పదోన్నతి వచ్చింది.. పోస్టింగ్ పోయింది
♦ తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా మారి ఐదు నెలలు
♦ వేకెన్సీలు చూపించి నోటిఫై చేసి ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం
♦ సచివాలయం చుట్టూ తిరుగుతున్న 30 మంది డిప్యూటీ కలెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పదోన్నతులు ఇచ్చినా పోస్టింగ్‌లు మాత్రం ఇవ్వట్లేదు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు మొత్తం 30 మంది డిప్యూటీ కలెక్టర్ కేడర్ అధికారులు ఏ పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు. ఆ అధికారులు పనిచేసేందుకు వేకెన్సీలున్నా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో సదరు అధికారులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
మొత్తం 82 మంది..
వాస్తవానికి, గత ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 82 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా డీపీసీ ద్వారానే పదోన్నతి కల్పించా రు. అందులో 57 మందికి పోస్టింగ్‌లిచ్చారు. 52 మందికి రెవెన్యూ శాఖలో, మరో ఐదుగురిని సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖల్లో సర్దుబాటు చేశారు. 25 మందికి ఎక్కడా పోస్టింగ్‌లివ్వలేదు. ఇతర శాఖలకు పంపిన ఐదుగురి పోస్టింగ్‌లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో వారు కూడా ఆయా శాఖల్లో బాధ్యతలు చేపట్టలేదు. ఫిబ్రవరిలో పదోన్నతులు రావడంతో తహసీ ల్దార్ పోస్టుల నుంచి రిలీవ్ అయిన వీరంతా ఇప్పుడు ఎక్కడా విధుల్లో లేరు.
ఎన్ని పనులున్నా..
సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, సాదాబైనామాలు, భూముల సమగ్ర సర్వే, నిషేధిత భూముల జాబితా తయారీతో పాటు ఇతర వ్యవహారాలు రాష్ట్ర రెవెన్యూ శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భూసేకరణ, భూ భారతి, సీసీఎల్‌ఏ కార్యాలయం, ల్యాండ్ సర్వే విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తమ శాఖకు 15 మంది అధికారులను ఇవ్వాలని రెవెన్యూ శాఖకు మైనార్టీ సంక్షేమ శాఖ లేఖ కూడా రాసింది. అయినా పదోన్నతులు పొందిన 30 మందికి మాత్రం మోక్షం కలగడం లేదు.
బంతి సీఎం కోర్టులో..
వీరి పోస్టింగ్‌లకు సంబంధించిన ఫైలు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి సీఎం కార్యాలయానికి వెళ్లి మూడు నెలలు దాటిందని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆ ఫైలుకు మోక్షం కలగకపోవడంతో తమ పోస్టింగ్‌ల కోసం సచివాలయం, మంత్రి పేషీ చుట్టూ సదరు అధికారులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయితే, ఫైలు సీఎం దగ్గరికి వెళ్లాక తానేమీ చేయలేనని మంత్రి కూడా చేతులెత్తేసినట్లు సమాచారం. పోస్టింగ్‌లు లేని జాబితాలో ఉన్న ఇద్దరు అధికారులు ఇటీవలే రిటైర్డ్ కానుండటంతో సీఎస్ చొరవ తీసుకుని వారికి అడ్‌హాక్ పోస్టింగ్‌లిచ్చి మరుసటి రోజు పదవీ విరమణ చేయించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తమకు వీలున్నంత త్వరగా పోస్టింగ్‌లివ్వాలని, విద్యా సంవత్సరం ప్రారంభమయిన నేపథ్యంలో పిల్లలను ఎక్కడ చేర్పించాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో తామున్నామని ఆ అధికారులు కోరుతున్నారు.