ఓరుగల్లుకు మోనో లేదా మెట్రో! | KTR Comments On Warangal Metro | Sakshi
Sakshi News home page

ఓరుగల్లుకు మోనో లేదా మెట్రో!

Published Thu, Mar 12 2020 2:06 AM | Last Updated on Thu, Mar 12 2020 5:05 AM

KTR Comments On Warangal Metro - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. వరంగల్‌లో 15 కిలోమీటర్ల మోనో రైలు మార్గంతో పాటు హైదరాబాద్‌ తరహాలో మెట్రో రైలు మార్గం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. మామునూర్‌ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందన్నారు. వరంగల్‌ నగరాభివృద్ధిపై బుధవారం ఆయన శాసనసభ కమిటీ హాల్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌తో కలసి ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా) మాస్టర్‌ ప్లాన్‌కు ఈ సమావేశంలో కేటీఆర్‌ ఆమోదించారు. 2020–41 వరకు భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మాస్టర్‌ ప్లాన్‌తో నగర రూపురేఖలు మారిపోతాయని, గొప్ప నగరాల జాబితాలో వరంగల్‌ చేరుతుందని ఈ సందర్భంగా కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

జూన్‌ 2న ప్రారంభించాలి..: ఇక నగరానికి మంజూరైన 68 కిలోమీటర్ల రింగ్‌ రోడ్డులో 29 కిలోమీటర్ల మేర పనులు మే నెల చివరి నాటికి పూర్తి చేసి, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న ప్రారంభించాలని కేటీఆర్‌  అధికారులను ఆదేశించారు. వరంగల్‌ స్మార్ట్‌ సిటీ పనులు ఎంతవరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్‌ సిటీ పనుల్లో భాగంగా వెంటనే నగరంలో 1,000 పబ్లిక్‌ టాయిలెట్లను దసరాలోపు నిర్మించాలని ఆదేశించారు. నగరంలో 250 పబ్లిక్‌ టాయిలెట్లు మాత్రమే ఉన్నాయని, ప్రభుత్వ స్థలాల్లో, కార్యాలయాల్లో వెయ్యి టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పందుల నివారణకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించి, పందుల పెంపకందార్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలన్నారు. ప్రజా ప్రతినిధులు పందుల పెంపకందార్లను ఒప్పించాలన్నారు. 

దసరా నాటికి ఇళ్లు
సీఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటనలో ఇచ్చిన హామీల అమలు వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు. నగరానికి మంజూరు చేసిన 3,900 డబుల్‌ బెడ్రూం ఇళ్లను దసరా నాటికి యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలన్నారు. పూర్తైన 900 ఇళ్లను త్వరలో ప్రారంభించాలన్నారు. మిగిలిన 3,000 ఇళ్లలో 2,200 ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, కేవలం 800 ఇళ్లు స్థానిక సమస్యలతో ప్రారంభం కాలేదని స్థానిక ఎమ్మెల్యేలు కేటిఆర్‌ దృష్టికి తెచ్చారు. ఈ ఇళ్లను ప్రారంభించలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు. కాళోజి కళాక్షేత్రం, ఏకశిలా పార్క్‌ నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య ప్రణాళిక, హరిత ప్రణాళిక, ఎనర్జీ ఆడిట్‌ పూర్తి చేయాలన్నారు. ఎనర్జీ ఆడిట్‌లో భాగంగా నగరంలో తుప్పుపట్టిన, వంగిన స్తంబాలు, వేలాడే వైర్లు, ప్రమాదకరంగా మారిన ట్రాన్స్‌ ఫార్మర్లను మార్చాలన్నారు. 

16న మరోసారి భేటీ..
వరంగల్‌ నగరం మరింతగా అభివృద్ధి కానున్న నేపథ్యంలో నగరానికి నాలుగు వైపుల డంపింగ్‌ యార్డులు గుర్తించాలని కేటీఆర్‌ కోరారు. ప్రస్తుత డంపింగ్‌ యార్డులో బయో మైనింగ్‌ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్‌లో కలసిన శివారు ప్రాంతాలకు మూడో వంతు నిధులు కేటాయించి ఖర్చు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని, శివారు ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేషన్‌ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ నెల 16న మరోసారి సమావేశమై ముఖ్యమైన అంశాల మీద చర్చిస్తామని.. అధికారులు సమగ్ర సమాచారంతో ఆ సమావేశానికి రావాలన్నారు. సమావేశంలో చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్, కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement