Kakatiya Urban Development Authority
-
అభివృద్ధి పేరుతో భూ వ్యాపారమా?
‘కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ’ (కుడా) వరంగల్ నగర శివారును ఆనుకొని ఉన్న గ్రామాల్లోని రైతుల భూముల్లో గత మూడేళ్ల నుంచీ రహస్య సర్వే చేస్తోంది. మొదట్లోనే స్థానిక రైతాంగం ‘మా భూముల్లో మా అనుమతి లేకుండా సర్వే చేయడం ఏమిటి?’ అని అడ్డుకున్నారు. అడ్డుకున్న రైతులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ‘కుడా’ ప్రయత్నాలను ఆదిలోనే రైతులు అడ్డుకోవ డంతో ఒక అడుగు వెనక్కి వేసి సర్వేను ఆపుతున్నాం అని అధికారులు ప్రకటించారు. వరంగల్ చుట్టూరా అవుటర్ రింగురోడ్డును ఆనుకొని పచ్చని పంట భూములు ఉన్నాయి. అక్కడి నుంచే కొత్తిమీర, పుదీనా, వంకాయ ఇతర కూర గాయలు ఉదయం 3 గంటలకే వరంగల్ మార్కెట్‌కు చేరుకుంటాయి. హన్మకొండ, వరంగల్ సిటీ ప్రజలకు 90 శాతం కూరగాయలు సిటీ శివారు గ్రామాల రైతులు తీసుకొచ్చేటివే. కూరగాయలు, మార్కెట్ వ్యాపారంపై చిన్న, సన్నకారు పేద రైతులు వేలాదిగా ఆధారపడి ఉన్నారు. ‘కుడా’ అవుటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న 27 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కోసం 21,510 ఎకరాల భూమిని సేకరించాలని సర్వే చేసింది. ఆ తర్వాత సర్వే నంబర్లతో సహా జీవో నం. 80(ఎ) విడుదలయింది. 27 గ్రామాల్లో 2 గ్రామాల రైతుల అభిప్రాయ సేకరణ జరగలేదు. ముందుగా అసైన్డ్ భూముల సర్వే చేశారు. ఇవి పడావ్ భూములు కావు. దశాబ్దాల కాలం నుండి రైతుల వద్ద సాగులో ఉన్న భూములే. తర్వాత రైతుల పట్టా భూముల్లో సర్వే చేశారు. మొత్తంగా తమ ప్రాజెక్ట్‌కు కావాల్సిన భూమి మొత్తాన్ని సేకరించారు. 27 గ్రామాల్లోని 21,510 ఎకరాల భూమిని ప్లాట్లుగా విభజించి వ్యాపారం చేయబోతున్నారు. అందులో నుండి భూమి ఇచ్చిన రైతుకు 1200–1400 గజాల భూమిని ప్లాట్ల రూపంలో ఇస్తారు. వ్యవ సాయ భూమి ప్లాట్ల రూపంలోకి మారడం వల్ల... భూమి రేటు రెట్టింపు అవుతుంది. కాబట్టి మొత్తం 1400 గజాల్లో రైతుకు లాభం కోట్లల్లో వస్తుందని అధికారులు లెక్కలు చెబుతున్నారు. అంటే వేలాది ఎకరాల పంట భూముల్ని భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం పూనుకున్నదన్న మాట! మొన్న వరంగల్, పరకాల మీటింగ్‌లలో మంత్రి కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రకటించారు. రైతుల భూమిని రైతుల అనుమతి లేకుండా గుంజు కొని ప్రభుత్వమే రియల్ భూవ్యాపారం అధికారి కంగా చేస్తుందనేది ఇందువల్ల రూఢి అయింది. ల్యాండ్ పూలింగ్‌పై ప్రజలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఈ సందేహాలను తీర్చే బాధ్యత ప్రభుత్వానిదే. ల్యాండ్ పూలింగ్‌కు భూమి ఇచ్చిన రైతు భవిష్యత్ ఏమిటి? భూమిపై ఆధారపడి పంటలు పండిస్తూ బ్రతికే రైతును ప్రభుత్వమే భూమి లేని వాడిగా చేస్తోంది. కూలీగా మార్చివేస్తోంది. 21,510 ఎకరాలను ప్లాట్లుగా మార్చి పెద్ద ఎత్తున ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి... వచ్చిన ఆదాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని స్పష్టమయింది. (క్లిక్: వారికో న్యాయం.. ఊరికో న్యాయం) భూ వ్యాపారమే లక్ష్యంగా పెట్టుకొని వరంగల్ నగర అభివృద్ధి అంటే ఎలా? వరంగల్ చుట్టూ ఎత్తయిన భవనాల నిర్మాణం జరిగేతేనే అభివృద్ధా? ఇందులో బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనం దాగి ఉంది. స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ల్యాండ్ పూలింగ్ వేగవంతం అవుతోంది. రైతుల ఆందోళనల ఫలితంగా ‘కుడా’ చైర్మన్ ల్యాండ్ పూలింగ్ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనలో కూడా స్పష్టత లేదు. ల్యాండ్ పూలింగ్ కోసం తెచ్చిన జీఓను వెంటనే రద్దు చేయాలి. రైతాంగానికి ప్రజలందరూ అండగా నిలబడాలి. (క్లిక్: భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడు?) - ఎల్. రాజు సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి, వరంగల్ -
ఓరుగల్లుకు మోనో లేదా మెట్రో!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. వరంగల్‌లో 15 కిలోమీటర్ల మోనో రైలు మార్గంతో పాటు హైదరాబాద్ తరహాలో మెట్రో రైలు మార్గం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. మామునూర్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందన్నారు. వరంగల్ నగరాభివృద్ధిపై బుధవారం ఆయన శాసనసభ కమిటీ హాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో కలసి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) మాస్టర్ ప్లాన్‌కు ఈ సమావేశంలో కేటీఆర్ ఆమోదించారు. 2020–41 వరకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్‌తో నగర రూపురేఖలు మారిపోతాయని, గొప్ప నగరాల జాబితాలో వరంగల్ చేరుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 2న ప్రారంభించాలి..: ఇక నగరానికి మంజూరైన 68 కిలోమీటర్ల రింగ్ రోడ్డులో 29 కిలోమీటర్ల మేర పనులు మే నెల చివరి నాటికి పూర్తి చేసి, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రారంభించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వరంగల్ స్మార్ట్ సిటీ పనులు ఎంతవరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా వెంటనే నగరంలో 1,000 పబ్లిక్ టాయిలెట్లను దసరాలోపు నిర్మించాలని ఆదేశించారు. నగరంలో 250 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే ఉన్నాయని, ప్రభుత్వ స్థలాల్లో, కార్యాలయాల్లో వెయ్యి టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పందుల నివారణకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించి, పందుల పెంపకందార్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలన్నారు. ప్రజా ప్రతినిధులు పందుల పెంపకందార్లను ఒప్పించాలన్నారు. దసరా నాటికి ఇళ్లు సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో ఇచ్చిన హామీల అమలు వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు. నగరానికి మంజూరు చేసిన 3,900 డబుల్ బెడ్రూం ఇళ్లను దసరా నాటికి యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలన్నారు. పూర్తైన 900 ఇళ్లను త్వరలో ప్రారంభించాలన్నారు. మిగిలిన 3,000 ఇళ్లలో 2,200 ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, కేవలం 800 ఇళ్లు స్థానిక సమస్యలతో ప్రారంభం కాలేదని స్థానిక ఎమ్మెల్యేలు కేటిఆర్ దృష్టికి తెచ్చారు. ఈ ఇళ్లను ప్రారంభించలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. కాళోజి కళాక్షేత్రం, ఏకశిలా పార్క్ నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య ప్రణాళిక, హరిత ప్రణాళిక, ఎనర్జీ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. ఎనర్జీ ఆడిట్లో భాగంగా నగరంలో తుప్పుపట్టిన, వంగిన స్తంబాలు, వేలాడే వైర్లు, ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ ఫార్మర్లను మార్చాలన్నారు. 16న మరోసారి భేటీ.. వరంగల్ నగరం మరింతగా అభివృద్ధి కానున్న నేపథ్యంలో నగరానికి నాలుగు వైపుల డంపింగ్ యార్డులు గుర్తించాలని కేటీఆర్ కోరారు. ప్రస్తుత డంపింగ్ యార్డులో బయో మైనింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్లో కలసిన శివారు ప్రాంతాలకు మూడో వంతు నిధులు కేటాయించి ఖర్చు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, శివారు ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేషన్ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ నెల 16న మరోసారి సమావేశమై ముఖ్యమైన అంశాల మీద చర్చిస్తామని.. అధికారులు సమగ్ర సమాచారంతో ఆ సమావేశానికి రావాలన్నారు. సమావేశంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మేయర్ గుండా ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
‘కుడా’పై.. కుత కుత
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, సలహామండలి కమిటీల్లో చోటు దక్కపోవడంతో ఆశావహుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులమైన తమ అనుయాయులకు కనీస ప్రాతినిధ్యం కల్పించలేదని పలువురు టీఆర్ఎస్ సీనియర్ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్ : కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) కమిటీలపై భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘కుడా’ చైర్మన్ పదవిపై ఎప్పుడో సస్పెన్స్ వీడినా.. పాలకమండలి, సలహా మండలిలో తమ అనుచరులకు అవకాశం కల్పించకపోవడంపై కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల నుంచి అసహనం వ్యక్తం అవుతోంది. మూడు జిల్లాలు, 19 మండలాలు, 181 గ్రామాలకు ‘కుడా’ విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి కీలకమైన కమిటీలలో కొందరు ఎమ్మెల్యేలు సూచించిన పేర్లనే పరిగణలోకి తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో వరంగల్ అర్బన్ జిల్లాలో ‘అసలు మేమున్నామా.. లేమా..’ అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగిన సభలో తన మనసులోని మాట బయట పెట్టడం చర్చనీయాంశం అవుతోంది. లేఔట్లు, భూ లావాదేవీలు, భవన నిర్మాణాలపై ‘కుడా’ అనుమతులు తప్పనిసరి కాగా, నిధుల కేటాయింపు, కమిటీలలో మాత్రం హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాలకు ప్రాధాన్యత విషయంలో మిగతా ప్రజ్రాప్రతినిధులు, సీనియర్ నేతల నుంచి అసంతృప్తి వ్యకమవుతోంది. 15 మంది సలహా మండలి కమిటీలో వరంగల్ ట్రైసిటీకి సంబంధించిన ఉద్యమకారులు, సీనియర్లకు అవకాశం దక్కలేదన్న నిరాశ కొందరిలో వ్యక్తమవుతోంది. హుజూరాబాద్, హుస్నాబాద్‌లకు దక్కని చోటు.. పది రోజుల క్రితం ప్రకటించిన ‘కుడా’ కమిటీలో పాలకమండలి చైర్మన్ పదవి మరోసారి మర్రి యాదవరెడ్డికే దక్కింది. పాలకవర్గం, సలహా మండలిని సైతం ‘కుడా’ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రి, ఇతర సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వేస్తారు. ఈసారి కూడా అదే జరిగిందని భావించారు. అయితే కమిటీల విషయంలో నెమ్మదిగా అసంతృప్తిరాగం వినిపిస్తోంది. పాలకవర్గంలో పది మందికి అవకాశం కల్పించారు. వాస్తవానికి ‘కుడా’ పరిధిలో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల్లోని 19 మండలాలు, ఏడు నియోజకవర్గాలు, 181 గ్రామాలు వస్తాయి. ఈ నేపథ్యంలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలతో పాటు హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాలను పరిగణలోకి తీసుకోవాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అంటున్నారు. అయితే మర్రి యాదవరెడ్డి చైర్మన్‌గా, మునిసిపల్ కమిషనర్ వైస్ చైర్మన్‌గా, వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, నన్నపనేని నరేందర్, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ టి.రాజయ్య, మరో ముగ్గురు అధికారులను సభ్యులుగా చేర్చారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్, హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, వొడితెల సతీష్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాలకమండలిలో ఈ ఇద్దరికీ ఎక్స్అఫీషియో సభ్యులుగా చేర్చకపోగా.. వారి అనుచరులకు కమిటీలో అవకాశం ఇవ్వకపోవడంపై చర్చ జరుగుతోంది. చర్చనీయాంశంగా మారిన కమిటీలు.. ‘కుడా’ సలహామండలిలో 15 మందిని సభ్యులుగా నియమించారు. ఈ సభ్యుల ప్రతిపాదనల్లోనూ ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ కోటాలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు సూచించిన కార్యకర్తలకే అవకాశం కల్పించారు. అందులో మాడిశెట్టి శివశంకర్, దొంతి రవీందర్‌రెడి, బొర్ర ఐలయ్య, నక్క లింగయ్య యాదవ్, మోడెం ప్రవీన్, ఎలుగం శ్రీనివాస్, గులాం సర్వర్(మున్నా), ఊకంటి వనంరెడ్డి, చిర్ర రాజుగౌడ్, నన్నబోయిన రమేష్‌యాదవ్, భూక్యా శంకర్‌నాయక్, ఆకుల కుమార్, బిల్ల యాదగిరి, ఎ.రవీందర్, వీరగొని రాజ్‌కుమార్ ఉన్నారు. ఇందులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేష్ నలుగురి చొప్పున, ఎమ్మెల్యేలు నన్నపనేని నరెందర్ ముగ్గురు, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ టి.రాజయ్య తలా ఇద్దరి పేర్లను సిఫారసు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో వరంగల్ అర్బన్ జిల్లాలో ‘అసలు మేమున్నామా.. లేమా.. పూర్వ కరీంనగర్ జిల్లా నుంచి విలీనమైన భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలను అధికారులు విస్మరిస్తున్నారు.. మంత్రి, ఎమ్మెల్యే ఉన్నారన్న విషయం మరచిపోతున్నారు’ అంటూ హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ ఎల్కతుర్తి సభలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. కొందరు ప్రజాప్రతినిధులు, సీనియర్లలోనూ ఈ చర్చ ఇప్పటికే జరుగుతోంది. -
ఓరుగల్లు సమగ్రాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) మాస్టర్‌ప్లాన్‌కు తుదిరూపునిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. పట్టణాల సమగ్రాభివృద్ధికి మాస్టర్ప్లాన్లు దిక్సూచిలా పనిచేస్తాయని అన్నారు. వరంగల్ మాస్టర్‌ప్లాన్ ముసాయిదా(డ్రాప్ట్ మాస్టర్‌ప్లాన్)పై కుడా పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో శనివారం హైదరాబాద్‌లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ కీలకమని, భవిష్యత్తు తరాలకు ఉపయోపడేలా, సమగ్ర అభివృద్ధి సాధించేలా ఇవి ఉండాలని సూచించారు. ఈ మాస్టర్‌ప్లాన్‌పై వివిధ వర్గాల నుంచి సుమారు నాలుగు వేల వరకు సూచనలు, సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. వీటన్నింటినీ క్రోడీకరించి డ్రాఫ్ట్‌ను తయారు చేసినట్లు చెప్పారు. 2041 సంవత్సరం వరకు అవసరాలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించామని కేటీఆర్ తెలిపారు. చరిత్ర చెరిగిపోకుండా... వరంగల్ నగర చరిత్ర, పర్యావరణ, పురావస్తు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ, చెరువులు, రోడ్లు, కాలనీల అభివృద్ధిపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ ఆమోదం అనంతరం జీఐఎస్‌తో అనుసంధానం చేస్తామన్నారు. మాస్టర్‌ప్లాన్ పొందుపరిచిన అంశాల పరిశీలనకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గానికో నోడల్ అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. ఈ నోడల్ అధికారి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చే సలహాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డును అనుసంధానిస్తూ రేడియల్ రోడ్లను నిర్మిస్తామని, దీంతో ఓరుగల్లు ముఖచిత్రమే మారిపోనుందని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్రోత్ కారిడార్లు, ఇండ్రస్టియల్ జోన్లను కూడా పొందుపరిచినట్లు చెప్పారు. పట్టణావసరాలకు అనుగుణంగా కుడా యంత్రాంగం పనితీరును మార్చుకోవాలని, అవసరమైన నిధులను సమీకరించుకునేలా ప్రణాళికలు రచించాలన్నారు. హెచ్ఎండీఏ తరహాలో ల్యాండ్ పూలింగ్, భూహక్కుల బదిలీ విధానం తదితర కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మాస్టర్‌ప్లాన్ విశిష్టత, ఎక్కడెక్కడ ఏయే జోన్లను పొందుపరిచారనే దానిపై మంత్రి కేటీఆర్ వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు రుణవిమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరి్వంద్ కుమార్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, కుడా వైస్ చైర్మన్ ఎన్.రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
కునారిల్లుతున్న ‘కుడా’
ప్రతిపాదనల్లోనే భారీ ప్రాజెక్టులు వేధిస్తున్న అధికారులు, సిబ్బంది కొరత కుంటుపడుతున్న మహానగర అభివృద్ధి చైర్మన్ యాదవరెడ్డి ముందు సవాళ్లు ఎన్నో.. వరంగల్ అర్బన్ : హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరాభివృద్ధి సంస్థగా పేరున్న కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) కునారిల్లుతోంది. రూ.కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందిస్తున్నా అధికారులు, సిబ్బంది కొరత తదితర కారణాలతో పట్టాలెక్కడం లేదు. ఈ తరుణంలో ‘కుడా’ 9వ చైర్మన్ గా మర్రి యాదవరెడ్డి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ‘కుడా’ ఇంత వరకు చేపట్టిన వాటిలో నత్తను మరిపిస్తున్న కొన్ని కీలక ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రత్యేక కథనం. అమలులోకి రాని కొత్త మాస్టర్పాన్ .. 43 ఏళ్లు గడిచినా మాస్టర్‌ప్లాన్ రివైడ్జ్ కు నోచుకోవడం లేదు. పదిహేను ఏళ్లకోమారు రివైడ్జ్ చేసే మాస్టర్‌ప్లాన్ కు ఇంకా మోక్షం కలగడం లేదు. ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉంటోది. ప్రస్తుతం కుడా బోర్డు ఆమోదం పొంది, ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిన కొత్తమాస్టర్ ప్లాన్ ముసాయిదా కొన్ని మార్పులు చేర్పులకు వెనక్కి వచ్చింది. దీనిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. భూ మార్పిడిలు తదితర పనుల కోసం నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ వరంగల్‌ను స్మార్ట్‌సిటీ, హృదయ్, అమృత్ లాంటి కీలక పథకాలు వర్తించాయి. కొత్త మాస్టర్‌ప్లాన్ తోనే ఈ బృహత్తర పథకాలు ముడిపడి ఉన్నాయి. మాస్టర్‌ప్లాన్ ను త్వరితగతిన అమల్లోకి తీస్తే మహానగరం మరింత పురోగతి సాధించే ఆస్కారం ఉంటుంది. మాటల్లోనే ఇన్నర్, ఔటర్‌రింగ్ రోడ్డు.. 200 అడుగుల ఔటర్ రింగ్ రోడ్డుపై నిర్లక్ష్యం నీడలు అలుముకున్నాయి. 1972 మాస్టర్‌ప్లాన్ లో పొందుపరిచిన ఇన్నర్ రింగ్ రోడ్డు, తాజాగా ప్రతిపాదించిన ఔటర్‌రింగ్ రోడ్డుకు అడుగులు పడడం లేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు భూ సేకరణ కోసం వరంగల్ ఆర్డీఓ ఖాతాలో జమ చేసిన రూ. 20 కోట్లు మూలుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.2 వేల కోట్ల మేరకు నిధులు అవసరం అధికారులు చెబుతున్నారు. భారీ నిధులతో కూడిన ఈ ప్రాజెక్టుకు నిధులు, భూసేకరణ సమస్యగా మారింది. ప్రతిపాదనల్లోనే పద్మాక్షి రోప్‌వే.. ఓరుగల్లులో కలికితురాయిగా నిలుస్తున్న పద్మాక్షి రోప్ వే ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మ గ్గుతోంది. కుడా ఆధ్వర్యంలో భద్రకాళి గుట్ట నుంచి పద్మాక్ష్మి గుట్ట వరకు రోప్ వే నిర్మా ణం చేపట్టాలని చేసిన ప్రతిపాదనలకు అనేక అడ్డంకులు తలెత్తాయి. రూ.15 కోట్ల తో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టును 1.7 మీటర్ల దూరంలో నిర్మించాలని భావించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. రోప్‌వే నిర్మాణం పూర్తయితే పర్యాటకులను విశేషంగా అకట్టుకోనుంది. మరికొన్ని ప్రాజెక్టులు.. ఓ సిటీ ప్రాజెక్టు విజయవంతం కావడంతో కుడా అధికారులు నగర శివారు మునిపల్లిలో టౌ¯ŒSషిప్‌ను ప్రతిపాదించారు. 200 ఎకరాల భూమి రెవెన్యూ శాఖ ఇచ్చింది. టౌన్ షిప్ పనుల పక్రియ పూర్తయింది. కానీ, ఓ సిటీలో మిగిలిన ప్లాట్లు, మునిపల్లి ప్లాట్లను వేలం వేయడంలో అధికారులు ఉదాసీనవైఖరి అవలంబిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హంటర్ రోడ్డులోని జూపార్కు ఎదుట ఉన్న సై¯Œ్స సెంటర్ పనులు తుది రూపునకు చేరలేదు. హన్మకొండ అంబేద్కర్ భవన్ పక్కన 2007లో బీఓటీ పద్ధతిన చేపట్టిన బహుళ అంతస్తు ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. భద్రకాళి దేవాలయం వద్ద ప్రతిపాదించిన పిరమిడ్ ధ్యాన కేంద్రం డీపీఆర్కే పరిమితమైంది. ఉర్సు రంగసముద్రం, బంధం చెరువు, చిన్నవడ్డేపల్లి చెరువు, నగరంలోని ముఖ్య జంక్షన్లు, మాస్టర్‌ప్లాన్ రోడ్ల విస్తరణకు సంబంధించిన కొన్ని పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. మరికొన్ని పనులు ప్రారంభం కాకపోవడం ‘కుడా’ పనితీరుకు నిలువుటద్దంగా నిలుస్తోంది. పైసలిస్తేనే ఫైళ్లు ముందుకు.. భూమార్పిడిలు, లే ఔట్లు, ఎల్ఆర్ఎస్ తదితర వాటి కోసం ‘కుడా’ కార్యాలయంలో కాసులు అప్పగిస్తేనే ఫైళ్లు ముందుకు కదులుతున్నాయని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. లేదంటే ప్రజలు నెలల తరబడి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఫలానా అధికారి, ఉద్యోగి వద్ద ఫైల్ ఉందంటూ, క్షేత్ర స్థాయి తనిఖీలు చేయాలంటూ ప్రజలకు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘కుడా’ ను అధికారులు, సిబ్బంది లేమి వేధిస్తోంది. మొత్తంగా 100 మంది అధికారులు, ఉద్యోగులకు 40 మందే ఉన్నారు. దీంతో ఎల్ఆర్ఎస్ పైళ్లు, భూమార్పిడి, లేఔట్ ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. అధికారులు మాత్రం సిబ్బంది కొరతతో పనుల్లో జాప్యం జరుగుతోందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘కుడా’ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న యాదవరెడ్డి పరిపాలనను పరుగెత్తించాల్సిన అవసరం ఉంది. -
భూ వినియోగ మార్పిడి చార్జీల బాదుడు
సాక్షి, హైదరాబాద్: భూ వినియోగ మార్పిడి చార్జీలు భారీగా పెరిగాయి. నగరాలు, పట్టణాలు, పట్టణాభివృద్ధి సంస్థల మాస్టర్ ప్లాన్‌లో నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ/కన్జర్వేషన్/గ్రీన్ బెల్ట్, రిక్రియేషనల్ జోన్లలోని భూములను సంబంధిత కేటగిరీ కాకుండా ఇతరత్ర అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించేందుకు ప్రభుత్వం వసూలు చేస్తున్న అభివృద్ధి చార్జీలు 25 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి. బుధవారం ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా), యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలతో సహా రాష్ట్రంలోని ఇతర అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మాస్టర్ ప్లాన్లలోని భూ వినియోగ మార్పిడికి ఇకపై వసూలు చేసే కొత్త చార్జీలను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ మినహాయిస్తే.. హెచ్ఎండీఏ పరిధిలోని మునిసిపాలిటీలతో పోల్చితే గ్రామ పంచాయతీల్లో చార్జీలు తక్కువగా ఉన్నాయి. తాజాగా మున్సిపాలిటీలతో సమానంగా గ్రామ పంచాయతీల్లోని భూముల భూ వినియోగ చార్జీలను పెంచారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారీగా నిధులను సమకూర్చుకోడానికి ప్రభుత్వం ఈ చార్జీలను పెంచిం ది. ఈ చార్జీల ద్వారా హెచ్ఎండీఏ ఏటా రూ.వందల కోట్లు ఆర్జిస్తోంది. యాదగిరిగుట్ట భూములపై కూడా.. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ ఆథారిటీ పరిధిలో భూ వినియోగ మార్పిడి చార్జీలను దాదాపు హెచ్ఎండీఏ పరిధిలోని చార్జీలకు సమానంగా పెంచారు. యాదగిరిగుట్ట పరిధిలో చ.మీ. స్థలానికి రూ.120 నుంచి రూ.200 వరకు చార్జీలను వసూలు చేయనున్నారు. కమర్షియల్, రెసిడెన్షియల్ కేటగిరీలకు మార్చేందుకు చ.మీ.కు రూ.200 అభివృద్ధి చార్జీని విధించనున్నారు. గుట్ట పరిధిలో పరిశ్రమల కేటగిరీకి మార్పు కోసం మాత్రం చ.మీ.కు రూ.120 చార్జీని ఖరారు చేశారు. వేములవాడ, బాసర ఆలయాభివృద్ధి సంస్థల పరిధిలోనూ మున్సిపల్ కార్పొరేషన్లు/మున్సిపాలిటీల్లో చ.మీ.కు రూ.90 నుంచి రూ.120 వరకు చార్జీలను వసూలు చేయనున్నారు. నివాస కేటగిరీ నుంచి వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీలకు మార్చేందుకు రూ.120 చార్జీలు విధించనున్నారు. గ్రామ పంచాయతీల్లో చ.మీ.కు రూ.40 నుంచి రూ.60 వరకు వసూలు చేయనున్నారు. ఇతర నగరాలు, పట్టణాల్లో.. హెచ్ఎండీఏ, కుడాలతో సహా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా భూ వినియోగ మార్పిడి చార్జీలు పెరిగాయి. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు, గ్రేడ్-1, 2, 3 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రూ.10 నుంచి రూ.135 వరకు భూ వినియోగ చార్జీలు విధించనున్నారు. -
గ్రేటర్‌కు ఔటర్ హారం
రూ. 1500 కోట్లతో ప్రతిపాదనలు డీపీఆర్ సిద్ధం చేస్తున్న ఏకాం సంస్థ దాదాపు 80 కిలోమీటర్ల నిడివితో ప్రణాళిక జాతీయ రహదారి పరిధిలో 23 కిలోమీటర్లు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వరంగల్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) మాస్టర్ ప్లాన్ - 2030కి అనుగుణంగా నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు సమగ్ర నివేదిక రూపొందించే పనులు ఏకాం అనే సంస్థకు అప్పగించారు. హన్మకొండ : వరంగల్ నగరం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ద శాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో ‘కుడా’ మాస్టర్ ప్లాన్-2013 ప్రకారం నివేదిక సిద్ధం చేశారు. అయితే, హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో పెద్ద నగరం కావడం భవిష్యత్‌లో టెక్స్టైల్స్ పార్కు, ఇండస్ట్రియల్ కారిడార్, ఐటీ పరిశ్రమలు వరంగల్ చుట్టూ నెలకొల్పనున్న నేపథ్యంలో పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మించే రింగ్ రోడ్డు భవిష్యత్ అవసరాలను తీర్చలేదనే అనుమనాలు వ్యక్తమయ్యాయి. దీంతో కుడా మాస్టర్ ప్లాన్ 2030 ప్రకారం మరో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ పనులు న్యూ ఢిల్లీకి చెందిన ‘ఏ కాం’ అనే సంస్థకు అప్పగించారు. ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మం, నర్సంపేట, కరీంనగర్ల నుంచి నగరానికి నిత్యం వచ్చిపోయే వాహనాల రద్దీపై సర్వే నిర్వహించారు. వీటి ఆధారంగా ఆగస్టు చివరికల్లా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కీలకంగా స్థల సేకరణ వరంగల్ రింగ్ రోడ్డును హైదరాబాద్ మార్గంలో కరుణాపురం - ధర్మసాగర్ శివారు - టేకులగూడెం - ఉనికిచర్ల - దేవన్నపేట - చింతగట్టు - పెగడపల్లి - వంగపహాడ్ - ఆరేపల్లి - మొగిలిచర్ల - కొత్తపేట - గొర్రెకుంట - గీసుకొండ శివారు - స్తంభంపల్లి - వెంకటాపూర్ - బొల్లికుంట - పున్నేలు - ఐనవోలు - తరాలపల్లి శివారు - నష్కల్ - కరుణాపురం వరకు రింగ్ రోడ్డును నిర్మించేం దుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వరంగల్ నగరం చుట్టూ దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ రోడ్డు మొత్తాన్ని డివైడర్లతో కలిపి ఆరు లేన్ల రహదారిగా నిర్మించనున్నారు. ఈ పద్ధతిలో రోడ్డు నిర్మాణం చేపడితే ప్రస్తుత అంచనాల ప్రకారం ఒక కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి 15 ఎకరాల స్థలం అవసరం అవుతుంది. దీంతో 80 కిలోమీటర్ల రహదారి కోసం దాదాపు 1200 ఎకరాల భూమిని నగరం చుట్టూ సేకరించడం ప్రధానం కానుంది. రూ.1500 కోట్ల వ్యయం వరంగల్ రింగ్ రోడ్డు నిడివి 70 - 80 కిలోమీటర్ల మధ్య ఉండనుంది. ఒక్కో కిలోమీటరు నిర్మాణానికి సగటున రూ.6.5 కోట్ల వ్యయం కానున్నట్లు తెలుస్తోంది. భూసేకరణ, మార్గమధ్యంలో వంతెనల నిర్మాణం కలుపుకుని మొత్తంగా రింగ్ నిర్మాణానికి రూ.1500 కోట్లు ఖర్చు అవనున్నట్లు అంచనా. ఇందులో కరుణాపురం - ఆరేపల్లి వరకు ఉన్న 29 కిలోమీటర్ల బిట్‌ను జాతీయ రహదారి - 163లో భాగంగా ఎన్‌హెచ్ సంస్థ చేపట్టనుంది. మిగిలిన రహదారి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉంది. -
కుడా ఇక.. బడా
పరిధి పెంపుపై ప్రభుత్వం దృష్టి రెట్టింపు కానున్న ఉద్యోగుల సంఖ్య సీఎం చెంతకు చేరిన ప్రతిపాదనలు హన్మకొండ: తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ‘కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ (కుడా) జవసత్వాలు కూడగట్టుకోనుంది. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న కుడాకు కష్టాలు తీరనున్నాయి. వరంగల్ నగరం, పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 1805 చదరపు కిలోమీటర్ల పరిధితో 1982లో ‘కుడా’ను ఏర్పాటు చేశా రు. కుడా పరిధిలోకి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 171 గ్రామా లు ఉన్నాయి. ఇందులో 27 గ్రామాలు కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నాయి. చైర్మన్, వైస్ చైర్మలతో పాటు మొత్తం పరిపాలన, ప్లానింగ్, అభివృద్ధి, అర్బన్ ఫారెస్ట్, భూసేకరణ, అకౌంట్స్ మొత్తం ఆరు విభాగాలతో కుడాను ఏర్పాటు చేశారు. మొత్తం 168 పోస్టులు మంజూరు చేశారు. అయితే గడిచిన ముప్పై ఏళ్లుగా ఉద్యోగులను భర్తీ చేయలేదు. కేవలం 46 మంది ఉద్యోగస్తులతో నెట్టుకొస్తోంది. దీంతో అభివృద్ధి పనుల్లో వేగం మందగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరంగల్.. రాష్ట్రంలో రెండో ప్రధాన నగరం హోదాలో ఉంది. నగర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉంది. మరోవైపు కుడా పరిధిలో జనాభా 7.6 లక్షల నుంచి 13 లక్షలకు చేరుకుంది. ఇటీవల నగర అభివృద్ధిపై సమీక్ష సందర్భంగా కుడాను బలోపేతం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఖాళీలన్నీ భర్తీ.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన హృదయ్, అమృత్, స్మార్ట్ సిటీలలో వరంగల్‌కు చోటు దక్కింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను వరంగల్‌లో నెలకొల్పబోతోంది. అంతేకాకుండా నగరంలో మురికివాడల్లో నివసిస్తున్న పేదల కోసం 30వేల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించనున్నారు. అంతేకాకుండా కుడా పరిధిని 1805 చదరపు కిలోమీటర్ల నుంచి 2300 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించాలని ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. దీంతో కుడాపై పని భారం అనూహ్యంగా పెరిగిపోనుంది. వీటన్నింటీని దృష్టిలో ఉంచుకుని గతంలో మంజూరై ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేయాలని సీఎం కే సీఆర్ నిర్ణయించారు. పెరిగిన జనాభా, అభివృద్ధి కార్యక్రమాలు, మాస్టర్‌ప్లాన్ ఆధారంగా అవసరమైన మేరకు కొత్త పోస్టులు సృష్టించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర మున్సిపల్ శాఖ సిద్ధం చేస్తోంది. ఈమేరకు త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
కునుకు తీస్తున్న ‘కుడా’
సాక్షి, హన్మకొండ : వరంగల్ నగరాన్ని అభివద్ధి పట్టాలపై పరుగులు పెట్టించేందుకు నెలకొల్పిన కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కునుకు తీస్తోంది. కుడా ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ పథకాలు ఆరంభశూరత్వంగా మారుతున్నాయి. ఆర్భాటాలకు పోయి కొత్త పథకాలు ప్రకటించడమే తప్ప... కార్యాచరణలో వాటిని పూర్తి చేయడం లేదు. పలువురు అధికారుల చేతివాటంతో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. నగరంలో లెక్కకు మిక్కిలిగా రోజుకో అక్రమ లే అవుట్లు వెలుస్తున్నా ‘కుడా’ అధికారులు పట్టించుకోవడం లేదు. మంగళవారం ‘కుడా’ కార్యాలయంలో వరంగల్ మునిసిపల్ కా ర్పొరేషన్, కుడా అధికారులతో వివిధ అభివద్ధి పనుల పురోగతి, కొత్త ప్రణాళికపై సమీక్ష సమావేశం నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం... రోప్‌వేలో నిర్లక్ష్యం భద్రకాళి-పద్మాక్షి-రీజనల్ సైన్స్ సెంటర్ల మధ్య రోప్‌వే నిర్మాణానికి గతంలో ప్రణాళిక రూపొం దించారు. పీపీపీ పద్ధతిలో దీన్ని నిర్మించేందుకు 2007లో ప్రణాళిక సిద్ధమైంది. నగరానికి మణిహారంలా నిలిచే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే జిల్లాలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుం ది. భక్తులు, పర్యాటకులు భద్రకాళి చెరువు మీదుగా పద్మాక్షి గుట్టకు చేరుకుని, అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత హంటర్‌రోడ్డులో గుట్టపై నిర్మించిన రీజనల్ సైన్స్ సెంటర్ వరకు రోప్‌వే ద్వారా చేరుకుంటారు. రీజనల్ సైన్స్ సెంటర్‌ను సందర్శించిన తర్వాత దానికి ఎదురుగా ఉన్న జూపార్కుకు పర్యాటకులు వెళ్లేలా ఓ చక్కని టూరిజం సర్క్యుట్లా దీన్ని రూపొందించారు. రోప్‌వే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 2007లో టెండర్లకు ఆహ్వానించగా... వైజాగ్ రోప్‌వే ప్రాజెక్టు చేసిన కోల్‌కతాకు చెందిన ఓ ప్రవేటు సంస్థ ముందుకొచ్చింది. ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు. భద్రకాళి చెరువు సమీపంలోనే మ్యూజికల్ గార్డెన్, ప్లానిటోరియం సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేలా ‘కుడా’ యంత్రాంగం నడుం బిగించాల్సిన అవసరం ఉంది. హెల్త్ స్పా ఎక్కడ?... హంటర్ రోడ్డులో ఆర్టీసీ టైర్ కంపెనీ పక్కన ఉన్న నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ‘కుడా’కు అప్పగించారు. ఈ స్థలంలో హెల్త్ స్పాను నిర్మించాలని ప్రతిపాదించారు. పీపీపీ పద్ధతిలో ఈప్రొక్యూర్మెంటు విధానంలో టెండర్లు నిర్వహించి, వదిలేశారు. ఈ క్రమంలో ఈ స్థలం కబ్జాకోరల్లో చిక్కుకుంటోంది. ఆహ్లాదం, ఆధ్యాత్మికం రెండింటిని కలుపుతూ భద్రకాళి చెరువు మధ్యలో రూ. 45 కోట్లలో పిరమిడ్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు 2007లో ‘కుడా’ ప్రణాళిక రూపొందించింది. బోట్ల ద్వారా ధ్యాన కేంద్రానికి వెళ్లివచ్చేలా పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా ఈ డిజైన్ రూపొందించింది. దేశాయిపేట చిన్నవడ్డేపల్లి చెరువును రూ 4.5 కోట్లతో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ‘కుడా’ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ సిద్ధం చేసింది. ఆ తర్వాతా వీటి ఊసు పట్టించుకునే వారే కరువయ్యారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అజంజాహి మిల్లు భూముల అమ్మకం ‘కుడా’ ఓ సిటీ వెంచర్ ప్రారంభించింది. దాదాపుగా 60 శాతం స్థలాలు విక్రరుుంచారు. మధ్య తరగతి వర్గాల కోసం హసన్‌పర్తి మండలం మునిపల్లిలో టౌన్ షిప్ ప్రాజెక్టు కోసం ప్రతిపాదించారు. సూమారు 45 ఎకరాల భూమి ఉంది. నాలుగున్నర ఏళ్లు దాటినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. హయగ్రీవాచారి మైదానంలో రూ.103 కోట్లతో షాపింగ్ కాంప్లెక్సు నిర్మించేందుకు ప్రతిపాదించారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేత శిలాఫలకం వేయించారు. తొమ్మిదేళ్లవుతున్న ఇంత వరకు షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి కాలేదు. ఆరోపణల వెల్లువ లే అవుట్ రెగ్యులరైజేషన్ పథకం అమల్లో ‘కుడా’ ఖజానాకు భారీగా గండిపడిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ద్వారా భూములపై యజమానులకు హక్కు కల్పించే సమయంలో పాత యాజమాన్య పత్రాలు, మార్కెట్ విలువను తక్కువగా చూపారనే విమర్శలు ఉన్నాయి. వీటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘కుడా’ పరిధిలో అనుమతులు లేకుండా 60కి పైగా లే అవు ట్లు ఉన్నట్లు అంచనా. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. -
మంత్రి తమ్ముడి తడాఖా
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్‌లోని శాయంపేటలో ప్రభుత్వ పాఠశాల పక్కనే 305/ఏబీ సర్వే నెంబర్లో 2.16 ఎకరాల స్థలముంది. 23 ఏళ్ల కిందట టీచర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ స్థలాన్ని కొనుగోలు చేసింది. కట్కు వీరయ్య నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. సొసైటీ అధ్యక్షుడు డోలి రాజలింగం పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. పట్టాదారు అడంగల్ పహాణీలో ఆయన పేరే ఉంది. ఈ స్థలంలో ప్లాట్లకు సంబంధించిన లేఅవుట్‌ను సైతం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆమోదించింది. సొసైటీ పరిధిలో 27 మంది సభ్యులు ఇక్కడి ప్లాట్లను కొనుగోలు చేశారు.. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. హద్దు రాళ్లు కూడా పాతుకున్నారు. కాలక్రమంలో ఈ స్థలానికి డిమాండ్ పెరిగింది. నగరం విస్తరించిన కొద్దీ.. శాయంపేట ఖరీదైన ప్రాంతంగా అవతరించింది. ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. 1991లో సొసైటీ సభ్యులు ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు ఇక్కడ చదరపు గజం రేటు కేవలం 40 రూపాయలే. ఇదే ప్రాంతం లో ఇప్పుడు గజం రూ.5000 నుంచి రూ.6000 ధర పలుకుతోంది. ఈ లెక్కన టీచర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరిట ఉన్న స్థలం విలువ రూ.5 కోట్లు దాటింది. అంత ఖరీదైన స్థలం కావడంతో మంత్రి తమ్ముడు దీనిపై కన్నేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఏళ్లకేళ్లుగా తమ స్వాధీనంలో ఉన్న భూములను ఈ ఏడాది మే నెలలో ఆయన పేరిట ఎలా మార్చారో అంతు చిక్కటం లేదని, బోగస్ రిజిస్ట్రేషన్ చేయించుకొని భూమి కబ్జాకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ‘రసుమతి హోటల్స్ లిమిటెడ్, బాలసముద్రం-హన్మకొండ’ చిరునామాతో మేనేజింగ్ డెరైక్టర్ రామ్మోహన్ పేరిట రిజిస్ట్రేషన్ జరిగిందని.. ప్లాట్ల యజమానులకు సంబంధం లేకుండా అక్రమంగా ఈ రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందో ఆరా తీయాలని డిమాండ్ చేస్తున్నారు. హద్దురాళ్లు తొలగించి దౌర్జన్యానికి పాల్పడుతున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, తమ లేఅవుట్ ప్లాట్లకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పాటు... ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇవ్వడంతో ఈ బాగోతం బట్టబయలైంది.