కుడా ఇక.. బడా | The government is focused on a range of outreach | Sakshi
Sakshi News home page

కుడా ఇక.. బడా

Published Thu, Feb 4 2016 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM

The government is focused on a range of outreach

పరిధి పెంపుపై ప్రభుత్వం దృష్టి
రెట్టింపు కానున్న ఉద్యోగుల సంఖ్య
సీఎం చెంతకు చేరిన ప్రతిపాదనలు

 
హన్మకొండ:  తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ‘కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ’ (కుడా) జవసత్వాలు కూడగట్టుకోనుంది. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న కుడాకు కష్టాలు తీరనున్నాయి. వరంగల్ నగరం, పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 1805 చదరపు కిలోమీటర్ల పరిధితో 1982లో  ‘కుడా’ను ఏర్పాటు చేశా రు. కుడా పరిధిలోకి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 171 గ్రామా లు ఉన్నాయి. ఇందులో 27 గ్రామాలు కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నాయి. చైర్మన్, వైస్ చైర్మలతో పాటు మొత్తం పరిపాలన, ప్లానింగ్, అభివృద్ధి, అర్బన్ ఫారెస్ట్, భూసేకరణ, అకౌంట్స్ మొత్తం ఆరు విభాగాలతో కుడాను ఏర్పాటు చేశారు. మొత్తం 168 పోస్టులు మంజూరు చేశారు.

అయితే గడిచిన ముప్పై ఏళ్లుగా ఉద్యోగులను భర్తీ చేయలేదు. కేవలం 46 మంది ఉద్యోగస్తులతో నెట్టుకొస్తోంది. దీంతో అభివృద్ధి పనుల్లో వేగం మందగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరంగల్.. రాష్ట్రంలో రెండో ప్రధాన నగరం హోదాలో ఉంది. నగర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉంది. మరోవైపు కుడా పరిధిలో జనాభా 7.6 లక్షల నుంచి 13 లక్షలకు చేరుకుంది. ఇటీవల నగర అభివృద్ధిపై సమీక్ష సందర్భంగా కుడాను బలోపేతం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
 
ఖాళీలన్నీ భర్తీ..
 కేంద్ర ప్రభుత్వ పథకాలైన హృదయ్, అమృత్, స్మార్ట్ సిటీలలో వరంగల్‌కు చోటు దక్కింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను వరంగల్‌లో నెలకొల్పబోతోంది. అంతేకాకుండా నగరంలో మురికివాడల్లో నివసిస్తున్న పేదల కోసం 30వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించనున్నారు. అంతేకాకుండా కుడా పరిధిని 1805 చదరపు కిలోమీటర్ల నుంచి 2300 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించాలని ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. దీంతో కుడాపై పని భారం అనూహ్యంగా పెరిగిపోనుంది. వీటన్నింటీని దృష్టిలో ఉంచుకుని గతంలో మంజూరై ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేయాలని సీఎం కే సీఆర్ నిర్ణయించారు. పెరిగిన జనాభా, అభివృద్ధి కార్యక్రమాలు, మాస్టర్‌ప్లాన్ ఆధారంగా అవసరమైన మేరకు కొత్త పోస్టులు సృష్టించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర మున్సిపల్ శాఖ సిద్ధం చేస్తోంది. ఈమేరకు త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement