warangal development
-
మహిళల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు
సాక్షి ప్రతినిధి, వరంగల్: మహిళల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారం వరంగల్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సభ’లో ఆయన మాట్లాడారు. మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రూ.6వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఇది మహిళలు ఏది కావాలంటే అది అమలు చేసే ప్రభుత్వమని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతాం: పొంగులేటి ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నూటికి నూరు శాతం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన తెలంగాణకో వరం: కోమటిరెడ్డి మూసీ ప్రక్షాళన తెలంగాణకు గొప్ప వరమని, ప్రధానంగా ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న నల్లగొండతో పాటు పలు ప్రాంతాలకు చెందిన లక్షలాది మందికి మేలు జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిన గత పాలకు లు మూసీ కోసం రూ.7 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. వైఎస్ స్ఫూర్తితో ముందుకు: సీతక్క, కొండా సురేఖ నాడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహిళా సమాఖ్యలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చి ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తే, నేడు వడ్డీలేని రుణాతోపాటు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత అంత గొప్ప దయగల నేత, సీఎం రేవంత్‌రెడ్డి అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి సీఎం కృషి: టీపీసీసీ చీఫ్ వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.6,000 కోట్లు కేటాయించడం చరిత్రలో రికార్డని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. సభలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె.కేశవరావు, సలహాదారు శ్రీనివాసరాజు, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కావ్య, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, మధుసూదనాచారి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఓరుగల్లుకు మోనో లేదా మెట్రో!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. వరంగల్‌లో 15 కిలోమీటర్ల మోనో రైలు మార్గంతో పాటు హైదరాబాద్ తరహాలో మెట్రో రైలు మార్గం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. మామునూర్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందన్నారు. వరంగల్ నగరాభివృద్ధిపై బుధవారం ఆయన శాసనసభ కమిటీ హాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో కలసి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) మాస్టర్ ప్లాన్‌కు ఈ సమావేశంలో కేటీఆర్ ఆమోదించారు. 2020–41 వరకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్‌తో నగర రూపురేఖలు మారిపోతాయని, గొప్ప నగరాల జాబితాలో వరంగల్ చేరుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 2న ప్రారంభించాలి..: ఇక నగరానికి మంజూరైన 68 కిలోమీటర్ల రింగ్ రోడ్డులో 29 కిలోమీటర్ల మేర పనులు మే నెల చివరి నాటికి పూర్తి చేసి, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రారంభించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వరంగల్ స్మార్ట్ సిటీ పనులు ఎంతవరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా వెంటనే నగరంలో 1,000 పబ్లిక్ టాయిలెట్లను దసరాలోపు నిర్మించాలని ఆదేశించారు. నగరంలో 250 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే ఉన్నాయని, ప్రభుత్వ స్థలాల్లో, కార్యాలయాల్లో వెయ్యి టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పందుల నివారణకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించి, పందుల పెంపకందార్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలన్నారు. ప్రజా ప్రతినిధులు పందుల పెంపకందార్లను ఒప్పించాలన్నారు. దసరా నాటికి ఇళ్లు సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో ఇచ్చిన హామీల అమలు వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు. నగరానికి మంజూరు చేసిన 3,900 డబుల్ బెడ్రూం ఇళ్లను దసరా నాటికి యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలన్నారు. పూర్తైన 900 ఇళ్లను త్వరలో ప్రారంభించాలన్నారు. మిగిలిన 3,000 ఇళ్లలో 2,200 ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, కేవలం 800 ఇళ్లు స్థానిక సమస్యలతో ప్రారంభం కాలేదని స్థానిక ఎమ్మెల్యేలు కేటిఆర్ దృష్టికి తెచ్చారు. ఈ ఇళ్లను ప్రారంభించలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. కాళోజి కళాక్షేత్రం, ఏకశిలా పార్క్ నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య ప్రణాళిక, హరిత ప్రణాళిక, ఎనర్జీ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. ఎనర్జీ ఆడిట్లో భాగంగా నగరంలో తుప్పుపట్టిన, వంగిన స్తంబాలు, వేలాడే వైర్లు, ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ ఫార్మర్లను మార్చాలన్నారు. 16న మరోసారి భేటీ.. వరంగల్ నగరం మరింతగా అభివృద్ధి కానున్న నేపథ్యంలో నగరానికి నాలుగు వైపుల డంపింగ్ యార్డులు గుర్తించాలని కేటీఆర్ కోరారు. ప్రస్తుత డంపింగ్ యార్డులో బయో మైనింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్లో కలసిన శివారు ప్రాంతాలకు మూడో వంతు నిధులు కేటాయించి ఖర్చు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, శివారు ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేషన్ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ నెల 16న మరోసారి సమావేశమై ముఖ్యమైన అంశాల మీద చర్చిస్తామని.. అధికారులు సమగ్ర సమాచారంతో ఆ సమావేశానికి రావాలన్నారు. సమావేశంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మేయర్ గుండా ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
‘ఉద్యమకారులకు నామినేటెడ్ పోస్టులు’
వరంగల్: హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న ఐదేళ్లలో రూ.5 వేల కోట్లతో గ్రేటర్ వరంగల్ అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్, ఓరుగల్లు కారిడార్ లో పరిశ్రమల స్థాపనకు కృషి చేయనున్నట్టు తెలిపారు. జిల్లాకు చెందిన ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ తప్పక న్యాయం చేస్తారని ఆయన తెలిపారు. త్వరలో మరోసారి చేపట్టబోయే నామినేటెడ్ పోస్టుల భర్తీలో వారికి సముచిత స్థానం కల్పిస్తారని భరోసా ఇచ్చారు. టెక్స్ టైల్ పార్క్ వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. బుధవారం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్‌గా మర్రి యాదవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగరంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, వరంగల్ మేయర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
'వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్, రింగ్‌రోడ్డు'
వరంగల్: త్వరలో వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్, రింగ్‌రోడ్డు నిర్మాణం చేపడతామని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం వరంగల్ జిల్లా అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు. 15 శాతం ఆర్థికాభివృద్ధితో తెలంగాణ దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బడ్జెట్లో వరంగల్‌కు ఏటా 300 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంజీఎంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు తొలగించి కొత్త భవనాలను నిర్మించాలని కేసీఆర్ పేర్కొన్నారు. -
హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ అభివృద్ధి: కేసీఆర్
హైదరాబాద్ నగరానికి ప్రత్యామ్నాయంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసే యూనివర్సిటీలు, సంస్థలు, ఐటీ కంపెనీలు అన్నీ వరంగల్ జిల్లాకే వస్తాయని ఆయన చెప్పారు. వరంగల్ ప్రధాన రహదారులను 150 అడుగుల మేరకు విస్తరిస్తామన్నారు. వరంగల్ జిల్లా సమీక్షలో ఆయనీ వివరాలు వెల్లడించారు. కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వీటికి ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో ఉన్న కాకతీయుల వారసులను కూడా ఆహ్వానిస్తామని కేసీఆర్ చెప్పారు. మైసూరు దసరా ఉత్సవాల తరహాలో కాకతీయ ఉత్సవాలు ఉంటాయన్నారు. పార్లమెంటులో ఝాన్సీ లక్ష్మీబాయి ఫొటో ఉన్నట్లే.. రాణి రుద్రమదేవి ఫొటో పెట్టాల్సిందిగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. మిషన్ కాకతీయ ప్రారంభానికి సూచికగా హన్మకొండ వడ్డేపల్లి చెరువు వద్ద పైలాన్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. మామూనూరు విమానాశ్రయం పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.