పశువైద్య చికిత్స సముదాయం, పశుగణ క్షేత్ర సముదాయం, బాలుర, బాలికల వసతిగృహాల భవనాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో సీదిరి మాట్లాడారు. ఏపీలో ఆర్‌బీకేలలో అందిస్తున్న సేవలు దేశ చరిత్రలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రతీ వెయ్యి మూగజీవాల వైద్య సేవలకు ఒక వెటర్నరీ అసిస్టెంట్‌ను నియమించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. మనుషుల వలే త్వరలో వెటర్నరీ అంబులెన్స్‌లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దీనికి సీఎం ఇప్పటికే ఆమోద ముద్రవేశారని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో మూగజీవాలకు కష్టంవస్తే మండల, నియోజకవర్గ కేంద్రాల్లోని ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఊరిలోనే వైద్యసేవలు అందజేస్తున్నట్టు వెల్లడించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా పటిష్ట్రపణాళికలను ప్రభుత్వం రూపొందించిందన్నారు. పశు వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి భవిష్యత్‌లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. గరివిడిలో పశు వైద్య కళాశాల అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కళాశాలను అభివృద్ధి చేస్తోందన్నారు. గరివిడిలోని కళాశాలను వర్సిటీ స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.  

రాష్ట్ర భవిష్యత్‌కు విద్యార్థులే పెట్టుబడి  
రాష్ట్ర భవిష్యత్‌కు విద్యార్థులే పెట్టుబడి అని, వారి చదువుల కోసం ప్రభుత్వం అధిక నిధులు ఖర్చుచేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కలెక్టర్, వైస్‌చాన్సలర్‌ సూచనల మేరకు రూ.5 కోట్ల వ్యయంతో జిల్లా స్థాయి ఆడిటోరియంను గరివిడి పశువైద్య కళాశాలలో నిర్మించనున్నట్టు వెల్లడించారు. గరివిడిలో పశువైద్య కళాశాలకు 2016లోనే జీఓలు ఇచ్చినప్పటికీ పనులపై అప్పటి ప్రభుత్వం శ్రద్ధ చూపలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పశువైద్య కళాశాల అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో పశువైద్య వృత్తికి భారీ డిమాండ్‌ పెరుగుతోందన్నారు.

కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. చదువుతోనే పేదరిక నిర్మూలనతో పాటు రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నది సీఎం అభిమతంగా పేర్కొన్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పశువైద్య కళాశాలకు జీఓలు ఇచ్చినప్పటికీ కేంద్రం అనుమతులు తీసుకురాలేదన్నారు.

ఎంపీ అయ్యాక కేంద్ర అధికారులతో మాట్లాడి, బృందాలను రప్పించి పరిశీలన జరిపించి అనుమతులు తెప్పించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వీసీ పద్మనాభరెడ్డి, బోర్డు మెంబర్లు జీఎస్‌.రెడ్డి, జానకీరామ్, విజయ్‌కుమార్, కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి, అసోసియేట్‌ డీన్‌ సీవీ రాయులు, ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు, ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు, సర్పంచ్‌ గేదెల కృష్ణవేణి, ఏఎంసీ చైర్మన్‌ దన్నాన జనార్దనరావు, నాలుగు మండలాల వైఎస్సార్‌సీపీ నాయకులు కేవీ సూర్యనారాయణరాజు, ఎస్‌వీ రమణరాజు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మీసాల విశ్వేశ్వరరావు, కోట్ల వెంకటరావు, పొట్నూరు సన్యాసినాయుడు, తహసీల్దార్‌ టి. గోవింద, ఎంపీడీఓ జి.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. 

చంద్రబాబువి శవ రాజకీయాలు
శవ రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతూ సిగ్గులేని మాటలు చెబుతున్న చంద్రబాబునాయుడు ‘శవాల వద్దకే చంద్రబాబు’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మంత్రి డా.సీదిరి అప్పలరాజు విమర్శించారు. విజయనగరం జిల్లా గరివిడిలో పశువైద్య కళాశాలలో కొత్తగా నిర్మించిన చికిత్స సముదాయాలను ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంగ్లిష్‌ మీడియంపై సిగ్గులేని మాటలు అడుతున్నారని విమర్శించారు. ఇంగ్లిష్‌ మీడియం చదివితే మొద్దు అవుతారన్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. 

ఆయన కొడుకు, మనవడు ఏ మీడియంలో చదివారు... మనవడుకు తెలుగు అక్షరాలు వచ్చా అని ప్రశ్నించారు. చంద్రబాబు పిల్లలు, కుటుంబ సభ్యులు మాత్రమే ఇంగ్లిష్‌ మీడియంలో చదవాలే తప్ప రాష్ట్రంలోని పేదల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం చదవకూడదన్నది ఆయన నైజమన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంక్షదబాబు చేయలేని పనులు రెండేళ్లలో జగన్‌మోహన్‌రెడ్డి చేసి చూపించారన్నారు. ప్రజల్లో మంచి పేరు రావడంతో జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మాతృభాష అయిన తెలుగును గౌరవిస్తూనే... మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపేలా ఆంగ్లమాధ్యమ చదువులకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న ఆంగ్లమాధ్యమ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమల్లోకి తెచ్చారన్నారు. చంద్రబాబునాయుడు జాతీయ అధ్యక్షుడు కదా... అక్కడ ఆంగ్లమాధ్యమం అమలుపై ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు జై జగన్‌ అంటూ జనం నినదిస్తున్న తీరుచూస్తే ‘బాబుకు బాదుడే బాదుడు’ తప్పదన్నారు. 2024 నాటికి తెలుగు దొంగల పార్టీ అంతరించిపోవడం ఖాయమన్నారు. ఎన్ని శవ యాత్రలు చేసినా, లోకేష్‌ ఎన్ని శవాలు వద్దకు వెళ్లి ఫొటోలు తీయించుకున్నా ప్రజలు నమ్మరని చెప్పారు. 2024లో మరోసారీ భారీ మెజారిటీతో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రతిపక్షాలు శవ రాజకీయాలు మానుకుని హుందాగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement