ప్రజోపయోగాలకే భూదాన్ భూములు
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: భూదాన్ భూముల విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భూదాన్ భూములను నిరుపేదలకు వ్యవసాయం, స్థానిక సంస్థలు చేపట్టే ప్రజోపయోగ అవసరాల (స్కూలు, పంచాతీయ కార్యాలయం తదితరాలు) నిమిత్తం తప్ప, ఇతర ఏ అవసరాలకు కేటాయించడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూదాన్, గ్రామ్‌దాన్ చట్టానికి చేసిన సవరణలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ న్యాయశాఖ కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, భూదాన్ బోర్డు కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూదాన్ బోర్డు చట్టానికి పలు సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది తీసుకొచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ న్యాయవాది కుంభం శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.