రూ. 1500 కోట్లతో ప్రతిపాదనలు
డీపీఆర్ సిద్ధం చేస్తున్న ఏకాం సంస్థ
దాదాపు 80 కిలోమీటర్ల నిడివితో ప్రణాళిక
జాతీయ రహదారి పరిధిలో 23 కిలోమీటర్లు
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వరంగల్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) మాస్టర్ ప్లాన్ - 2030కి అనుగుణంగా నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు సమగ్ర నివేదిక రూపొందించే పనులు ఏకాం అనే సంస్థకు అప్పగించారు.
హన్మకొండ : వరంగల్ నగరం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ద శాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో ‘కుడా’ మాస్టర్ ప్లాన్-2013 ప్రకారం నివేదిక సిద్ధం చేశారు. అయితే, హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో పెద్ద నగరం కావడం భవిష్యత్‌లో టెక్స్‌టైల్స్ పార్కు, ఇండస్ట్రియల్ కారిడార్, ఐటీ పరిశ్రమలు వరంగల్ చుట్టూ నెలకొల్పనున్న నేపథ్యంలో పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మించే రింగ్ రోడ్డు భవిష్యత్ అవసరాలను తీర్చలేదనే అనుమనాలు వ్యక్తమయ్యాయి. దీంతో కుడా మాస్టర్ ప్లాన్ 2030 ప్రకారం మరో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ పనులు న్యూ ఢిల్లీకి చెందిన ‘ఏ కాం’ అనే సంస్థకు అప్పగించారు. ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మం, నర్సంపేట, కరీంనగర్‌ల నుంచి నగరానికి నిత్యం వచ్చిపోయే వాహనాల రద్దీపై సర్వే నిర్వహించారు. వీటి ఆధారంగా ఆగస్టు చివరికల్లా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కీలకంగా స్థల సేకరణ
వరంగల్ రింగ్ రోడ్డును హైదరాబాద్ మార్గంలో కరుణాపురం - ధర్మసాగర్ శివారు - టేకులగూడెం - ఉనికిచర్ల - దేవన్నపేట - చింతగట్టు - పెగడపల్లి - వంగపహాడ్ - ఆరేపల్లి - మొగిలిచర్ల - కొత్తపేట - గొర్రెకుంట - గీసుకొండ శివారు - స్తంభంపల్లి - వెంకటాపూర్ - బొల్లికుంట - పున్నేలు - ఐనవోలు - తరాలపల్లి శివారు - నష్కల్ - కరుణాపురం వరకు రింగ్ రోడ్డును నిర్మించేం దుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వరంగల్ నగరం చుట్టూ దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ రోడ్డు మొత్తాన్ని డివైడర్లతో కలిపి ఆరు లేన్ల రహదారిగా నిర్మించనున్నారు. ఈ పద్ధతిలో రోడ్డు నిర్మాణం చేపడితే ప్రస్తుత అంచనాల ప్రకారం ఒక కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి 15 ఎకరాల స్థలం అవసరం అవుతుంది. దీంతో 80 కిలోమీటర్ల రహదారి కోసం దాదాపు 1200 ఎకరాల భూమిని నగరం చుట్టూ సేకరించడం ప్రధానం కానుంది.
రూ.1500 కోట్ల వ్యయం
వరంగల్ రింగ్ రోడ్డు నిడివి 70 - 80 కిలోమీటర్ల మధ్య ఉండనుంది. ఒక్కో కిలోమీటరు నిర్మాణానికి సగటున రూ.6.5 కోట్ల వ్యయం కానున్నట్లు తెలుస్తోంది. భూసేకరణ, మార్గమధ్యంలో వంతెనల నిర్మాణం కలుపుకుని మొత్తంగా రింగ్ నిర్మాణానికి రూ.1500 కోట్లు ఖర్చు అవనున్నట్లు అంచనా. ఇందులో కరుణాపురం - ఆరేపల్లి వరకు ఉన్న 29 కిలోమీటర్ల బిట్‌ను జాతీయ రహదారి - 163లో భాగంగా ఎన్‌హెచ్ సంస్థ చేపట్టనుంది. మిగిలిన రహదారి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉంది.
గ్రేటర్‌కు ఔటర్ హారం
Published Fri, Jul 15 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM
Advertisement