3వ ప్రభాగ్ సమితిలోగుడిసెల క్రమబద్ధీకరణకు పచ్చజెండా
భివండీ, న్యూస్‌లైన్ : భివండీ నిజాంపూర్ షహర్ మహానగర్ పాలిక మూడో ప్రభాగ్ సమితి పరిధిలోని గుడిసెలను క్రమబద్దీకరించేందుకు కమిషనర్ అంగీకరించారు. సోమవారం ఈ మేరకు కమిషనర్ నిర్ణయం తీసుకున్నారని కార్పొరేటర్ సంతోష్ ఎం.శెట్టి మంగళవారం తెలిపారు. కొన్నేళ్ల కిందట వెలసిన ఈ గుడిసెవాసులు కార్పొరేషన్‌కు క్రమం తప్పకుండా పన్ను కడుతున్నారు. అయితే వారి పన్ను పత్రాలపై ‘అక్రమంగా వెలసిన గుడిసెలు’ అని కార్పొరేషన్ అధికారులు ముద్ర వేశారు. ఆ ముద్రను తొలగించాలని 2008 నుంచి స్థానిక కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఒక్క గుడిసెకు రూ.60 ఉన్న పన్నును రూ.500 నుంచి రూ.600 వరకు పెంచారు.
అయినప్పటికీ గుడిసెవాసులు ఆ మొత్తాన్ని పన్నుగా చెల్లిస్తున్నారని, కానీ అక్రమ గుడిసెలు అన్న ముద్రను మాత్రం తొలగించలేదని సంతోష్ శెట్టి చెప్పారు. సోమవారం జరిగిన కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని కార్పొరేటర్లు సంతోష్ శెట్టితో పాటు మేయర్ తుషార్ చౌదరి, కార్పోరేటర్లు నిలేష్ చౌదరి, ప్రభాగ్ సమితి మూడు సభాపతి లలిత నితిన్ భజాగే, హనుమాన్ చౌదరి, కమ్లాకర్ పాటిల్, అల్కా నారాయణ్ చౌదరి, పూనం పాటిల్‌లు లేవనెత్తారు. వెంటనే అక్రమ అనే ముద్రను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కమిషనర్ జీవన్ సోనావునే ఆ ముద్రను తొలగించేందుకు అంగీకరించారని సంతోష్ శెట్టి చెప్పారు.
కమిషనర్ ప్రకటన పట్ల ప్రభాగ్ సమితి మూడు పరిధిలోని వేలాది మంది తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. గుడిసెలపై అక్రమ ముద్రను తొలగించి, క్రమబద్ధీకరించేందుకు అంగీకరించిన కమిషనర్ జీవన్ సోనావునేను పలువురు తెలుగు ప్రముఖులు సన్మానించారు. మంగళవారం ఉదయం కార్పొరేషన్ ముఖ్య కార్యాలయంలో కామత్‌ఘర్ సేవ సమితి అధ్యక్షులు సుదామ్ సావంత్, సచ్చిన వేలేకర్, మామిడాల మల్లేశం, డాక్టర్ సదానందం, డాక్టర్ చెన్న రాజమల్లయ్య, తదితర్లు కమిషనర్ జీవన్ సోనావునేకు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తుషార్ చౌదరికి, సంతోష్ ఎమ్. శెట్టితో పాటు ఇతర కార్పొరేటర్లకు అభినందనలు తెల్పినారు.