కుడా ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మ్యాప్
కునారిల్లుతున్న ‘కుడా’
Published Wed, Nov 2 2016 2:56 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
ప్రతిపాదనల్లోనే భారీ ప్రాజెక్టులు
వేధిస్తున్న అధికారులు, సిబ్బంది కొరత
కుంటుపడుతున్న మహానగర అభివృద్ధి
చైర్మన్ యాదవరెడ్డి ముందు సవాళ్లు ఎన్నో..
వరంగల్ అర్బన్ : హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరాభివృద్ధి సంస్థగా పేరున్న కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) కునారిల్లుతోంది. రూ.కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందిస్తున్నా అధికారులు, సిబ్బంది కొరత తదితర కారణాలతో పట్టాలెక్కడం లేదు. ఈ తరుణంలో ‘కుడా’ 9వ చైర్మన్ గా మర్రి యాదవరెడ్డి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ‘కుడా’ ఇంత వరకు చేపట్టిన వాటిలో నత్తను మరిపిస్తున్న కొన్ని కీలక ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రత్యేక కథనం.
అమలులోకి రాని కొత్త మాస్టర్‌పాన్ ..
43 ఏళ్లు గడిచినా మాస్టర్‌ప్లాన్ రివైడ్జ్ కు నోచుకోవడం లేదు. పదిహేను ఏళ్లకోమారు రివైడ్జ్ చేసే మాస్టర్‌ప్లాన్ కు ఇంకా మోక్షం కలగడం లేదు. ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉంటోది. ప్రస్తుతం కుడా బోర్డు ఆమోదం పొంది, ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిన కొత్తమాస్టర్ ప్లాన్ ముసాయిదా కొన్ని మార్పులు చేర్పులకు వెనక్కి వచ్చింది. దీనిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. భూ మార్పిడిలు తదితర పనుల కోసం నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ వరంగల్‌ను స్మార్ట్‌సిటీ, హృదయ్, అమృత్ లాంటి కీలక పథకాలు వర్తించాయి. కొత్త మాస్టర్‌ప్లాన్ తోనే ఈ బృహత్తర పథకాలు ముడిపడి ఉన్నాయి. మాస్టర్‌ప్లాన్ ను త్వరితగతిన అమల్లోకి తీస్తే మహానగరం మరింత పురోగతి సాధించే ఆస్కారం ఉంటుంది.
మాటల్లోనే ఇన్నర్, ఔటర్‌రింగ్ రోడ్డు..
200 అడుగుల ఔటర్ రింగ్ రోడ్డుపై నిర్లక్ష్యం నీడలు అలుముకున్నాయి. 1972 మాస్టర్‌ప్లాన్ లో పొందుపరిచిన ఇన్నర్ రింగ్ రోడ్డు, తాజాగా ప్రతిపాదించిన ఔటర్‌రింగ్ రోడ్డుకు అడుగులు పడడం లేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు భూ సేకరణ కోసం వరంగల్ ఆర్డీఓ ఖాతాలో జమ చేసిన రూ. 20 కోట్లు మూలుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.2 వేల కోట్ల మేరకు నిధులు అవసరం అధికారులు చెబుతున్నారు. భారీ నిధులతో కూడిన ఈ ప్రాజెక్టుకు నిధులు, భూసేకరణ సమస్యగా మారింది.
ప్రతిపాదనల్లోనే పద్మాక్షి రోప్‌వే..
ఓరుగల్లులో కలికితురాయిగా నిలుస్తున్న పద్మాక్షి రోప్ వే ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మ గ్గుతోంది. కుడా ఆధ్వర్యంలో భద్రకాళి గుట్ట నుంచి పద్మాక్ష్మి గుట్ట వరకు రోప్ వే నిర్మా ణం చేపట్టాలని చేసిన ప్రతిపాదనలకు అనేక అడ్డంకులు తలెత్తాయి. రూ.15 కోట్ల తో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టును 1.7 మీటర్ల దూరంలో నిర్మించాలని భావించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. రోప్‌వే నిర్మాణం పూర్తయితే పర్యాటకులను విశేషంగా అకట్టుకోనుంది.
మరికొన్ని ప్రాజెక్టులు..
ఓ సిటీ ప్రాజెక్టు విజయవంతం కావడంతో కుడా అధికారులు నగర శివారు మునిపల్లిలో టౌ¯ŒSషిప్‌ను ప్రతిపాదించారు. 200 ఎకరాల భూమి రెవెన్యూ శాఖ ఇచ్చింది. టౌన్ షిప్ పనుల పక్రియ పూర్తయింది. కానీ, ఓ సిటీలో మిగిలిన ప్లాట్లు, మునిపల్లి ప్లాట్లను వేలం వేయడంలో అధికారులు ఉదాసీనవైఖరి అవలంబిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హంటర్ రోడ్డులోని జూపార్కు ఎదుట ఉన్న సై¯Œ్స సెంటర్ పనులు తుది రూపునకు చేరలేదు. హన్మకొండ అంబేద్కర్ భవన్ పక్కన 2007లో బీఓటీ పద్ధతిన చేపట్టిన బహుళ అంతస్తు ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. భద్రకాళి దేవాలయం వద్ద ప్రతిపాదించిన పిరమిడ్ ధ్యాన కేంద్రం డీపీఆర్‌కే పరిమితమైంది. ఉర్సు రంగసముద్రం, బంధం చెరువు, చిన్నవడ్డేపల్లి చెరువు, నగరంలోని ముఖ్య జంక్షన్లు, మాస్టర్‌ప్లాన్ రోడ్ల విస్తరణకు సంబంధించిన కొన్ని పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. మరికొన్ని పనులు ప్రారంభం కాకపోవడం ‘కుడా’ పనితీరుకు నిలువుటద్దంగా నిలుస్తోంది.
పైసలిస్తేనే ఫైళ్లు ముందుకు..
భూమార్పిడిలు, లే ఔట్లు, ఎల్‌ఆర్‌ఎస్ తదితర వాటి కోసం ‘కుడా’ కార్యాలయంలో కాసులు అప్పగిస్తేనే ఫైళ్లు ముందుకు కదులుతున్నాయని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. లేదంటే ప్రజలు నెలల తరబడి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఫలానా అధికారి, ఉద్యోగి వద్ద ఫైల్ ఉందంటూ, క్షేత్ర స్థాయి తనిఖీలు చేయాలంటూ ప్రజలకు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘కుడా’ ను అధికారులు, సిబ్బంది లేమి వేధిస్తోంది. మొత్తంగా 100 మంది అధికారులు, ఉద్యోగులకు 40 మందే ఉన్నారు. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ పైళ్లు, భూమార్పిడి, లేఔట్ ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. అధికారులు మాత్రం సిబ్బంది కొరతతో పనుల్లో జాప్యం జరుగుతోందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘కుడా’ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న యాదవరెడ్డి పరిపాలనను పరుగెత్తించాల్సిన అవసరం ఉంది.
Advertisement
Advertisement