
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. నిన్న ఎనిమిది గంటల పాటు విచారించిన ఈడీ.. నేడు కూడా మరోసారి విచారణకు రావాలని తెలిపింది. మహేశ్వరం మండలం నాగరంలో 42 ఎకరాల భూమి కేటాయింపుపై అమోయ్ కుమార్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది.
గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్ 50 ఎకరాల భూదాన్ భూములను అన్యాక్రాంతం చేశాడు. విజిలెన్స్ విచారణలో అమోయ్ కుమార్ బాగోతం బయటపడింది. విజిలెన్స్ అధికారులు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగారంలోని సర్వే నెంబర్ 181, 182 లోని 102.2 ఎకరాలపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. అందులో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు చెందినదని బోర్డ్ వాదిస్తోంది.
ఇక, ఈ భూమి జబ్బార్దస్త్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. తర్వాత ఆయన కొడుకు హజీఖాన్ 50 ఎకరాల ల్యాండ్‌ను భూదాన్ బోర్డుకి దానం చేశాడు. 2021లో హజీఖాన్ వారుసురాలిని అంటూ 40 ఎకరాలు తనదేనని ఖాదురున్నీసా దరఖాస్తు చేసుకుంది. క్షేత్ర స్థాయిలో ఆర్డీవో, తహశీల్దార్, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్ ఖాదురున్నీసాకు అనుకూలంగా ఉండి.. ఆఘమేఘాల మీద ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మారు. దీంతో ఎన్నికల సమయంలో భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ భూమిపై క్రయవిక్రయాలు చేయకుండా ధరణిలో నిషేధిత జాబితాలో పెట్టారు అధికారులు. దీంతో, ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. మరోవైపు ఈ కేసులో ఈడీ.. ఎమ్మార్వో జ్యోతి, ఆర్డీవోను సైతం నేడు విచారించే అవకాశం ఉంది.

Comments
Please login to add a commentAdd a comment