సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) మాస్టర్‌ప్లాన్‌కు తుదిరూపునిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. పట్టణాల సమగ్రాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్లు దిక్సూచిలా పనిచేస్తాయని అన్నారు. వరంగల్ మాస్టర్‌ప్లాన్ ముసాయిదా(డ్రాప్ట్ మాస్టర్‌ప్లాన్)పై కుడా పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో శనివారం హైదరాబాద్‌లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ కీలకమని, భవిష్యత్తు తరాలకు ఉపయోపడేలా, సమగ్ర అభివృద్ధి సాధించేలా ఇవి ఉండాలని సూచించారు. ఈ మాస్టర్‌ప్లాన్‌పై వివిధ వర్గాల నుంచి సుమారు నాలుగు వేల వరకు సూచనలు, సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. వీటన్నింటినీ క్రోడీకరించి డ్రాఫ్ట్‌ను తయారు చేసినట్లు చెప్పారు. 2041 సంవత్సరం వరకు అవసరాలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించామని కేటీఆర్ తెలిపారు.
చరిత్ర చెరిగిపోకుండా...
వరంగల్ నగర చరిత్ర, పర్యావరణ, పురావస్తు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ, చెరువులు, రోడ్లు, కాలనీల అభివృద్ధిపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ ఆమోదం అనంతరం జీఐఎస్‌తో అనుసంధానం చేస్తామన్నారు. మాస్టర్‌ప్లాన్ పొందుపరిచిన అంశాల పరిశీలనకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గానికో నోడల్ అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. ఈ నోడల్ అధికారి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చే సలహాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
ఔటర్ రింగ్‌రోడ్డును అనుసంధానిస్తూ రేడియల్ రోడ్లను నిర్మిస్తామని, దీంతో ఓరుగల్లు ముఖచిత్రమే మారిపోనుందని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్రోత్ కారిడార్లు, ఇండ్రస్టియల్ జోన్లను కూడా పొందుపరిచినట్లు చెప్పారు. పట్టణావసరాలకు అనుగుణంగా కుడా యంత్రాంగం పనితీరును మార్చుకోవాలని, అవసరమైన నిధులను సమీకరించుకునేలా ప్రణాళికలు రచించాలన్నారు. హెచ్‌ఎండీఏ తరహాలో ల్యాండ్ పూలింగ్, భూహక్కుల బదిలీ విధానం తదితర కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మాస్టర్‌ప్లాన్ విశిష్టత, ఎక్కడెక్కడ ఏయే జోన్లను పొందుపరిచారనే దానిపై మంత్రి కేటీఆర్ వివరించారు.
సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు రుణవిమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరి్వంద్ కుమార్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, కుడా వైస్ చైర్మన్ ఎన్.రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment