రేటు కట్టి మరీ లంచాలా? | The High Court in awe of corruption in revenue department | Sakshi
Sakshi News home page

రేటు కట్టి మరీ లంచాలా?

Published Tue, Dec 1 2015 7:57 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

రేటు కట్టి మరీ లంచాలా? - Sakshi

రేటు కట్టి మరీ లంచాలా?

రెవెన్యూశాఖలో అవినీతిపై హైకోర్టు విస్మయం
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు సంబంధించిన పనులు చేసేందుకు రెవెన్యూశాఖ అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి మరీ అవినీతికి పాల్పడుతుండడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పరిస్థితులు ఇలా ఉంటే రైతుల ఆత్మహత్యలను ఎలా నివారించగలరని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. పట్టాదారు పాస్ పుస్తకాలు, విద్యుత్ సరఫరా నిమిత్తం ట్రాన్స్‌ఫార్మర్లను పొందడం రైతుల హక్కులని పేర్కొంది. చిన్న చిన్న పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే రైతులను లంచాల కోసం పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం దారుణమని... ఇది వారిని వేధింపులకు గురి చేయడమేనని హైకోర్టు స్పష్టం చేసింది. అధికారులు నిర్ణయించుకున్న ‘రేట్ల’ను చూస్తుంటే తమకు షాక్ కలుగుతోందని పేర్కొంది.

రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఒకవైపు ప్రభుత్వం చెబుతుండగానే... మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ స్థాయి అవినీతి ఏమిటంటూ నిలదీసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, ముఖ్యంగా రెవెన్యూశాఖలో అవినీతి తగ్గినప్పుడే రైతుల ఆత్మహత్యలు కూడా తగ్గుతాయని తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ... విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మహబూబ్‌నగర్ జిల్లాలో రెవెన్యూ అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేటును నిర్ణయించుకుని, ఆ మేర రైతుల నుంచి వసూలు చేస్తున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. దానిపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పట్టాదారు పాసు పుస్తకం జారీకి రూ.2వేలు, ట్రాన్స్‌ఫార్మర్ అనుమతి కోసం రూ. 4 వేలు... ఇలా ప్రతీ పనికి ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారని, ఇదంతా ఏమిటని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ స్పందిస్తూ... పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు.

తిరిగి ధర్మాసనం స్పందిస్తూ.. అసలు రైతులు కార్యాలయాలకు రాకుండానే, నేరుగా ఆన్‌లైన్ ద్వారా పనులు పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనికి సంబంధించి మీసేవ కేంద్రాలున్నాయని సంజీవ్‌కుమార్ తెలపగా... అవి సక్రమంగా పనిచేస్తున్నట్లు లేదని, అవి సరిగా పనిచేస్తుంటే ఇలా రేట్లు నిర్ణయించి మరీ ఎలా డబ్బు వసూలు చేయగలుగుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. పాసు పుస్తకాలు, విద్యుత్ కోసం ట్రాన్స్‌ఫార్మర్లు పొందడం రైతుల హక్కు అని... అధికారులు రేట్లు నిర్ణయించి మరీ డబ్బు వసూలు చేయడం ద్వారా ఆ హక్కులను కాలరాస్తున్నారని మండిపడింది.

కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం వారిని వేధింపులకు గురి చేయడమేనని పేర్కొంది. ఇలాగైతే రైతుల ఆత్మహత్యలను ఎలా నివారిస్తారని నిలదీసింది. ఈ కేసులో సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డిని కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా నియమించింది. ఈ సందర్భంగా సత్యంరెడ్డి స్పందిస్తూ... రెవెన్యూ శాఖలో అవినీతి పెచ్చుమీరి పోయిందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ రావాలంటే రూ. 4 వేల లంచం సరిపోదని, కనీసం రూ. 50 వేల దాకా చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. దీంతో అవినీతి నిరోధానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని సత్యంరెడ్డిని ధర్మాసనం కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement