సాక్షి, వరంగల్: అన్నీ అనుకూలిస్తే చారిత్రక ఓరుగల్లులోనూ హైదరాబాద్ మాదిరిగా మెట్రో రైలు పరుగులు తీయనుంది. ట్రై సిటీని అనుసంధానిస్తూ నిర్మించనున్న మెట్రో నియో రైలు ప్రతిపాదనలపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఇటీవల వరంగల్ మెట్రో రైలు ప్రాజెక్టుపై మహా మెట్రో ఉన్నతధికారులతో సమావేశమై చర్చించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌కు చెందిన మహా మెట్రో, హెచ్‌ఎండీఎ అధికారుల బృందం బుధవారం వరంగల్ నగరాన్ని సందర్శించింది. మెట్రో రైలు ప్రతిపాదన మార్గాలు, డీపీఆర్ తయారీ తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు.
మెరుగైన రవాణా కోసం
వరంగల్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. అయితే, ప్రజారవాణా వ్యవస్థలో భాగంగా ఆర్టీసీ సిటీ బస్సులు తగినన్ని లేవనే చెప్పాలి. దీంతో ప్రజలు ఎక్కువగా ఆటోలు, సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్‌లోనూ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు హెచ్‌ఎండీఏ ట్రాన్స్‌పోర్ట్ హెడ్ విజయలక్ష్మి, హెచ్‌ఎండీఏ డిప్యూటీ డైరెక్టర్ ఎస్కే సిన్హా, ‘కుడా’ ప్లానింగ్ అధికారి అజిత్ రెడ్డితో కలిసి బుధవారం క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు. కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి పెట్రోల్ పంపు, హన్మకొండ చౌరస్తా, మలుగు రోడ్డు, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామ జంక్షన్ మీదుగా వరంగల్ రైల్వేస్టేషన్ వరకు, అక్కడి నుంచి వరంగల్ స్టేషన్ రోడ్డు మీదుగా చౌరస్తా జేపీఎన్ రోడ్డు మీదుగా పోచమ్మ మైదాన్ వరకు ప్రధాన రహదారిని మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి పరిశీలించి వివరాలు ఆరా తీశారు.
మూడు కేటగిరీలపై చర్చ
ట్రైసిటీలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలపై పర్యవేక్షించాక అధికారుల బృందం... జిల్లా కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డితో పాటు బల్దియా ‘కుడా’ అధికారులు పాల్గొన్నారు. మహా మెట్రో, హెచ్‌ఎండీఏ అధికారులు మెట్రో ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను వెల్లడించారు. కేంద్ర పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇటీవల నాసిక్‌లో మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభించిందని తెలిపారు. ఈ మేరకు న్యూ మెట్రో నియో ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50శాతం నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
అలాగే పబ్లిక్, ప్రైవేట్, పార్ట్‌నర్ షిప్(పీపీపీ) పద్ధతి, గ్లోబల్ ఫైనాన్సియల్ సంస్థలు నుంచి 60శాతం నిధులను రుణంగా తీసుకోవచ్చని వివరించారు. మిగతా 40శాతం నిధుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం వెచ్చించాల్సి ఉంటుంవదని వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ నగర జనాభా, రహదారుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెట్రో ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
మెట్రో నియో రైలు మార్గాలు ఇవే...
- కాజీపేట రైల్వేస్టేషన్ ప్రారంభమై ఫాతిమానగర్, సుబేదారి, నక్కలగుట్ట, అంబేద్కర్ జంక్షన్, పెట్రోల్ పంపు, హన్మకొండ చౌరస్తా, మలుగు రోడ్డు, ఎంజీఎం, పోచమ్మమైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామ జంక్షన్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు.
- వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి స్టేషన్ రోడ్డు, వరంగల్ చౌరస్తా, జీపీఎన్ రోడ్డు, మండి బజార్, పోచమ్మమైదాన్ వరకు అనుసంధానంగా ప్రాజెక్టు నిర్మిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment