వరంగల్ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి ప్రతినిధి, వరంగల్: మహిళల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారం వరంగల్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సభ’లో ఆయన మాట్లాడారు. మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రూ.6వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఇది మహిళలు ఏది కావాలంటే అది అమలు చేసే ప్రభుత్వమని పేర్కొన్నారు.
ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతాం: పొంగులేటి
ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నూటికి నూరు శాతం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
మూసీ ప్రక్షాళన తెలంగాణకో వరం: కోమటిరెడ్డి
మూసీ ప్రక్షాళన తెలంగాణకు గొప్ప వరమని, ప్రధానంగా ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న నల్లగొండతో పాటు పలు ప్రాంతాలకు చెందిన లక్షలాది మందికి మేలు జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిన గత పాలకు లు మూసీ కోసం రూ.7 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు.
వైఎస్ స్ఫూర్తితో ముందుకు: సీతక్క, కొండా సురేఖ
నాడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహిళా సమాఖ్యలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చి ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తే, నేడు వడ్డీలేని రుణాతోపాటు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత అంత గొప్ప దయగల నేత, సీఎం రేవంత్‌రెడ్డి అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
మహిళల అభ్యున్నతికి సీఎం కృషి: టీపీసీసీ చీఫ్
వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.6,000 కోట్లు కేటాయించడం చరిత్రలో రికార్డని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. సభలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె.కేశవరావు, సలహాదారు శ్రీనివాసరాజు, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కావ్య, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, మధుసూదనాచారి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment